ఆంధ్రప్రదేశ్‌లో కౌలురైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోజూ ఎక్కడో చోట కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. 22 నెలల్లో అక్షరాలా రెండు వేల మందికి పైగా రైతులు బలవన్మరణం చెందారు. ఇందులో 90 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కౌలురైతుల బతుకులు మారటం లేదు. చావులు తప్పడం లేదు. గతంలో వ్యాపార పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇప్పుడు డెల్టా ప్రాంతాల్లోనూ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే వ్యవసాయ రంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో విదితమౌతోంది.
వైఎస్‌ఆర్‌సిపి అధికారం లోకి వచ్చాక కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశించారు. కానీ వారి జీవితాల్లో చీకటి కమ్ముకుంది. ముఖ్యమంత్రి కాకపూర్వం పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కౌలు రైతులను కలిసినప్పుడు...తాము అధికారం లోకి వచ్చిన తక్షణమే కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని, సులభంగా కౌలు గుర్తింపు కార్డులు, సున్నా వడ్డీకే పంట రుణాలు, రైతు భరోసా (పెట్టుబడి సాయం) తదితర పథకాలను వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నవరత్నాల్లో ముఖ్యమైన అంశం ''రైతు భరోసా''. దీంతోపాటు పంట రుణాలు తదితర కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చారు. అయితే కౌలు రైతుల నోట్లో మాత్రం మట్టి కోట్టారు. గద్దె ఎక్కిన తొలి రోజుల్లో (2019-20) కౌలు రైతులకు చేయవలసినంత చేయలేకపోయా మన్నారు. 2020-21లో వారికి న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు తుంగలో తొక్కేశారు. కౌలు రైతులను, రైతులను నట్టేట ముంచారు. తమ రక్త మాంసాలను చెమట చుక్కలుగా మార్చి పంటలు పండిస్తున్న కౌలు రైతులను విస్మరించారు. పంటలు పండించని భూ యజమానులు, భూస్వాములు బాగుపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ సేద్యం చేయని వారే కాజేస్తున్నారు.
రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలురైతులుంటే 4 లక్షలా 87 వేల మందికే కార్డులు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టకుంది. కేవలం నాలుగు లక్షల మందికే సిసిఆర్‌సి కార్డులిచ్చారు. అయితే మొత్తం కౌలు రైతుల్లో ఇది కేవలం 12 శాతమే. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో లక్షా 11 వేల మందికి ఇచ్చారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరిలో లక్షా 8 వేల మందికి, కష్ణాలో 73 వేలు, గుంటూరు జిల్లాలో 53 వేలు, ప్రకాశం జిల్లాలో 18 వేల మందికి మాత్రమే ఇచ్చారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా 'వైఎస్‌ఆర్ కడప' లో 5 వేల మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే 2004 మందికే ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 20 వేల మందికి ఇవ్వాలని నిర్ణయించుకొని వెయ్యి మందికే ఇవ్వటం సిగ్గుచేటుగా మారింది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. నెల్లూరు జిల్లాలో 45 వేల మందికి కార్డులు మంజూరు చేయాలన్న లక్ష్యం పెట్టుకొని కేవలం ఐదు వేల మందికే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ''ఆంధ్రప్రదేశ్ పంటల సాగుదారు హక్కుల చట్టం-2019'' ప్రకారం.... భూ యజమాని సంతకం పెడితేనే ఆ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు సిసిఆర్‌సి కార్డులు ఇస్తారు. అలా సంతకం పెట్టడానికి భూ యజమానులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందలేక పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు చెబుతున్న కార్డులు చాలా వరకు బినామీ పేర్లతో ఉన్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామ భూస్వాములు తమ భూములను ఒకరికి కౌలుకు ఇచ్చి, మరొకరికి కౌలు ఒప్పంద పత్రం రాసి ఇచ్చారు. కారణం ఏమిటంటే.. దళితులకు కౌలుకు ఇచ్చినా... భూస్వామి మాత్రం తన సామాజిక తరగతికి చెందిన వేరే కౌలు రైతులకు 'కౌలు ఒప్పంద పత్రం' రాసిచ్చి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించారు. భవిష్యత్తులో దళితులు తమ భూములపై వ్యాజ్యం వేస్తారని భూస్వాములు భయపడ్డారట! అందువల్ల తమ కులం వారి నుంచయితే ఎటువంటి ప్రమాదం రాదని వారి ధైర్యమట. ఇలా ఉంది కౌలు రైతుల దీనావస్థ.
