Jun 10,2023 22:48

కౌలుకార్డుల జారీ ప్రక్రియలో తీవ్ర నిర్లక్ష్యం
ప్రచారం, గ్రామసభలు అన్నింటికీ తిలోదకాలు
నోరుమెదపని వ్యవసాయశాఖ జిల్లా అధికారులు
రెండు జిల్లాల్లో మూడు లక్షల మంది వరకూ కౌలురైతులు
భూయజమాని అంగీకారం నిబంధన పేరుతో కొర్రీలు
ప్రభుత్వం, అధికారుల తీరుపై అన్నదాత ఆగ్రహం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

రైతుల బాగోగులు చూడాల్సిన వ్యవసాయశాఖ మొద్దునిద్రలో జోగుతోంది. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో వ్యవసాయసాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతుల గురించి పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఖరీఫ్‌ సాగు ఆరంభమవుతున్నా ఇప్పటికీ కౌలుకార్డుల జారీ ప్రక్రియ తూతూమంత్రంగా అన్నట్లు తయారైంది. భూయజమాని అంగీకారం ముసుగులో కౌలురైతుల బతుకులకు కొర్రీలు వేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.
రైతే దేశానికి వెన్నెముక.. మాది రైతు ప్రభుత్వం అంటూ ఊదరగొడుతున్న పాలకులు రైతుల గురించి పట్టించుకోని పరిస్థితి నెలకొంది. రైతుల బాగోగులు చూడాల్సిన వ్యవసాయశాఖ అధికారులు ఎసి గదులకు పరిమితమవుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం జిల్లాలోని కౌలురైతులకు పెనుశాపంగా మారింది. రెండు జిల్లాల్లోనూ దాదాపు మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో వ్యవసాయ సాగు 70 శాతానికిపైగా కౌలురైతులే చేస్తున్నారు. ప్రతియేటా ఏప్రిల్‌ రెండో వారంలో కౌలుకార్డులు (సిసిఆర్‌సి) జారీ ప్రక్రియ ప్రారంభించేవారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించడం, గ్రామసభలు పెట్టి రైతులకు అవగాహన కల్పించడం వంటి చర్యలను వ్యవసాయ, రెవెన్యూశాఖలు చేపట్టేవి. ఈ ఏడాది కౌలుకార్డుల ప్రక్రియను తూతూమంత్రం అన్నట్లు తయారైంది. కౌలుకార్డుల ప్రక్రియపై ఇప్పటి వరకూ వ్యవసాయశాఖ జిల్లా అధికారులు నోరుమెదపని పరిస్థితి ఉంది. గతంలో కౌలుకార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, రైతులకు అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగా మీడియాకు వివరాలిచ్చేవారు. కౌలుకార్డుల ప్రక్రియపై ఏం జరుగుతుందో, ఇప్పటి వరకూ ఎన్ని కౌలుకార్డులు జారీచేశారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వంటి వివరాలేవీ మీడియాకు చెప్పని పరిస్థితి నెలకొంది. తమ అలసత్వం బయటపడుతుందనే ఆలోచనతో మీడియాకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఫోన్‌ చేసినా సమాధానం చెప్పే పరిస్థితి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో లేకుండాపోయింది. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు తమకు రైతులతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లు, నియంతల మాదిరిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ శాఖాధికారులే రైతుల గురించి ఆలోచించకపోతే ఇక అన్నదాత పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. ఇప్పటి వరకూ పదిశాతం మాత్రమే కౌలుకార్డుల జారీ జరిగినట్లు తెలుస్తోంది. కౌలుకార్డుల జారీ ప్రక్రియ వేగవంతంపై జిల్లా కలెక్టర్లు చొరవ చూపకపోతే అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
భూయజమానితో
సంబంధం లేకుండా కౌలుకార్డులివ్వాలి
ఎ.హరేరాం, ఎపి రైతుసంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి

గ్రామసభలు నిర్వహించాలి. విఆర్‌ఒ, వ్యవసాయాధికారి, వాలంటీర్లతో పరిశీలన చేసి అర్హులైన కౌలురైతులందరికీ భూయజమాని అంగీకారంతో సంబంధం లేకుండా కౌలుకార్డులు జారీ చేయాలి. ఓటుహక్కు మాదిరిగా అర్హులైన ప్రతి కౌలురైతుకూ కౌలుకార్డు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. పంట రుణం, పంట నష్టపరిహారం, బీమా వంటివి కౌలురైతులు పొందేవిధంగా కౌలుకార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలి.
భూయజమాని అంగీకారం ముసుగులో కొర్రీలు
వైసిపి ప్రభుత్వం వచ్చాక 2019 భూసాగుదారు హక్కుచట్టం పేరుతో 2011లో వచ్చిన కౌలురైతుల చట్టంలో మార్పులు చేసింది. భూయజమాని అంగీకారంతోనే కౌలుకార్డులు జారీ చేయాలని నిబంధన విధించింది. భూయజమానులకు వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు అవగాహన కల్పించి కౌలురైతులకు కౌలుకార్డులు జారీ చేస్తారని పేర్కొంది. ఎక్కడా అటువంటి పరిస్థితి లేకుండాపోయింది. భూయజమాని అంగీకరించడం లేదనే కారణంతో కౌలురైతులకు కార్డులు ఇవ్వడం లేదు. దీంతో పంట నష్టపరిహారం, బీమా, రైతుభరోసా వంటి ఏఒక్క ప్రభుత్వ సాయం కౌలురైతులకు అందడం లేదు. భూయజమానులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తెచ్చిన భూయజమాని అంగీకారం నిబంధన కౌలురైతులకు ఉరితాడు మాదిరిగా తయారైంది. జారీ చేస్తున్న కౌలుకార్డులో చాలావరకూ బోగస్‌ అంటూ విమర్శలు సైతం విన్పిస్తున్నాయి. భూయజమాని బంధువులకు కార్డులు జారీ చేసి లెక్కలు చూపిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇప్పటికైనా కౌలురైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుసంఘాలు కోరుతున్నాయి.