Oct 09,2023 20:44

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి

కౌలు పేరుతో
పొలాన్ని ఆక్రమించుకున్నాడు..
- న్యాయం చేయాలని బాధిత మహిళా రైతు విన్నపం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

         'రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో సర్వే నంబర్‌ 757/3లో నాకు 3.50 ఎకరాల భూమి ఉంది. ఈ పొలాన్ని నాగిరెడ్డిపల్లెకు చెందిన ఒక వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు.. కానీ అతను నా భూమిని దౌర్జన్యంగా పూర్తిగా ఆక్రమించుకుని పొలం నాదే అంటున్నాడు.. ఆన్‌లైన్‌లో, పట్టాదారు కాగితాలను పరిశీలించి న్యాయం చేయండి' అంటూ బాధిత మహిళా రైతు ఎల్లమ్మ స్పందన కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం-స్పందన విజ్ఞప్తులపై వెంటనే స్పందించి అర్జీదారులు సంతృప్తి చెందేస్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను నిర్ధేశిత గడువులోగా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను సూచించారు. స్పందన కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకొని లబ్జిదారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమంలో ఫలితాలు కనపడాలని ఆదేశించారు. నిబంధనల మేరకు అర్జీదారుల సమస్యలను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌ పరిష్కరించే అధికారి లాగిన్‌లో వచ్చిన దరఖాస్తులను ఏరోజుకారోజు 24 గంటల్లో సమ్మతి అధికారికి చర్య నిమిత్తం అసైన్‌ చేయడంలో అశ్రద్ధ వహించిన డేటా ఆపరేటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
వినతులలో కొన్ని...
- 'నేను వికలాంగుడి. నా భార్య చనిపోయింది. నాకు ఒక కుమార్తె ఉంది. జీవనం సాగడం ఇబ్బందికరంగా వుంది. నాకు ఏదైనా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి' అంటూ గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామ వాసి నరసింహ జిల్లా రెవెన్యూ అధికారి వారికి దరఖాస్తును సమర్పించాడు.
- 'నాకు 63 సంవత్సరాలు ఉన్నా వృద్ధాప్య పెన్షన్‌ రావడం లేదు. నాకు ఎటువంటి ఆధారం లేదు. నాపై దయవుంచి నాకు పెన్షన్‌ ఇప్పించి ఆదుకోండి' అని రుద్రవరం మండలం వెలగపల్లె గ్రామ నివాసి బద్రి బాల వెంకటన్న అర్జీ అందజేశాడు.
ఈ కార్యక్రమంలో మొత్తం 184 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్‌ ఎస్‌ఎల్‌ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, అన్ని శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు.