Jun 09,2023 22:02

ప్రజాశక్తి - పశ్చిమయంత్రాంగం
           ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టాన్ని సవరించి, కౌలురైతులకు విరివిగా పంట రుణాలివ్వాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.బాలకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కౌలు రైతు రక్షణ జీపు యాత్ర శుక్రవారం జిల్లాలోకి యలమంచిలి మండలం చించినాడ వద్ద ప్రవేశించింది. ఈ సందర్భంగా జిల్లాలో యాత్రను సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాత్ర చించినాడ, యలమంచిలి, గుంపర్రు, కాంబొట్లపాలెం, వల్లూరు, ఆచంట, ములపర్రు, తామరాడచెరువు, పెనుగొండ, ఇరగవరం, కొత్తపాడు, జుత్తిగ, మంచిలి, అత్తిలి, పిప్పర మీదుగా రాత్రికి గణపవరం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ భూయజమానులకే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు గుర్తింపు కార్డుల కోసం భూయజమానులు సంతకం పెట్టడం లేదని, కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూయజమాని సంతకం నిబంధన తొలగించి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెట్టుబడి సాయం కింద రూ.25 వేలు ఇవ్వాలని, భూమిలేని కౌలు రైతులకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలతో కౌలురైతులకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. ప్రభుత్వం కౌలు రైతులకు సాగు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుని సాగు చేసి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల కష్టాలు తీరాలంటే కౌలు రైతుల చట్టాన్ని పూర్తిగా మార్చాలన్నారు. కౌలు రైతుల సమస్యలపై ఈ నెల 12న విజయవాడలో జరిగే మహా పాదయాత్రలో కౌలు రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూసంపూడి సుబ్బరాజు, మామిడిశెట్టి రామాంజ నేయులు, నాయకులు వద్దిపర్తి అంజిబాబు, సిర్రా నరసింహమూర్తి, పిల్లి ప్రసాద్‌ పాల్గొన్నారు.