Sep 01,2023 22:40

నమూనా చెక్కును విడుదల చేస్తున్న కలెక్టర్‌ లాఠకర్‌

* 236 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.19.59 లక్షలు
* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో 2,801 మంది కౌలు రైతులకు రూ.21 కోట్లు రైతుభరోసాతో పాటు అధిక వర్షాల కారణంగా 78.36 ఎకరాల్లో నష్టపోయిన 236 రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ 19.59 లక్షలు ప్రభుత్వం విడుదల చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. అర్హులైన కౌలు రైతులకు చివరి విడత రైతుభరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. ఈ ఏడాది మే, ఆగస్టు మధ్య కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసినట్లు వివరించారు. గార, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో అధిక వర్షాలు, గాలుల కారణంగా 78.36 ఎకరాల్లో అరటి పంట నష్టపోయిన 236 రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.19.59 లక్షలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. అర్హులు ఏఒక్కరూ మిగిలిపోకుండా ఈ-క్రాప్‌ ఆధారంగా పంట నష్టాలను అంచనా వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సీజన్‌లో జరిగిన పంట నష్టాన్ని సీజన్‌ ముగిసేలో గానే నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు పంట నష్టపరిహారం నమూనా చెక్కులను అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, డిసిసిబి చైర్మన్‌ కె.రాజేశ్వరరావు, కళింగవైశ్య కార్పొరేషన్‌ అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, జిల్లా అగ్రికల్చరల్‌ అడ్వైజరీ చైర్మన్‌ నేతాజీ, సభ్యులు గొండు రఘురాం, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్‌, ఉద్యానవన శాఖ ఎడి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.