Jun 04,2023 22:22

ప్రజాశక్తి -కరప కౌలు చట్టంలో భూ యజమాని సంతకం నిబంధనన ఎత్తివేయాలని, పలు డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 5వ తేదీ నుంచి కౌలు రైతుల జీపు యాత్ర నిర్వహిస్తున్నట్ల్టు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం జాతాపై ప్రచారంలో భాగంగా కరప మండలంలో నడుకుదురు, కొరిపల్లి, వలసపాకల గ్రామాల్లో కౌలు రైతులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కౌలు చట్టంలో భూ యజమాని సంతకం నిభందన ఎత్తివేయకపోతే కౌలు దారుడికి ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉందని విమర్శించారు. పంటలు పండించని భూ యజమానులకు పంట రుణాలు, రైతు భరోసా ఇస్తున్నారని ఇది ఎక్కడి న్యాయమని అయన ప్రశ్నించారు. కౌలు దారులకు న్యాయం చేయాలనుకుంటే పంట సాగు చేసేవారిని రైతు భరోసా కేంద్రం సిబ్బంది ఫీల్డ్‌ విజిట్‌ ద్వారా గుర్తించి వారిని ఈ క్రాప్‌లో నమోదు చేయాలని రాజశేఖర్‌ డిమాండ్‌ చేసారు. ఈ డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా జాతా నిర్వహించి విజయవాడ నుండి మంగళగిరి వరకు పాదయాత్ర చేపట్టామని రాజశేఖర్‌ తెలిపారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాల్లో 7వ తేదీన జాతా జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కాకినాడ నుంచి నడుకుదురు, పెనుగుదురు, కరప, వలసపాకల, మీదుగా కాజులూరు మండలంలోకి యాత్ర సాగుతుందని తెలిపారు. ఈ జాతాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంక చంద్రరావు, నూరుకుర్తి వెంకటరమణ, ఆదినారాయణ పాల్గొన్నారు.