ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని కైరుప్పల గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో కైరుప్పల గ్రామ సచివాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలని, బీసీ, ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు, డ్రెయినేజీ కాలువలు వేయాలని కోరారు. వీధిలైట్లు వేసి పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేపట్టాలన్నారు. పంచాయతీ అధికారి రామ్మూర్తి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. సిపిఎం గ్రామ కార్యదర్శులు రామాంజనేయులు, వీరేష్, సీనియర్ నాయకులు పెద్ద రంగన్న, నరసింహులు, వీరభద్రి, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి శివ, వీరేష్, రవి, రాము, రంగస్వామి, రాముడు, ప్రకాష్, నాగార్జున, శాంతిరాజు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు










