Oct 11,2023 23:24

సదస్సులో మాట్లాడుతున్న వి.శ్రీనివాసరావు

ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
రాష్ట్ర సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, అమలాపురం
కౌలు రైతులకు మేలు కలిగేలా చట్ట సవరణ చేయాలని, దీని కోసం పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బుధవారం అమలాపురంలోని షాదీఖానా భవనంలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన కౌలు రైతుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. కౌలు రైతు చట్టంలో భూ యజమాని సంతకం నిబంధన తొలగించి తక్షణమే అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పూర్తిస్థాయిలో పంట రుణాలు అందివ్వాలని, దేవాదాయ భూముల రైతులకూ కార్డులు, రుణాలు ఇవ్వాలని, భూమిలేని ఓసి కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. అప్పులతో రైతుల ఆత్మహత్యలు రెట్టింపు అయ్యాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న కౌలు వ్యవసాయాన్ని ఆదుకోవాలంటే తక్షణమే వారికి కనీస గుర్తింపు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయంలో వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు రీత్యా కౌలు రైతులను ఆదుకోవడానికి చట్ట సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. యజమాని సంతకం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనతో గుర్తింపు కార్డులు అందడం లేదన్నారు. గతంలో మాదిరిగా అందరికీ కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల హక్కులు పరిరక్షణ గుర్తింపు కోసం పనిచేయకపోతే జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. కౌలు రైతుల పోరాటాలకు సిపిఎం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తూ కుల గణన చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలన్నారు. మణిపూర్‌లో కుల, మత స్వేచ్ఛను హరిస్తోందన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ మనుధర్మశాస్త్రాన్ని అమలు చేస్తున్న మోడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపాలన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా, రాజధానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేస్తున్న మోడీ సర్కార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు విస్సా కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారన్నారు. గతంలో కౌలు రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వేలు చేయగా అనేక అంశాలు ముందుకు వచ్చేయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,200 మంది రైతులను సర్వే చేయగా 366 మందికి (8.8 శాతం) మాత్రమే గుర్తింపు కార్డులు అందాయన్నారు. 3 శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతుందన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి వాస్తవ సాగుదారులకు లబ్బి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని కౌలు రైతులకు సూచించారు.. రాబోయే ఎన్నికల్లో ఓట్లు కోసం వచ్చే నాయకులను కౌలు రైతుల సమస్యలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలపై పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు శాసనమండలిలో చర్చించామన్నారు. సిసిఆర్‌ కార్డులు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం నిబంధన ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. డ్రెయిన్లు, స్లూయిజ్‌లు మూసుకుపోయాయన్నారు. అక్రమ ఆక్వా చెరువులతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు అండ్ర మాల్యాద్రి, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా నాయకులు కె.కృష్ణవేణి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌.బలరాం, టి.నాగవరలక్ష్మి, జి.దుర్గాప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కుడిపూడి రాఘవమ్మ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.రామచంద్రరావు, జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు జి.బాబు పశ్చిమగోదావరి జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ఎం.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ ప్రత్యామ్నాయాలు...
కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి సదస్సు కొన్ని ప్రత్యామ్నాయాలు చేసింది. వీటిని ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు ప్రవేశపెట్టారు. దీన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
 భూ యజమాని సంతకం తొలగించి గ్రామసభల ద్వారా కౌలు
రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
 కౌలు రైతులందరికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు,
పంట నష్టపరిహారాలు, పంటలభీమా ఇవ్వాలి.
దేవాలయ భూములు కౌలు చేస్తున్న కౌలు రైతులందరికీ గుర్తింపు
కార్డులు, రుణాలు ఇవ్వాలి.
భూమిలేని ప్రతి కౌలు రైతుకి రైతు భరోసా ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వ
పథకాలన్నీ కౌలు రైతులకు వర్తింపచేయాలి.
కౌలు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ
శాఖను ఏర్పాటు చేయాలి.
కేరళ తరహాలో పంట రుణాలను మాఫీ చేయాలి
కేరళ తరహాలో అన్ని పంటలకు మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం
ప్రకటించి కొనుగోలు చేయాలి.
కౌలు రైతుల పేరుతోనే ఈ క్రాపింగ్‌ చేయాలి.
వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేయాలి.
ప్రాజెక్టులు, కాలువలు, పథకాలకు మెయింటినెన్స్‌ నిధులు ఇవ్వాలి.
ప్రతి మూడు నెలలకు ఒకసారి వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకర్లు,
జలవనరుల శాఖలు రైతల్లో కౌలు రైతు సంఘాలతో ఉమ్మడి ఔ
సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలి.
డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి. సాగునీరు, మురుగు
పారుదల వ్యవస్థలను మెరుగుపరచాలి.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను అభివద్ధి చేయాలి.
వ్యవసాయ కార్మికుల, వత్తిదారుల, ఇతర పేదల సమస్యలను
పరిష్కరించాలి.