Jun 09,2023 00:47
పంగులూరులో కౌలు రైతు సంఘం జాతాలో మాట్లాడుతున్న ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణమూర్తి

ప్రజాశక్తి-పంగులూరు: వ్యవసాయం భారమైన, కౌలు వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుని పంటలు పండించి, పది మందిని బతికిస్తున్న కౌలు రైతును కాపాడాలంటే, పంట సాగు హక్కు పత్రాన్ని భూ యజమాని సంతకంతో పని లేకుండా కౌలు రైతుకు ఇవ్వాలని, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణమూర్తి అన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర జాతా గురువారం బాపట్ల జిల్లా చేరింది. జిల్లాలోని రాచపూడి, కొణికి, వంకాయలపాడు, పర్చూరు గ్రామాల్లో జాతా పర్యటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా కౌలు రైతు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని, అలాంటి రైతును బ్రతికించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపైన ఉందని రాధాకృష్ణ అన్నారు. కౌలు రైతును కాపాడుకోవడం అంటే, ఈ రాష్ట్రంలో కోటి మందిని కాపాడుకోవటమేనని అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాల రాకతో వ్యవసాయం నష్టాలు పాలై, భూ యజమానులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని, అప్పటివరకు కూలి నాలి చేసుకునే దళితు లు, బలహీన వర్గాలు, ఇతర పేదలు కౌలు వ్యవసాయానికి వచ్చి కౌలు రైతులుగా మారిపోయారని అన్నారు. ధరలు పెరగటం, రుణ పరపతి లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటల బీమా నష్టపరిహారాలు ప్రభుత్వం నుంచి తగినంతగా రాకపోవడంతో, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం గతంలో ఉన్న కౌలు చట్టాలను ఒక కలం పోటుతో రద్దు చేసిందని, భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు కార్డులు ఇస్తామనే నిబంధన చేర్చిందని రాధాకృష్ణమూర్తి విమర్శించారు. భూ యజమానులు కౌలు రైతులకు కౌలు కార్డ్‌ ఇవ్వటానికి గాని, సంతకం పెట్టడానికి గాని ముందుకు రాకపోవడంతో నిజమైన కౌలు రైతులు సిసిఆర్‌ కార్డులు పొందలేకపోతు న్నారని అన్నారు. సిసిఆర్‌ కార్డులు లేకపోవడం వలన పంట రుణాలు, పంట నష్టపరిహారాలు పంటల బీమా, రైతు భరోసా, ఈ-క్రాపు, వంటివి కౌలు రైతు పొందలేకపోతు న్నారన్నారు. కౌలు రైతు వ్యవసాయం చేయాలంటే భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. కౌలు రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు లక్షణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేరళ తరహా రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని కౌలు రైతు, చిన్న, సన్నకారు రైతుల రుణాలన్నీ రద్దు చేయాలని, దేవదాయ భూముల కౌలు రైతులందరికీ కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 13 నెలల పాటు జరిగిన ఢిల్లీ రైతుల పోరాటం, నాసిక్‌ నుంచి ముంబై వరకు జరిగిన రైతుల లాంగ్‌ మార్చ్‌, ఇంకా అనేక రైతుల పోరాటాలు స్ఫూర్తితో, కౌలు చట్ట సవరణకు భూమి యజమాని సంతకం తొలగించే వరకు కౌలు రైతులంతా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్‌బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, రైతు సంఘం నాయకులు గోవిందరెడ్డి, మల్లారెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు భాను ప్రకాష్‌, పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలతో పాటు రైతు భరోసా సౌకర్యాన్ని కల్పించాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని రాచపూడి గ్రామానికి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రచార జాతా వచ్చింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని, తద్వారా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు, రైతును బతికించుకు నేందుకు రైతులు, కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు ఉమ్మడిగా ఉద్యమాలు నిర్వహించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాయని వినోద్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మోండ్రు ఆంజనేయులు, ప్రకాశం జిల్లా నాయకులు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
పర్చూరు: కౌలు రైతుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిందేనని కౌలు రైతుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. పర్చూరులో గురువారం కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామసభల ద్వారానే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతుల పేరుతోనే ఈ క్రాపింగ్‌ చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, బీమా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 12న విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి వరకు జరుగు రాయబార కార్యక్రమంలో వేలాదిమంది రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, బాపట్ల జిల్లా కార్యదర్శి వినోద్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, ఎం వెంకటసుబ్బయ్య, సిఐటియు శ్రీనివాసు, బి చిన్నదాసు, జిల్లా రైతు సంఘం నాయకులు బండి శంకరయ్య, మల్లారెడి,్డ రాజారావు, ఎం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.