Oct 09,2023 23:12

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - సత్తెనపల్లి : రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ భూమిలో 80 శాతం సాగుచేస్తున్న కౌల్దార్లకు రక్షణ కల్పించకుంటే రాష్ట్రమే కుదేలవుతుందని ఆకలి ఆంధ్రపదేశ్‌గా మారుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సత్తెనపల్లికి సోమవారం వచ్చిన ఆయన స్థానిక పుతుంబాక భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల మంది కౌలు రైతులుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు లక్షల మందికే గుర్తింపు కార్డులిచ్చిందని, వీటిల్లో కొంతమంది తప్పుడు పద్ధతుల్లో కార్డులు పొందారని తెలిపారు. యజమాని తన బంధువుల పేర్లతోనే కార్డులు పొందుతున్నారని అన్నారు. ఈ క్రమంలో వాస్తవ సాగుదార్లు కార్డులు, రుణాలు, సబ్సిడీలు అందక అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. మరోవైపు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన కౌలురైతులు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాల పాలవుతున్నారని, పంటను రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముకునేందుకు అర్హత లేకపోవడంతో బయట మార్కెట్లో దళారులకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
ఈ ఏడాది వరి సాగు 25 లక్షల ఎకరాల్లో తగ్గిందని, నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల నుండి నీటి సరఫరా లేక పల్నాడు ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పంటలెండిపోతున్నాయని చెప్పారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలు సాగు నీరు అందుతుందని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజలాలను మొత్తాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిందని, తెలంగాణ ఎన్నికల్లో లబ్ధికోసం కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం గెజిట్‌ను ఇచ్చిందని విమర్శించారు. ఇది చట్ట విరుద్ధమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని, ఒక లేఖ రాసి ఊరుకుంటే పరిపోతుందా? అని ప్రశ్నించారు. మోడీ అడుగులకు మడుగులొత్తుతుంటే న్యాయం జరగదని, గట్టిగా పోరాడాలని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై మాట్లాడకపోగా చివరకు కృష్ణా జలాలను, వ్యవసాయాన్ని, రైతుల ప్రయోజనాలను కేంద్రంలో తాకట్టు పెట్టడం దారుణమన్నారు. కృష్ణా జలాలను వదులుకుంటే నాగార్జునసాగర్‌, శ్రీశైలం ఎండిపోతాయని అన్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రాజెక్టులు కట్టుకుంటుందని, దీంతో తుంగభద్ర ఎండిపోతే కేసీ కెనాల్‌ ఎండిపోతుందని హెచ్చరించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ అమలులో ఉందని, దాని ప్రకారం కృష్ణా జలాలపై, మిగులు జలాలపైన మనకు హక్కుందని గుర్తు చేశారు. పోలవరం పూర్తయి ఉంటే ఆ జలాలను కృష్ణా నదికి మళ్లించేవారమన్నారు. రూ.100 కోట్లు, ఆ పైబడిన పెద్దపెద్ద కాంట్రాక్టర్లపైన ఉన్న శ్రద్ధ చిన్న కాంట్రాక్టర్లపైన, సర్పంచులకు బిల్లును చెల్లించడంపైన, పునరావాసం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశం వేసి ఆ బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి గెజిట్‌ను ఉపసంహరించుకునే వరకు ఆందోళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. లేకుంటే ప్రజా కోర్టులో సిఎం జగన్మోహన్‌రెడ్డి దోషిగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ నాగార్జునసాగర్‌ నీళ్లు వదలక పోవడం వల్ల వరి పంట వేయలేదని, ఇప్పటికే వేసిన పంటల్లో మిర్చికి నీటి అవసరం చాలా ఉందని అన్నారు. ఆరు తడులకు నీరిస్తామని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నా ఇప్పుడు సాగర్‌, శ్రీశైలం జలాశయాల్లో నీరు లేకుండా ఎలా ఇవ్వాలంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే అనేక మార్గాలున్నాయని అన్నారు. నీరు సరఫరా చేయకుంటే రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదని విమర్శించారు. ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు సాగు చేస్తే తప్ప ఇప్పటికే వెనుకబడి ఉన్న ఈ పల్నాడు జిల్లా ఇంకా వెనుకబడే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం భూమి మొత్తం సాగులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని కోరారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, మండల కార్యదర్శి పి.మహేష్‌ పాల్గొన్నారు.