Aug 31,2023 00:37

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పురోగతి లేని జగనన్న కాలనీ లే అవుట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లబ్ధిదార్లు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని మండల ప్రత్యేకాధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. ఈ మేరకు వారితో బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీసీ హాలులో సమీక్షించారు. లే-అవుట్‌ల వద్ద ఆర్చ్‌ల నిర్మాణాకి అంచనాలు పూర్తి చేసి సుందరంగా నిర్మించాలని చెప్పారు. అవసరమైన చోట నీటి ట్యాంక్‌ల ద్వారా నీరందించి పనులు పూర్తి చేయాలన్నారు. కౌలురైతులకు సిసిఆర్‌సి కార్డుల విషయంలో జిల్లా ముందంజలో ఉందని, అదేవిధంగా రుణాల మంజూరులోనూ ముందు వరసలో నిలపాలని సూచించారు. అవసరమైతే మండల స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. మరణించిన, అడ్రస్‌లు తెలియని వారి విషయములో సమగ్ర ఓటరు సర్వే చేయించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రూ.10 వేల విలువ చేసే ప్రీ - మాన్సూన్‌ డ్రై కిట్‌ లను ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చారని వివరాలు అడిగారు. జగనన్న పాల వెల్లువ అంశంలో వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో 20 మండలాల్లో సమగ్ర సర్వే నిర్వహించి 100 శాతం జీవాల వివరాలు ఆదివారం నాటికి పూర్తి చేయాలన్నారు. స్వామిత్వ కార్యక్య్రమములో 20 పనులుకు గాను 13 పనులు పూర్తయ్యాయని, మరో 7 పురోగతిలో ఉన్నాయని చెప్పారు. పూర్తి చేసిన వై.యస్‌.ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ లు మరియు మౌలిక వసతులు కల్పించిన గ్రామ సచివాలయలను త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. పూర్తయిన రైతు బరోసా కేంద్రాలను ప్రారంభించాల న్నారు. సమీక్షలో జెసి ఎ.శ్యాం ప్రసాద్‌, డిఆర్‌ఒ వినాయకం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.