రాష్ట్రంలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లాలలో అత్యధిక సంఖ్యలో సాగుదారులు కౌలు రైతులే. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా కౌలు వ్యవసాయం విస్తరించింది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో వ్యవసాయం లాభసాటిగా లేదని భూ యజమానులు వ్యవసాయం వదులుకున్నారు. కౌలు వ్యవసాయంలో వున్నది వ్యవసాయ కార్మికులు, పేద రైతులే. వీరు సామాజికంగా దళితులు, బి.సి లు, అగ్రకులాల లోని పేదలే. నూటికి 70 శాతం భూములకు పైగా వీరే వ్యవసాయం చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో నూటికి 90 శాతం భూములు సాగు చేస్తున్నది వీరే. అయితే వీరికి ప్రభుత్వ సాయం నామమాత్రమే. కనీసం పంట సాగు హక్కు పత్రాలు కూడా అందడం లేదు.
భూ అధీకృత సాగుదారు చట్టం-2011 లోపభూయిష్టంగా ఉందని వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వం 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్ట ప్రకారం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు (సి.సి.ఆర్.సి కార్డులు) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్డులు పొందాలంటే 11 నెలలకు సంబంధించిన కౌలు ఒప్పంద పత్రాలపై భూ యజమానులు సంతకాలు చేయాలి. పట్టాదారు పాసుపుస్తకాలు, భూ యజమానుల ఆధార్ కార్డుల జిరాక్సులు సమర్పించాలి. ఇతర ప్రాంతాలు, దేశాలలో ఉంటే వాట్సాప్ కాల్ లో అయినా వారి అంగీకారం తెలపాలి. నూటికి 90 శాతం మంది భూ యజమానులు కౌలు ఒప్పందాలకు సిద్ధం కావడం లేదు. కౌలు రైతులకు కూడా వారిని కౌలు ఒప్పంద పత్రాలపై సంతకాలు అడిగే ధైర్యం లేదు. అందుకే 2020లో 4,14,778 మందికి మాత్రమే సి.సి.ఆర్.సి కార్డులు అందాయి. మిగిలిన కౌలు రైతులకు నిరాశే మిగిలింది. ఈ కార్డులు లేకపోవడంతో వీరి పేర్లను ఈ-పంట లో నమోదు చేయలేదు. ఫలితంగా ఇన్‌పుట్స్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, రైతు భరోసా పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇతర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వీరి దరి చేరలేదు. ఈ సంవత్సరం జూన్ 30 లోపు సి.సి.ఆర్.సి కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల వద్ద తూతూ మంత్రంగా సభలు నిర్వహిస్తున్నారు. భూ యజమానులు అంగీకరిస్తేనే కార్డులు ఇస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఫలితంగా కౌలు రైతులు ఉత్త చేతులతో వెనుతిరిగి వెళ్ళి పోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వివిధ రూపాల్లో రూ.83 వేల కోట్లు సాయం చేసినట్లు చెబుతోంది. వై.యస్.ఆర్ రైతు భరోసా-పి.ఎం కిసాన్ పెట్టుబడి సాయంగా 52. 38 లక్షల మందికి రూ. 17029 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.1261 కోట్లు, ఉచిత పంటల భీమా పథకంలో 30.82 లక్షల మందికి రూ.3788 కోట్లు ఇన్‌పుట్స్ సబ్సిడీ 13.56 లక్షల మందికి రూ. 1038 కోట్లు అందించినట్టు లెక్కలు ప్రకటించారు. అయితే ఈ ప్రభుత్వ సాయాలు కౌలు రైతులకు అందనేలేదు. పైగా గతంలో బ్యాంకుల ద్వారా కొద్దో గొప్పో పొందుతున్న పంట రుణాలను కూడా కోల్పోయారు. 2021-22 పంట రుణాల లక్ష్యం రూ.1,10,422 కోట్లు కాగా కౌలు రైతులకు రూ.4100 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. క్రమంగా కౌలు రైతుల పంట రుణాలు మంజూరును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.
నేడు ఆహార పంటలు పండిస్తూ దేశ ప్రజలకు తిండిగింజలు అందిస్తున్న అన్నదాతలు కౌలు రైతులే. అయితే కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, అప్పులు...చివరకు ఆత్మహత్యలే మిగులుతున్నాయి. కష్టపడి పండించిన పంటలు కూడా దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు. కౌలు రైతులను నిజమైన రైతన్నలుగా గుర్తించాలి. ప్రభుత్వమే నేరుగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ సాయమందించి ఆదుకోవాలి. కౌలు రైతులు కాడి కింద పడేస్తే ఆహార సంక్షోభమేనని గమనించాలి.
- కె. శ్రీనివాస్,
ఎ.పి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా,
సెల్ : 94900 98574










