Aug 24,2023 00:03

రాజధాని కోసం సేకరించిన భూములు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని నిర్మాణం నిమిత్తం 2015లో సిఆర్‌డిఎకు భూములు అప్పగించిన రైతులకు మూడేళ్లుగా కౌలు మొత్తం అందడం లేదు. పదేళ్లపాటు కౌలును ఏటా 10 శాతం పెంచేలా 2015లో అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలుసాయం ప్రకటించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేలు కౌలు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ధారించింది. భూ సమీకరణలో రైతులు 22,736 మంది భూములు ఇవ్వగా వీరికి 2015 నుంచి 2019 వరకు సకాలంలో కౌలుడబ్బులు వారిఖాతాల్లో జమయ్యాయి. 2020 నుంచి ప్రతియేటా జాప్యమవుతోంది. 2021 నుంచి ప్రతి ఏటా కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన తరువాతనే రైతులకు కౌలుసాయం అందిస్తున్నారు. ఈ ఏడాది మేలో ఇవ్వాల్సిన కౌలు సొమ్ము ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో మళ్లీ రైతులకు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ వాదనను దాఖలు చేయాలని ఆదేశించింది.
2014 డిసెంబరులో ఏర్పడిన సిఆర్‌డిఎ చట్టం ప్రకారం 2015 జనవరి 2 నుంచి 29 గ్రామాల్లో భూ సమీకరణ ప్రారంభమైంది. దాదాపు ఏడాది పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సిఆర్‌డిఎ చట్టం ప్రకారం మూడేళ్లలో భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్‌లను అప్పగించాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలో ఈ ప్రక్రియ ఏ మాత్రమూ ముందుకు సాగలేదు. మొత్తం 33,771 ఎకరాల భూమిని రైతులు సిఆర్‌డిఎకు కేటాయించారు. ఇందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాల్సి ఉండగా కేవలం కాగితాలకే పరిమితం చేశారు. మొత్తం 16 ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించారు. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు కలిపి ఒక్కొ రైతుకు రెండు రకాల ప్లాట్లు వచ్చాయి. మొత్తం 54 వేల పాట్లు ఏర్పాటు చేసినట్టు రికార్డులో చూపారు. అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు తిరిగి అప్పగించే వరకు కౌలు మొత్తం చెల్లించాల్సి ఉంది. పదేళ్ల కాలంలో రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు అప్పగించకపోవడంతో కౌలు చెల్లింపు అనివార్యంగా మారింది. అభివృద్ధి చేసిన ప్లాట్‌లను అప్పగింతకు సంబంధించి గత ప్రభుత్వం మొత్తం 16 ప్యాకేజిల్లో చేపట్టిన పనులు 2019 మే వరకు 5 శాతం మాత్రమే పూర్తి కాగా వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గత మార్చిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడు నెలల్లో రైతులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును తీర్పులో కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ప్లాట్లు ఇవ్వకపోగా, సకాలంలో కౌలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నాయి. వైసిపి ప్రభుత్వం తీరుపై 1344 రోజులుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు.