Oct 08,2023 21:09

దుక్కుదున్నుతున్న కౌలురైతు

ప్రజాశక్తి - జామి : కౌలు రైతుకు కష్టం వచ్చింది. వైసిపి ప్రభుత్వం కౌలురైతు చట్టం మార్పుతో సిసిఆర్‌సి పత్రాల మంజూరుకు చిక్కులొచ్చి పడ్డాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన కౌలురైతుకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. గత ప్రభుత్వాల్లో కష్టాలు ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 కౌలుచట్టం కౌలురైతు ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేసింది. చట్టంలో భూయజమాని అంగీకారం ఉంటేనే కౌలురైతుకి పంట సాగు గుర్తింపు కార్డు (సిసిఆర్‌సి) ఇవ్వాలని పొందుపరచడం కౌలు రైతుకు మొదటికే మోసం వచ్చింది. ఈ నేపథ్యంలోనే కౌలురైతు గుర్తింపు ప్రహసనంగా మారింది. గత ఏడాది నుంచి సిసిఆర్‌సి పత్రాల మంజూరు అందుకు నిదర్శనం. ఈ ఏడాది ఇప్పటికీ 10 శాతం మందికీ కార్డులు మంజూరు చేయని పరిస్థితి.
విజయనగరం జిల్లాలో 2.27 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 1,82,217 ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారుగా 4 లక్షల మందికి పైగా రైతులున్నారు. ఇందులో సుమారుగా 40 శాతం మంది అనగా 1.60 లక్షల మంది వరకు కౌలురైతులు ఉన్నట్లు అంచనా. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 20 వేల మంది ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైసిపి ప్రభుత్వం 2019 కౌలు చట్టంతో ఉన్నవారికి కూడా గుర్తింపు దక్కని పరిస్థితి దాపురించింది. గతంలో 2011 చట్టంతో గ్రామసభ ద్వారా కౌలురైతుల గుర్తింపు జరిగేది. కానీ వైసిపి తీసుకొచ్చిన చట్టంతో భూయాజమాని అంగీకారం తప్పనిసరి చేసింది. దీంతో ఈ ఏడాది పూర్తిగా కౌలు రైతుకు మొండి చేయి చూపించారు. ఇ-క్రాప్‌, బయోమెట్రిక్‌తో అన్ని సేవలు ముడిపెట్టడం వల్ల కౌలురైతుకు ప్రభుత్వ సేవలు, రాయితీలు దక్కడం లేదు. చివరికి పంట నష్టం వాటిల్లినప్పుడు కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమాలు అక్కరకు రాని దుస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా ఇ-క్రాప్‌ చేపట్టడంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వాస్తవానికి జిల్లాలో మూడు రకాలుగా కౌలు సాగు చేస్తున్నారు. కొంతమంది తనఖా పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరికొంత మంది అరకొర భూమి ఉన్నప్పటికీ దానితో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. మరికొంత మంది గల్లా పద్ధతిలో (ఏడాదికి కొన్ని బస్తాలు తీసుకునే లెక్కన) కౌలుకు చేయడం జరుగుతోంది. వాస్తవానికి యజమాని బంధువులు, సన్నిహితులు తప్ప సామాన్య, నిజమైన కౌలురైతుకు మాత్రం గుర్తింపు లభించడం లేదు. దీంతో జిల్లాలో కౌలురైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. అధికారులు కూడా భూయజమానులకు అనుకూలంగా వ్యవహరించి, సిసిఆర్‌సి గుర్తింపు పారదర్శకంగా చేపట్టడం లేదన్న వాదన లేకపోలేదు. దీంతో కౌలురైతుకు విత్తనం, ఎరువు మొదలుకొని ధాన్యం కొనుగోలు, పంట నష్ట పరిహారం వంటివి కూడా దక్కని పరిస్థితి. కనీసం బ్యాంకు రుణాలు కూడా యజమానులే పొందుతున్నారు. కౌలు గుర్తింపు కాలపరిమితి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ విషయం తెలిసినా లేనిపోని అపోహలు అన్న సాకు కౌలురైతులకు తీరని నష్టం చేకూరుస్తోంది. ప్రభుత్వం పరోక్షం చట్టాలతో కౌలురైతుని నష్టపరుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సాగుదారులందరినీ గుర్తించి, కౌలు గుర్తింపు హక్కు ఇవ్వాలని ఎపి రైతుసంఘం కోరుతోంది.
గత ఐదేళ్లలో
జిల్లాలో కౌలుగుర్తింపు
సంవత్సరం మంజూరైన
కార్డులు
2018-19 7,500
2019-20 11,900
2020-21 19,468
2021-22 12,000
2022-23 11,000