Sep 17,2023 23:15

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : భూమి ఉన్న రైతుల కంటే భూమి లేని కౌలు రైతులు మరింత సంక్షోభంలో చిక్కుకున్నారు. వాణిజ్య పంటలు అధికంగా పండే గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది కౌలు ధరలు గణనీయంగా పెరిగాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఆదాయం తగ్గిపోతోంది. దీంతో ఈ ఏడాది సాగుకు కౌలు రైతులు చాలా గ్రామాల్లో ముందుకు రావడంలేదని చెబుతున్నారు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, వర్షా భావ పరిస్థితులతో సేద్యం ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం గుంటూరు, పల్నాడు జిల్లాలో 8.37 లక్షల ఎకరాలలో ఈ ఏడాది పంటలు వేస్తారని అంచనా ఉండగా ఇప్పటివరకు 4.35 వేల ఎకరాల్లోనే పంటలు వేశారు. దాదాపు 4 లక్షల ఎకరాల్లో ఎటువంటి పంటలు లేక భూములు ఖాళీగా ఉన్నాయి. సేద్యం ఊపందుకోకపోవడానికి వర్షాభావం ఒక కారణమైతే కౌలు రైతులు కూడా ముందుకు రాకపోవడం కూడా మరో కారణంగా అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి కౌలురైతులకు తగిన భరోసా కొరవడటమే ప్రధాన కారణంగా నిలుస్తోంది.
కౌలు రైతులకు మెరుగ్గా ఉన్న 2011 కౌల్దారి చట్టాన్ని తొలగించి వైసిపి ప్రభుత్వం 2019లో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు ఏ సాయం కావాలన్నా భూ యజమాని అంగీకారం తప్పని సరిగా మారింది. భూ యజమాని అంగీకారపత్రంతో సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలనే నిబంధనల మేరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సాగు ధ్రువీకరణ పత్రాలు (సిసిఆర్‌సి) జారీ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడం లేదు. సాగు ధ్రువీకరణ పత్రాలు అధికారులు జారీ చేసినా బ్యాంకర్లు మాత్రం రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. గుంటూరు జిల్లాలో 50 వేల మందికి సిసిఆర్‌సిలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది 33,014 మందికి సిసిఆర్‌సిలు ఇచ్చారు. కేవలం 2032 మంది కౌలు రైతులకు రూ.14.45కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. పల్నాడు జిల్లాలో 56,613మందికి సిసిఆర్‌సిలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 46,732 మందికి అందించారు. వీరిలో ఐదు వేలమందికి రూ.30 కోట్ల మేరకు రుణాలు ఇచ్చారు. దాదాపు 10శాతం మందికే రుణాలు అందుతున్నాయి. మిగతా వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
సి.సి.ఆర్‌.సిలు లేకపోవడం వల్ల చాలా మందికి రైతు భరోసా, పంటల బీమా వంటి సదుపాయాలు అందడం లేదు. సిసిఆర్‌సిలు ఉన్న ఓసి రైతులకు ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం లేదు. బీమా సదుపాయం సొమ్ము భూ యజమాని ఖాతాల్లో జమవుతోంది. ఈ సొమ్ము కౌలు రైతులకు ఇవ్వాలనే కనీస ధ్యాస కొంత మందికి ఉండటం లేదు. గ్రామాల్లో పెద్దల సమక్షంలో చర్చిస్తే కొంత మంది తన పొలంలో సాగు చేసిన కౌలు రైతుకు బీమా సొమ్ము ఇస్తున్నారు. కొంత మంది ఇవ్వడం లేదన్న విమర్శఉంది. ప్రభుత్వం సేద్యానికి అందిస్తున్న సబ్సిడీలు కౌలురైతుకు అందడం లేదు. పండించిన పంటను అమ్ముకోవాలన్నా గుర్తింపు కార్డు లేక భూ యజమాని పేరుతోనే అమ్ముకోవలసి వస్తోంది. కొంతమంది అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఈ-క్రాప్‌, ఇకెవైసి సదుపాయం కౌలు రైతులందరికి లేకపోవడం వల్ల వీరికి ప్రభుత్వం నుంచి నేరుగా రావాల్సిన వివిధ సదుపాయాలు అందడం లేదు.