ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి వాస్తవ సాగుదారులైన కౌలు రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాలకుల పట్టించుకోనితనం, అధికారుల అలసత్వం వెరసి సర్కారు సాయానికి నోచుకొని దుస్థితిలో వారున్నారు. కాకినాడ జిల్లాలో 2.20 లక్షల మంది రైతులకు గాను 1.70 లక్షల మంది కౌలు రైతులే న్నారు. ఎక్కువ సంఖ్యలో వీరే ఉన్నారని అధికారులే గుర్తించినా సిసిఆర్ కార్డుల జారీలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. లక్ష్యాన్ని నిర్ధేశించడంలోనే లోపం కొట్టొచ్చినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో కేవలం 54 వేల మందికి మాత్రమే కార్డులు ఇవ్వాలని భావించారు. అంతా గగ్గోలు పెట్టడంతో మొత్తంగా 57, 319 మందికి వీటిని జారీ చేశారు. మిగిలిన వేలాదిమంది రైతులకు అన్యాయం జరిగింది. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల, తెగుళ్ల దాడితో పంటలు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు భరోసా, పిఎం కిసాన్, పంటల నష్టపరిహారం, రుణాలు వంటి సాయలను పొందలేకపోతున్నారు. చివరకు ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరను పొందలేక తక్కువ ధరకే దాన్యాన్ని దళారులకు అమ్ముకోవడానికి సిద్ధ పడుతున్నారు. ఇలా అన్ని అంశాల్లోనూ కౌలు రైతులు నష్టపోతున్నారు.
రుణాలు ఇవ్వడంలో జాప్యం
సిపిఆర్ కార్డు కౌలు రైతు రుణం పొందడానికి అర్హత ధ్రువీకరణగా ఉండాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కేవలం పేరుకు మాత్రమే అన్నట్టు మారిపోయింది. ప్రభుత్వం కౌలు రైతులకు సాగులో సాయం అందించేందుకు బ్యాంకు రుణాల కేటాయింపునకు లక్ష్యం నిర్ధేశించినా అమలు కావడం లేదు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో రుణాలు మంజూరు చేయలేదు. వాస్తవానికి ఖరీఫ్ పనులు ప్రారంభానికి ముందే రుణాలు ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులకు పదే పదే చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.38 వేలు రుణంగా ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 39 వేల మందికి మాత్రమే రుణాలు ఇవ్వగలిగారు. వీటిలో 30 వేల కార్డులకు రూ.109 కోట్లు, నాలుగు నుంచి ఆరుగురున్న జెఎల్‌జి గ్రూపులు 1020 ఉండగా వీటికి కేవలం రూ.26.23 కోట్లు రుణాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా వేలాది గ్రూపులను ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాల్సి ఉంది. సిసిఆర్ కార్డులు పొందిన 17 వేల మందికి పైనే రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఈ ఖరీఫ్ మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో రుణాలు మంజూరు కాక కౌలు రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. ఎటువంటి సాయాలు అందక చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు.










