Jun 08,2023 20:00

గోడపత్రికలను విడుదల చేస్తున్న దృశ్యం

కౌలు రైతుల రక్షణ యాత్రను జయప్రదం చేయండి
యజమాని సంతకం లేకుండా సిసిఆర్‌సి కార్డు ఇవ్వాలి

ప్రజాశక్తి - కొత్తపల్లి

గ్రామాల్లో ఉన్న కౌలు రైతులకు మేలు జరిగేలా చట్టాన్ని సవరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్‌ స్వాములు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్‌ సంజీవ రాయుడు విజ్ఞప్తి చేశారు. గురువారం వారు మాట్లాడుతూ భూ యజమాని సంతకం లేకుండానే గ్రామసభల ద్వారా సిసిఆర్సి కార్డులు ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద 25 వేల రూపాయలు ఇవ్వాలని దేవాదాయభూముల కౌలుదారులకు సిసిఆర్సి కార్డులు ఇవ్వాలన్నారు. పంట సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని కనీసం మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించి పంటలను కొనుగోలు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరహాలో రుణ విముక్తి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 60 ఏళ్ళు నిండిన కౌలు రైతులకు 6 వేల రూపాయలు పెన్షన్‌ ఇవ్వాలని కౌలు రైతులను ఈ క్రాప్‌లో నమోదు చేసి రాయితీలు అన్నింటిని కౌలు రైతులకు అందించాలని తెలిపారు. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన కౌలు రైతు రక్షణ యాత్ర రాష్ట్ర నలుమూలల నుండి ఈనెల 12వ తేదీన విజయవాడ చేరుకుంటుందని విజయవాడ సిసిఎల్‌ఏ కార్యాలయం ముందు జరిగే ధర్నాలు కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కౌలు రైతు రక్షణ యాత్ర గోడ పత్రికలను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఏసన్న, కౌలు రైతు సంఘం నాయకులు గోదా వెంకటరమణ, బాలరాజు, లక్ష్మీనారాయణ, బక్కన్న, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.