Oct 21,2023 23:39

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన పెనుమల్లు తాతబ్బాయి నాలుగేళ్లుగా 5 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. భూ యజమాని సాగు హక్కు పత్రంలో సంతకం పెట్టకపోవడంతో ప్రతి సంవత్సరం బస్తాపై రూ.200 తగ్గించి దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇదే మండలం నాగులాపల్లికి చెందిన తమినిశెట్టి అప్పన్న రెడ్డి 7 ఎకరాలు సాగు చేస్తుండగా గతేడాది వర్షాలకు పంట నష్టపోయాడు. సిసిఆర్‌ కార్డు లేకపోవడంతో పరిహారం సొమ్ము అందలేదు. పెట్టుబడి సొమ్ములు కూడా చేతికిందకపోవడంతో ఈ రైతు అప్పులు పాలయ్యాడు. ఇలా అనేకమంది కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలతో పాటు పంట నష్టపరిహారాలను కోల్పోతున్నారు. పంట రుణాలను, పంటల బీమాలను అందుకోలేక పోతున్నారు.
కాకినాడ జిల్లాలో 2.20 లక్షల మంది రైతులకుగాను 1.70 లక్షల మంది కౌలు రైతులే వాస్తవ సాగుదారులుగా ఉన్నారు. పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారని అధికారులే గుర్తించినా సిసిఆర్‌ కార్డుల జారీలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ సమావేశంలో పలువురు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే కౌలు రైతులకు అన్నిచోట్టా అన్యాయం జరుగు తోందని తమ గళం వినిపించారు. సిసిఆర్‌ కార్డులు పూర్తిస్థాయిలో జారీ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. నిబంధనలను సడలించి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అధికారులను కోరారు.
52 వేల మందికే జారీ
వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కేవలం 54 వేలు మాత్రమే కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఆ మేరకు ఇప్పటి వరకు 52 వేల మందికి కార్డులు జారీ చేశామని తెలిపారు. ఇందులో అత్యధికంగా సామర్లకోట మండలంలో 4656 మందికి, కాజులూరులో 4549, పిఠాపురంలో 4434, పెదపూడిలో 4371, జగ్గంపేట మండలంలో 3608 మందికి సిసిఆర్‌ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ప్రతి మండలంలో వేలల్లో కౌలు రైతులే సాగు చేస్తున్నారు. వారికి పంట నష్టపరిహారాలు గాని, ఇతర ప్రభుత్వ సహాయాలు గాని అందడం లేదు. ప్రకతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కౌలు రైతులే పంటలను నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిసిఆర్‌ కార్డు లేకపోవడంతో భారీగా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం నిబంధనల వల్ల భూ యజమాని సంతకం తప్పనిసరి చేయడంతో వేలమంది కౌలు రైతులు అన్యాయానికి గురవుతున్నారు. వచ్చే వారం నుంచి జిల్లాలో ఈ-పంట నమోదు ప్రక్రియను జిల్లాలో చేపట్టేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ-పంట నమోదు కూడా తప్పనిసరి చేశారు. ఈ-పంట నమోదు చేయించుకోవాలంటే కౌలు రైతులకు తప్పనిసరిగా సిసిఆర్‌ కార్డు ఉండాలనే నిబంధన ఉంది. దీంతో అనేకమంది ఈ పంటలో కూడా నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి నిబంధనలను సడలించి వాస్తవ సాగుదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


సిసిఆర్‌ కార్డుల జారీలో అన్యాయం తగదుజిల్లాలో సుమారు 1.70 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారులకు కూడా తెలుసు. కానీ వారికి సిసిఆర్‌ కార్డులు జారీ చేయడంలో, లక్ష్యాన్ని నిర్ధేశించడంలో అన్యాయం చేస్తున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున కౌలు రైతులు ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారు. కనీసం పంటలను మద్దతు ధరకు అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది. వెంటనే అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలి.
- వి.రాజబాబు, జిల్లా కార్యదర్శి,
ఎపి కౌలు రైతుల సంఘం.