Aug 13,2023 23:51

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కౌలు రైతులకు ఆశించిన స్థాయిలో సహకారం అందడంలేదు. కౌలురైతులకు వ్యవసాయశాఖ అధికారులు సాగు ధ్రువపత్రాలు (సిసిఆర్‌సి) కొంత మేరకు ఇచ్చినా రుణాలు అందడంలేదు. ఒకవైపు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో అల్లాడుతున్న రైతులు ఈ ఏడాది పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 1.03 లక్షల మందికి సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలో 54 వేలమందికి సిసిఆర్‌సి ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతనెలలో సురక్ష పథకం ద్వారా సిసిఆర్‌సిలు ఇస్తామని అధికారులు ప్రకటించినా ఆశించిన స్థాయిలో సిసిఆర్‌సిలు జారీ కాలేదు.కేవలం జిల్లాలో ఆరువేల మందికే ఇచ్చారు. గతరెండు నెలలకాలంలో మొత్తంగా 33 వేల మందికి సిసిఆర్‌సి కార్డులు ఇచ్చినట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో 49 వేల మందికి సిసిఆర్‌సిలు ఇవ్వాలని లక్ష్యం గా నిర్ణయించగా 28 వేలమందికి ఇచ్చారు.
రెండు జిల్లాల్లో కలిపి కౌలురైతులకు ఇప్పటి వరకు కేవలం రూ.60 కోట్ల రుణాలు ఇచ్చారు. అయితే బ్యాంకర్లు మాత్రం సిసిఆర్‌సి కార్డులున్నా పంటరుణాలు ఇవ్వడం లేదు. కొంత మంది రైతులకు కలిపి గ్రూపు రుణాలిస్తున్నారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వర్తింపచేయడం లేదు. ఒక్కొ రైతుకు సగటున రూ.20 వేలనుంచి రూ.30వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో కౌలురైతులు పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. సిసిఆర్‌సి కార్డులు ఆలస్యంగా ఇవ్వడం వల్ల వీరికి రైతుభరోసా కూడా ఇవ్వడం లేదు. కౌలు రైతుల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు చెందినవారికే గతేడాది రైతు భరోసా ఇచ్చారు. ఈ తరగతులకుచెందిన 10 వేల మందికే గతేడాది రైతు భరోసా దక్కింది. భూ యజమానులకు కూడా కొన్ని బ్యాంకులు ఇవ్వడం లేదు. కౌలు రైతులకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్న బ్యాంకులు యజమానులను కూడా ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రధానంగా స్టేట్‌ బ్యాంకు అధికారులు అటుకౌల్దార్లకు, ఇటు యజమానులకు రుణాలు ఇవ్వడం లేదన్న విమర్శలు ప్రభలంగా ఉన్నాయి. కొంత పొలం సొంతంగా ఉండి, కొంత పొలం కౌలుకు తీసుకున్నా రుణాలు దక్కడం లేదు.
పల్నాడు, గుంటూరు జిల్లాలో గత మూడురోజులుగా అడపాదడపాగా కురిసిన వర్షాలతో కొన్ని మండలాల్లో పైర్లు వేయడానికి రైతులు సన్నద్ధమయ్యారు. ప్రధానంగా డెల్టాలో కాల్వలకు నీరు వస్తుండటంతో వరి సాగుకురైతులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో 3.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేయగా ఇప్పటివరకు కేవలం 1.40 ఎకరాల్లో సాగైంది. 1.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 80 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. 76 వేల ఎకరాల్లో పత్తిసాగు చేయాల్సి ఉండగా 50 వేల ఎకరాల్లోనే వేశారు. 56 వేల ఎకరాల్లో మిర్చిసాగు చేయాల్సి ఉండగా కేవలం 600 ఎకరాలు, పసుపు ఐదు వేల ఎకరాలకు గాను 2400 ఎకరాల్లో సాగు చేశారు. మరో 7 వేల ఎకరాల్లో ఇతర పంటలు వేశారు. పల్నాడు జిల్లాలో మొత్తం 5.12 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలుసాగు అవుతాయని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 1.30 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారు. లక్షా 10 వేల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు నీటివిడుదలపై స్పష్టత లేకపోవడం వల్ల అయోమయం ఏర్పడింది. పత్తిసాగు ఊపందుకుంది. పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు 1.30 లక్షల ఎకరాల్లోపత్తి పంటవేశారు. 1.20 లక్షల ఎకరాల్లో మిర్చిసాగవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 2 వేల ఎకరాల్లోనే సాగైంది. పెట్టుబడి సొమ్ము అందుబాటులో ఉన్న వారు సేద్యంకు ముందుకు వెళ్తుండగా మిగతా వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.