పంట రుణాల పరిస్థితి మరింత దారుణం
రాష్ట్రంలో పంట రుణాల కోసం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ.. ఖరీఫ్, రబీ కలిపి సుమారు రూ.94,629 కోట్లు ఇవ్వాలని ప్రకటించింది. ఇందులో కనీసం 10 శాతం కౌలు రైతులకు రుణాలుగా ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. గత ఫిబ్రవరి నాటికి రూ.74,436 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇచ్చిన రుణాల్లో 10 శాతం చొప్పన కౌలు రైతులకు రూ.7,432 కోట్లు ఇవ్వాలి. సిసిఆర్‌సి కార్డులు పొందిన 59,709 మంది కౌలురైతులకు రూ.319.68 కోట్లే ఇచ్చి పండగ చేసుకోండని చెప్పారు. అత్యంత తక్కువగా అనంతపురం జిల్లాలో 48 మందికి రూ.14 లక్షలు రుణాలు (అంటే ప్రతి రైతుకు రూ.29 వేల చొప్పున) ఇచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలో 71 మందికి రూ.69 లక్షలు ఇచ్చారు.
'రైతు మిత్ర' గ్రూపులకు సంబంధించిన సహకారం కూడా అంతంతమాత్రంగానే వుంది. రాష్ట్రం మొత్తంగా 7,062 'రైతు మిత్ర' గ్రూపుల్లో సభ్యులుగా వున్న 78 వేల మందికి రూ.265 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కౌలు రైతులు చాలా తక్కువ. కానీ భూ యజమానులకు మంజూరు చేసి కౌలు రైతులకు ఇచ్చామని చెప్పటం విడ్డూరంగా ఉంది. జాయింట్ లయబిలిటీ గ్రూపులను పరిశీలిస్తే మరింత విస్మయం కలుగుతుంది. రాష్ట్రంలో 6,522 గ్రూపుల్లోని 32,610 మంది కౌలు రైతులకు రూ.105 కోట్లు ఇచ్చారు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 90 వేల స్వయం సహాయక సాగుదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ 4,020 వేల గ్రూపులు ఏర్పాటు చేసి 20,100 మందికి రూ.75 కోట్లు రుణాలు ఇచ్చి సంతోష పడమన్నారు.
ఇక 'రైతు భరోసా' విషయానికి వస్తే కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 2021లో కేవలం 52 వేల మందికి రైతు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 8 లక్షల మంది భూమి లేని కౌలు రైతులు ఉండగా 52 వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. పంటలు పండించే వారికి కన్నీరు. సాగు చేయని వారికి కాసులు అందించి భూస్వాములకు ఊడిగం చేస్తున్నారు. ఈ మూడు గ్రూపుల, గుర్తింపు కార్డులు పొందిన 18,144 గ్రూపులకు సంబంధించిన 1,90,824 మందికి రూ.766 కోట్లు ఇచ్చారు. అంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కౌలు రైతులకు కన్నీరే మిగులుతుంది. ఇదే కొనసాగితే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రైతు వ్యతిరేకతను మూట కట్టుకోక తప్పదని కౌలు రైతులు భావిస్తున్నారు.
* పి.జమలయ్య (ఎ.పి కౌలురైతుల సంఘం ప్రధాన కార్యదర్శి)










