Nov 08,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులు

కావలిలో విద్యాసంస్థల బంద్‌ సక్సెస్‌
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ కావలి పట్టణంలో విజయవంతమైంది. కావలి పట్టణంలో ఉన్న కేజీ టు పీజీ వరకు ప్రయివేట్‌ విద్యాసంస్థలు ముందుగానే బంద్‌ డిక్లేర్డ్‌ చేయగా ప్రభుత్వ విద్యా సంస్థలను మాత్రం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌, పిడిఎస్‌యు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు వెళ్లి బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరగా అన్ని విద్య సంస్థలు బంద్‌కు సహకరించాయి.
అనంతరం విద్యార్థులు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌కు చేరుకొని అక్కడ నుండి ప్రదర్శనగా బయల్దేరి కోర్టు సెంటర్‌కు వెళ్లి అక్కడి నుండి తిరిగి ఆర్‌టిసి బస్టాండ్‌ మీదుగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌యు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు వై.ఉదరు కుమార్‌, డి సూర్య ప్రకాష్‌, సునీల్‌, సాయి దినేష్‌, పెంచలనరసింహం మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్ర ప్రజల హక్కు అని 32మంది విద్యార్థులు యువకుల ప్రాణత్యాగం, నాటి వామపక్ష పార్టీల ఎంఎల్‌ఎలు, ఎంపిలు, తమ పదవులకు రాజీనామా చేయడం వల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లతో నిర్మించిన ప్లాంట్‌కి 20వేల ఎకరాల భూములను 12 గ్రామాల ప్రజలు తక్కువ ధరకు ఇచ్చారని తెలిపారు. నేడు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని స్టీల్‌ ప్లాంట్‌ రూ.30వేల కోట్లకు అమ్మాలని, లేకపోతే స్టీల్‌ ప్లాంట్‌ను మూసివేస్తామని ప్రకటించారన్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు పన్నులు కడుతున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని శంకుస్థాపన చేసి నేటికీ పనులు ప్రారంభించలేదని తెలిపారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ వస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ అయితే భవిష్యత్తులో యువకులకు ఉపాధి కోల్పోతారని ప్రజల ఆస్తి అయిన స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రయివేట్‌కరణ చేసే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 25మంది ఎంపిలను గెలిపిస్తే కేంద్రం ప్రభుత్వం మెడలు వంచుతానన్న జగన్మోహన్‌ రెడ్డి నేడు ఢిల్లీలో కేంద్రం ముందు మోకరిల్లుతున్నారు తప్ప ఉక్కు రక్షణ కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, జనసేన పార్టీలు సైతం విశాఖ ఉక్కు రక్షణ అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు నిర్మాణం కోసం ఏ మాత్రం కృషి చేయడం లేదన్నారు. ఈ పార్టీలు ఇలాగే వ్యవహరిస్తే విద్యార్థులు యువకులు వారి కుటుంబ సభ్యులను చైతన్యం చేసి ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాకేష్‌, అభి, వర్షత్‌, సాయి, అభిరామ్‌, లోకేష్‌, రానా, ఎఐవైఎఫ్‌ నాయకులు భాను ప్రకాష్‌, హర్ష, సుమంత్‌, పీటర్‌, వంశీ, డివైఎఫ్‌ఐ నాయకులు వై.కృష్ణమోహన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.