Jan 27,2023 22:12

ఈ ఏడాది ఏలూరు జిల్లాలో పంట రుణాల లక్ష్యం రూ.7,407 కోట్లు
75 శాతం సాగుచేస్తున్న కౌలురైతులకు రుణాల మంజూరులో దారుణం
57 వేల మందికి కౌలుకార్డుల లక్ష్యంలో 43 వేల మందికే అందజేత
మంజూరైన రుణంలో ఒక్కో రైతుకు రూ.పది వేలు కూడా రాని దుస్థితి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

                వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఏలూరు జిల్లాలో కౌలురైతులకు మంజూరైన రుణాలు లెక్కలు చూస్తే కౌలురైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో 28 మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యవసాయ సాగులో 75 శాతం వరకూ కౌలురైతులే చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో పెద్దఎత్తున కౌలురైతులు ఉన్నప్పటికీ కౌలు(సిసిఆర్‌సి)కార్డుల జారీ కింద జిల్లా అధికారులు తీసుకున్న లక్ష్యం కేవలం 57,652 మందికి మాత్రమే. నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకైనా కౌలుకార్డులు మంజూరు చేశారా అంటే అదీ లేదు. ఏలూరు జిల్లావ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 43,551 కార్డులు మంజూరయ్యాయి. అంటే నిర్ధేశించుకున్న లక్ష్యం ప్రకారం చూసినా ఇంకా దాదాపు 14 వేల మంది కౌలురైతులకు కార్డులు మంజూరు కాలేదు. కౌలుకార్డులు ఇచ్చిన రైతులకు మంజూరు చేసిన పంట రుణాల లెక్కలు చూస్తే ఔరా అనిపించక మానదు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ ఏలూరు జిల్లాలో 42,139 మంది కౌలురైతులకు రూ.41.64 కోట్ల రుణం మంజూరు చేశారు. అంటే ఒక్కో రైతుకు రూ.9,882 రుణం ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. కౌలురైతులు తక్కువగా లెక్కించినా రెండెకరాలు సాగు చేస్తారు. ఎక్కువ మంది మూడెకరాల నుంచి ఐదెకరాల వరకూ సాగుచేసే పరిస్థితి ఉంది. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం చూసినా వరిసాగులో ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. రెండెకరాలు సాగు చేసే కౌలురైతులకు రూ.పది వేలు కూడా రుణం అందించకపోతే సాగుకు ఏవిధంగా ప్రోత్సాహం ఇచ్చినట్లో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని రైతాంగానికి రూ.7,407 కోట్లు పంట రుణాలు లక్ష్యంగా ఇవ్వాలని నిర్ధేశించారు. నిబంధనల ప్రకారం పంట రుణాలు అనేవి సాగు చేసే కౌలురైతులకు ఇవ్వాలి. భూయజమానులకు పంటేతర రుణం ఇవ్వాలి. అటువంటి పరిస్థితి మాత్రం లేకుండాపోయింది. రూ.ఏడు వేల కోట్లకు పైగా పంటరుణాల లక్ష్యం కాగా అందులో జిల్లా వ్యవసాయ సాగులో 75 శాతం సాగుచేస్తున్న కౌలురైతులకు ఇచ్చింది కేవలం రూ.41.64 కోట్లు మాత్రమే. దీన్నిబట్టి నిర్దేశించుకున్న లక్ష్యంలో ఎంతశాతం రుణం అందించారో అర్థం చేసుకోవచ్చు.
పెట్టుబడుల కోసం నానావస్థలు
జిల్లా వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతులకు పంటరుణాలు అందడం లేదని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. దీంతో సాగు పెట్టుబడులకు కౌతురైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గతంలో రైతులు తాము పండించిన ధాన్యం మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారులకు విక్రయించేవారు. దీంతో తమకు కావాల్సిన పెట్టుబడి అంతా మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారుల నుంచే తీసుకునేవారు. ధాన్యం విక్రయించిన తర్వాత లెక్కలు చూసుకునే వారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కొత్త నిబంధన తెచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మాలని నిబంధన పెట్టింది. ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తుండటంతో మిల్లర్లు, కమీషన్‌ వ్యాపారులు రైతులకు పెట్టుబడులు పెట్టడం నిలిపివేశారు. దీంతో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బ్యాంకుల నుంచి ప్రభుత్వం రుణాలు అందించకపోవడం, మరోపక్క కమీషన్‌ వ్యాపారులు, మిల్లర్లు పెట్టుబడులు నిలిపివేయడంతో కౌలురైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఈ ఏడాది ఇప్పటి వరకూ కేవలం రూ.41.64 కోట్లు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇవ్వడంపై కౌలురైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. భూయజమానులను ఒప్పించి కౌలురైతులకు రుణాలిప్పించడంలో జిల్లా వ్యవసాయశాఖ విఫలమైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో కౌలురైతులు సాగు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడనుంది. అదే జరిగితే వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం రానుంది. వ్యవసాయ సాగులో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు.