Jun 13,2023 00:22

రాయిని వినోద్‌బాబుకు నోటీసు అందజేస్తున్న పోలీసు

ప్రజాశక్తి -పంగులూరు : హక్కుల కోసం పోరాడుతున్న కౌలు రైతుల ఉద్యమాన్ని నిర్బంధాలతో అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా విజయవాడ సిసిఎల్‌ కార్యాలయం వద్ద జరిగే కౌలు రైతులు ఉద్యమానికి వెళ్లకుండా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్‌ బాబుకు పోలీసులు ముందస్తు నోటీసు అందజేశారు. భూ యజమాని సంతకంతో పని లేకుండా, కౌలు రైతుకు కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని, పంట నష్టపరిహారం, పంటల బీమా సౌకర్యం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ, ఈ క్రాప్‌ కౌలు రైతులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రచార జాతాలు నిర్వహించిన విషయం తెలిసిందే. జాతాలు మొత్తం విజయవాడ చేరుకొని అక్కడ నుంచి సోమవారం సిసిఎల్‌ కార్యాలయానికి వెళ్లి తమ డిమాండ్లు వినిపించాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకత్వం తీర్మానించింది. ఈ మేరకు నాయకులు, కౌలు రైతులు సిసిఎల్‌ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని భగం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్ని నాయకులను కార్యక్రమానికి వెళ్ళనీయకుండా ఎక్కడికక్కడే నిర్బంధించాలని ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయండి వినోద్‌ బాబును ఆదివారం రాత్రి పోలీసులు కలిసి సిసిఎల్‌ కార్యక్రమానికి వెళ్లరాదంటూ నోటీసు అందజేశారు.