May 21,2023 20:23

విత్తనం వేస్తున్న రైతు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. జీవనాధారం కోసం వ్యవసాయంపైనే ఆధారపడిన కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాల ఖర్చులు పెరగడం, భూయజమానులు కౌలు ధర పెంచుతుండడం వారి పాలిట శాపంగా మారుతోంది. సాగు భారం అధికమైందని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా కౌలు రైతులు ఉన్నట్లు అనధికారిక సమాచారం. ప్రభుత్వం వద్ద అధికారికంగా కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందడం లేదు. కౌలు రైతులకు కనీసం బ్యాంకుల్లో రుణాలందే వీలు కూడా లేదు. ఎలాంటి ఆధారమూ లేకపోవడంతో ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ పథకాలకు కౌలు రైతులు దూరమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే రైతు భరోసా, పంటలు నష్టపోయినప్పుడు ప్రభుత్వం అందజేసే నష్టపరిహారానికీ దూరమవుతున్నారు. వడ్డీ వ్యాపారులపైనే ఆధారపడి అప్పులు చేసి రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు.
భూయజమానుల నుంచి ఒప్పందం
కౌలు రైతులు ముందుగానే భూయజమానుల నుంచి ఒప్పందం చేసుకుని వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. నాలుగేళ్ల నుంచి ఎకరా భూమికి ఏటా రూ.2 వేల వరకు పెరుగుతోంది. ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు కౌలు ఇస్తున్నారు. ఆపై కౌలు రైతులకు పెట్టుబడి భారం తప్పడం లేదు. రాష్ట్రంలో క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్‌ వ్యవస్థ నేపథ్యంలో కౌలు రైతులు సాగు చేస్తున్నా భూయజమానుల పేరిట పంటల వివరాలను వ్యవసాయాధికారులు నమోదు చేస్తున్నారు. మద్దతు ధరకు ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసేటప్పుడు భూయజమానుల ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరు తమ ఖాతాల్లో పడిన పంట డబ్బు నుంచి కౌలు సొమ్మును ముందుగానే మినహాయించుకుని మిగిలిన డబ్బును కౌలు రైతులకు ఇస్తున్నారు.
ఎకరాకు రూ.10 వేలిచ్చి కౌలు చేస్తున్నా
- ఈరన్న, ఢణాపురం గ్రామం, ఆదోని మండలం

కుటుంబాన్ని పోషించుకునేందుకు నాకున్న ఎకరా భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాను. ప్రస్తుతం ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నాను. కౌలు రైతులు నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందడం లేదు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
బ్యాంకు రుణాలివ్వడం లేదు
- రంజాన్‌, పెద్దహరివాణం గ్రామం, ఆదోని మండలం

బతుకుదెరువు కోసం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ప్రతేడాది భూములకు కౌలు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళితే కౌలు రైతులకు బ్యాంకు అధికారులు రుణం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. వ్యాపారుల వద్దకు వెళ్లి పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి సాగు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా తప్పనిసరి పరిస్థితిలో వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలి. ప్రత్యేకంగా గుర్తింపుకార్డులు అందజేసి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి.