Sep 30,2023 23:02

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : సిసిఆర్సి ఉన్న ప్రతి కౌలు రైతుకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక రాయభారం కార్యక్రమంలో భాగంగా శనివారం లీడ్‌ బ్యాంక్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా కార్యదర్శి పి. రంగారావు మాట్లాడుతూ సిసిఆర్సి వచ్చిన ప్రతి కౌలు రైతుకు పంట రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, వ్యవసాయ రుణ ప్రణాళికలో పది శాతం కౌలు రైతులకు ఇవ్వాలని నిర్ణయించారని కానీ ఎక్కడ ప్రభుత్వ ఆదేశాలు అమలు కాలేదన్నారు. కౌలు రైతులు రుణాలు కోసం వెళితే చుట్టుపక్కల బ్యాంకులు నుండి ఎన్‌ ఓ సి, తీసుకు రమ్మంటున్నారని కొన్నిచోట్ల యజమాని సంతకం, పట్టాదారు పాస్‌ పుస్తకం కావాలని అడుగుతున్నారని ఇలా అయితే కౌలు రైతులకు రుణాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అలాగే భూ యజమాని రుణం తీసుకొని ఉంటే ,సిసిఆర్సి ఉన్న కౌలు రైతులు బయట అధిగ వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసి అప్పులు పాలవుతున్నరన్నారు. కాబట్టి కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఎకరాకు 36 వేలు రుణం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యజమాని సంతకం, ఎన్‌ఓసి , ఫైనాన్స్‌ మొదలగు షరతులు విధించరాదన్నారు. అనంతరం జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జయవర్ధన్‌ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు టి వి.లక్ష్మణ స్వామి, గౌరిశెట్టి నాగేశ్వరావు, వాకా రామచంద్ర రావు,కె.శివ నాగేంద్ర రావు, తదితరులు ఉన్నారు.