
ప్రజాశక్తి- మునగపాక రూరల్
కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఏ బాలకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం కౌలు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మండలంలో నూటికి 70 శాతం మంది పైగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారన్నారు. 2019 సంవత్సరంలో సిసిఆర్సి చట్టంలో భూ యజమాని ఆమోదంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలనే నిబంధనతో నూటికి పది మందికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వలేదని ఆయన వాపోయారు. ఇటీవల కాలంలో కౌలు రైతులు ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరిగాయని, దీనికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు నిర్వహించి సిసిఎల్‌ఎకు రాయభారం నిర్వహించామన్నారు. కౌలు రైతులు అందరికీ భూ యజమానితో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట రుణాలు, ఇన్సూరెన్స్, పంట నష్ట పరిహారం, ఈక్రాప్ నమోదు, రైతు భరోసా తదితర ప్రోత్సాహకాలు కౌలు రైతులకు అందించాలని కోరారు. అనంతరం తహశీల్దారు ప్రకాష్‌రావుకు వినతిపత్రం, కౌలు గుర్తింపు కార్డులకు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, సిఐటియు నాయకులు వివి. శ్రీనివాసరావు, ఎస్ బ్రహ్మాజీ, కౌలు రైతు సంఘం నాయకులు టెక్కలి జగ్గప్పారావు, కౌలు రైతులు వెలగా సంజీవరావు, వేగి శివ, పెంటకోట సత్యనారాయణ, వేగి కృష్ణ, పెంటకోట సాయిరాం, పెంటకోట వెంకట్, ఆడారి సత్యనారాయణ, వెలగా బుజ్జిబాబు పాల్గొన్నారు.