బ్యాంకు రుణం నుంచి రైతుభరోసా వరకూ ఏ ఒక్కటీ అందని పరిస్థితి
రబీలోనైనా రుణాల మంజూరులో న్యాయం జరిగేనా
2019 పంట సాగుదారు హక్కుచట్టంతో అంతా అస్తవ్యస్థం
ఇ-క్రాప్‌లో పేరులేక ధాన్యం సైతం అమ్ముకోలేని దుస్థితి
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3 లక్షల మంది కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
వాస్తవ సాగుదారుడైన కౌలురైతులను ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. '2019 పంట సాగుదారు హక్కుచట్టం' తెచ్చి కౌలురైతులకు ప్రభుత్వ సాయం ఏ ఒక్కటీ అందకుండా చేసింది. దీంతో కౌలురైతులు వ్యవసాయ సాగులో తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక కౌలురైతులు ఉన్నది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే. అధికారుల లెక్కల ప్రకారం మూడు లక్షల మందికిపైగా కౌలురైతులు జిల్లాలో ఉన్నారు. 2011 భూఅధీకృత సాగుదారుని హక్కు చట్టంతో కౌలురైతులకు కొన్ని హక్కులు కల్పించారు. భూయజమానితో సంబంధం లేకుండా కౌలుకార్డు జారీచేసి బ్యాంకు రుణాల నుంచి ప్రభుత్వం అందించే ప్రతి సాయం కౌలురైతులకు అందేలా చట్టంలో పేర్కొన్నారు. దీంతో అధికారులు కౌలుకార్డులు ఇవ్వకపోతే రైతుసంఘాల ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించి సాధించుకునేవారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2011 కౌలుచట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసేసింది. దాని స్థానంలో 2019 పంట సాగుదారు హక్కుచట్టం తెచ్చింది. ఈ చట్టంలో భూయజమాని అంగీకారం లేకుండా కౌలు రైతులకు సిసిఆర్‌సి(కౌలుకార్డు) ఇవ్వకూడదని తెలిపింది. సిసిఆర్‌సి కార్డు లేకుంటే బ్యాంకు రుణం నుంచి బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, రైతుభరోసాతోపాటు చివరికి ధాన్యం అమ్ముకునే పరిస్థితి కూడా కౌలురైతులకు లేకుండాపోయింది. కౌలుకార్డులు కూడా అరకొరగా మంజూరు చేస్తున్నారు. కార్డులు ఇచ్చినవారికి కూడా బ్యాంకు రుణాలుగాని ప్రభుత్వ సాయం పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొంది.
కౌలురైతుల గురించి పట్టించుకునేవారేరీ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 70శాతానికిపైగా వ్యవసాయ సాగు కౌలురైతులే చేస్తున్నారు. తమ భూములు కౌలుకిచ్చేసి భూయజమానులంతా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు అందించాల్సిన సాయం మాత్రం సాగుచేయని భూయజమానులకే ప్రభుత్వం అందిస్తోంది. నిబంధనల ప్రకారం పంటరుణం సాగుచేసే రైతుకు అందించాలి. భూయజమానికి పంటేతర రుణం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదు. రైతుమిత్ర గ్రూపులకు అరకొరగా రుణాలిచ్చి అవే కౌలురైతులకిచ్చిన రుణాలుగా కాగితాల్లో చూపిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో కౌలురైతులకిచ్చిన రుణాలపై ఏఒక్క అధికారీ నోరు మెదపని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖాధికారులు కౌలురైతుల గురించి పట్టించుకోని పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. ప్రస్తుతం పండించిన ధాన్యం సైతం భూయజమాని పేరుపైనే కౌలురైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. భూయజమాని అంగీకరించలేదని సిసిఆర్‌సి కార్డులు ఇవ్వకుండా భూయజమానికి ఉన్న సాగుభూమి అంతా వారిపేరుపైనే ఇ-క్రాప్ చేశారు. ఇప్పుడు 12.50 ఎకరాలు వరకూ మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు. మరి ఆ భూయజమాని పొలం సాగు చేసిన కౌలురైతులు ధాన్యం ఏవిధంగా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాగుచేసే రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా కూడా కౌలురైతులకు అందడం లేదు. ఏదో ఒకరిద్దరికి ఇచ్చి కౌలురైతులకు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. రబీలోనైనా కౌలురైతులకు పూర్తిస్థాయిలో బ్యాంకు రుణాలు అందించడంతోపాటు భూయజమాని అంగీకారంతో సంబంధం లేకుండా సిసిఆర్‌సి కార్డులు ఇచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కౌలురైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది.










