ప్రజాశక్తి-బాపట్ల: వ్యవసాయం కౌలు రైతులపైనే అధిక శాతం ఆధారపడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. ఆదివారం బాపట్ల మండలంలోని బేతపూడి, మూలపాలెం, ఉప్పరపాలెం, గ్రామాల్లో పర్యటించి కౌలు రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. కౌలు రైతులు వ్యవసాయం మానేస్తే ప్రజలకు తిండి గింజలు కరువు అవుతాయన్నారు. కౌలు రైతుల శ్రమను, కష్టనష్టాలను గుర్తించకుండా అధికారులు అనేక షరతులు విధిస్తూ కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో షరతులు పెట్టకుండా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చొరవ చూపి ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక చోట్ల కౌలు రైతులను, రైతు భరోసా కేంద్రాలు, వీఆర్వోలు కౌలు రైతులుకు అవసరమైన సహాయం అందించకపోగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వ్యవసాయం చేసే కౌలు రైతులకు విపత్తు సమయంలో పంట నష్టానికి పరిహారం కౌలు రైతులకు అందడం లేదని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని గ్రామాల్లో కౌలు రైతులు వాపోయారని తెలిపారు. తక్షణమే జిల్లా కలెక్టరు, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ కే శరత్, కౌలు రైతు సంఘం నాయకులు అయ్యప్ప రెడ్డి, దినేష్ పాల్గొన్నారు.










