ప్రజాశక్తి-కాకినాడ భూ యజమాని తీసుకున్న అప్పుతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకూ రూ.లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని ఎపి కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ లీడ్ బ్యాంక్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ జిల్లాలో 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ 55 వేల మందికి మాత్రమే కౌలు కార్డులు ఇచ్చారని వీరిలో 30 శాతం మందికి పంట రుణాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కౌలు రైతుకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇస్తామని నమ్మించి ఇప్పుడు పంట రుణం కోసం బ్యాంకుల వద్దకు పోతే మీరు చేస్తున్న భూమిపై ఇప్పటికే పంట రుణం భూయజమాని తీసుకున్నారని మీకు పంట రుణం రాదని కౌలు రైతులను తిరిగి పంపుతున్నారన్నారు. ఇచ్చిన కొంతమందికైనా రిజర్వు బ్యాంకు గైడ్‌లైన్స్ ప్రకారం ఒక ఎకరాకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ.30,000 మించి ఇవ్వాలని, 5 ఎకరాలు చేస్తున్న రైతుకు రూ.1,50,000 ఇవ్వాన్నారు. కానీ రూ.20 వేల నుంచి రూ.30 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారు. సిసిఆర్సి కార్డు లేకపోయినప్పటికీ ఈ క్రాప్ అయితే పంట రుణం ఇస్తామని చెప్పి ఇప్పుడు సిసిఆర్సి తప్పనిసరి అని బ్యాంకు వారు అంటున్నారని ఇలా అయితే కౌలు రైతులకు పంట రుణాలు రావన్నారు. ఈ సమస్య పరిష్కరించాలన్నారు. గతంలో తాళ్ళరేవు యూనియన్ బ్యాంకులో పోలేకుర్రులో ఒకరిద్దరు వ్యక్తులు బ్యాంకు అప్పు ఎగ్గొట్టిన కారణంగా కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వనని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.అనంతరం ఎల్‌డిఎం, ఎజిఎంలను కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఎజిఎం చిన్న బాపనపల్లి రైతులకు పంట రుణాలు ఇస్తామని అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి సిహెచ్.సంతోష్, కొంకే సత్యనారాయణ, పెండెం కొండ, బళ్ల భీమారావు, తిరుకోటి కృష్ణ, పంపన నాగేశ్వరరావు, అనుసూరి చిన్న, పెండెం లోవరాజు, పెండెం జాను, పెండం సత్యనారాయణ, తిరుక్కోటి నాని రేవు చిన్నబ్బాయి పాల్గొన్నారు.










