ప్రజాశక్తి - తాళ్లరేవు
భూ యజమానులు కౌలు(సిసిఆర్‌సి) కార్డుకు అనుమతిచ్చి ఐదు బస్తాలు కౌలు తగ్గిస్తేనే కౌలు భూమి సాగు చేస్తామని చిన్న బాపనపల్లి, పెద్ద బాపనపల్లి గ్రామ కౌలు రైతులు తీర్మానించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు ఆధ్వర్యంలో చిన్న బాపనాపల్లి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసుకున్నారు. ఒక కౌలు రైతు చేస్తున్న భూమిపై మరొకరు పోటీకి వెళ్లరాదని, కౌలు 5 బస్తాలు తగ్గించాలని, కౌలు కార్డు లేకుండా భూమి చేయరాదని తీర్మానం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. ఈ కాలంలో రైతాంగాన్ని నష్టపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు కుదించడం వల్ల ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పంటలకు మద్దతు ధర లేక నష్టపోతున్నా రన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలను కోల్పోతున్నామన్నారు. కౌలు పెంచడం వల్ల కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. పుస్తెలు తాకట్టుపెట్టి సాగుచేస్తున్నా కౌలు రైతులకు కనీసం తిండి గింజలు కూడా మిగలట్లేదన్నారు. ఈ సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు దక్కితేనే ఆత్మహత్యలు ఆగుతాయన్నారు. రైతులందరూ వ్యవసాయాన్ని శాస్త్రీయంగా చేయాలని తెలిపారు. అనంతరం సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మాత సుమన్ అధ్యక్షులుగా, దొమ్మేటి మురళీధర్ కార్యదర్శిగా 20 మందితో కమిటీ వేశారు. ఈ కార్యక్రమంలో పంపన నాగేశ్వరరావు, దొమ్మేటి కోటేశ్వరరావు, దడాల వాడపల్లి, దొమ్మేటి జానకి రాముడు, చీకట్ల త్రిమూర్తులు, మేడిశెట్టి సూర్యనారాయణ, వల్లు శ్రీహరిరావు, పి.నూకరాజు, దారా కృష్ణమూర్తి, కౌలు రైతులు పాల్గొన్నారు.










