Nov 16,2022 23:53

కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలో మాట్లాడుతున్న ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు

ప్రజాశక్తి-అనకాపల్లి : రాష్ట్రంలో కౌలు రైతులందరూ కౌలు రైతు రుణ విముక్తి చట్టం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయం స్వరాజ్యనగర్‌ పెంటకోట జగన్నాథం ప్రాంగణంలో బుధవారం కౌలు రైతు సంఘం జిల్లా నాలుగో మహాసభ నిర్వహించారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టెక్కలి జగ్గారావు, రామ సదాశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హరిబాబు మాట్లాడారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. వీరిలో కేవలం 5 లక్షలా 74 వేలమందికి గుర్తింపు కార్డులు ఇస్తామని ఐదు లక్షలు కూడా ఇవ్వలేదని చెప్పారు. వీరిలో 15 వేల మందికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం దారుణం అన్నారు. కౌలు రైతుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో ఉన్నాయన్నారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని, కేరళ తరహాలో ప్రైవేటు వ్యవసాయ అప్పులను సైతం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కౌలు రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదన్నారు. దీనికోసం ఐక్య ఉద్యమం తప్పనిసరి అన్నారు. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కౌలు రైతుకూ రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. దేవాదాయ భూముల వాస్తవ సాగుదారులకు కూడా ఈ చట్టం వర్తింపజేయాలన్నారు.
జిల్లా కౌలు రైతు సంఘం గత మూడేళ్ల్లలో చేసిన కార్యక్రమాలు, ప్రగతి నివేదికను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ చదివి వినిపించారు. జిల్లా మహా సభల ప్రారంభానికి ముందు అమరవీరులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం, పెంటకోట జగన్నాథం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల జరిగిన రైతు ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు సంతాపం ప్రకటించారు.
తీర్మానాలు
సుగర్‌ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని, పాల సేకరణ ధర పెంచాలని, నల్ల బెల్లంపై ఆంక్షలు ఎత్తివేయాలని, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు కొనసాగించాలని, వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించరాదని కోరుతూ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కె.లోకనాథం, జిల్లా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం.అప్పలరాజు, కౌలు రైతు సంఘం నాయకులు ఆళ్ళ మహేశ్వరరావు, కాండ్రేగుల రాము, కాళ్ల తేలయ్యబాబు, గండి నాయనబాబు, ఎస్‌వి నాయుడు తదితరులు పాల్గొన్నారు.