
కావలిలో అభివృద్ధి శూన్యం : సిపిఎం
ప్రజాశక్తి-కావలి రూరల్ : గత పదేళ్లలో కావలి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పెనుబల్లి మధు పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కావలిలో ఎంఎల్‌ఎ అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు, ఎక్కువయ్యాయని వాటిని ఇక్కడ ఉన్న అధికారులు, పోలీసు యంత్రాంగం బలపరుస్తుందన్నారు. ఈ మధ్య కాలంలో కావలిలో ఆర్‌టిసి డ్రైవర్‌ను కొట్టడం చూస్తే కావలిలో అధికార పార్టీ అహంభావం ఏ రకంగా ఉందో పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అంతకుముందు దగదర్తి పెట్రోల్ బంకులో దళిత యువకుడిపై వైసిపి నాయకులు చేసిన దాడి, ముసునూరు సంఘటన, ఇంకా మరికొన్నింటిపై ఇదివరకే మంత్రికి ఫిర్యాదు చేసిన ఇక్కడి ఎంఎల్‌ఎకు లెక్కాపక్కా లేకుండా ఉందని ప్రజలు తెలియజేసినట్లు తెలిపారు. నెల్లూరు నుండి కావలికి వస్తున్న క్రమంలో ముసునూరు దగ్గర నుండి కావలి వచ్చేవరకు రోడ్డు మొత్తం పూర్తిగా పెద్దపెద్ద గోతులు పడి ఉందని ఇంకా కావలి పట్టణంలో తుమ్మలపెంట రోడ్డు, పెద్ద పవని బ్రిడ్జి, ఇంకా అనేక ప్రాంతాల రోడ్లు అధ్వానంగా తయారై ఉన్నాయన్నారు. ఈ ఎంఎల్‌ఎ 10 సంవత్సరాలలో కావలి పట్టణంలో చేసిన అభివృద్ధి ఏమీలేదని తెలిపారు. రాష్ట్రంలో ఒక కొత్త పరిణామం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు దేశంలో చాలామందిని అరెస్టు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో ఎక్సైజ్ శాఖ మంత్రిని అరెస్టు చేసి ఇప్పటికి 8నెలలు అయిందని ఇప్పుడు ఆమ్‌ఆద్మీపార్టీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చారని, ఎక్కడపడితే అక్కడ ఆరెస్టులు చేసి బెదిరించి ప్రభుత్వాలను లొంగదీసుకోవాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను బలపరచాలని ఆలోచనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే, కడప ఉక్కు, ఇంకా మరికొన్ని విభజన హామీలను రాష్ట్ర ప్రభుత్వం సాధించకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయలేదన్నారు. చంద్రబాబు అరెస్టు బిజెపి మద్దతుతోనే జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు, విశాఖ ఉక్కు, అడవులు, ఓడరేవులు, ఇంకా దేశ సంపదను అదాని లాంటి వారికి కట్టబెడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అన్నివిధాలుగా పార్లమెంట్లో మద్దతు తెలుపుతుందన్నారు. నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపిని బలపరుస్తున్న జగన్ ప్రభుత్వానికి కూడా అదే గతి పరిస్థితి వస్తుందని, ఇప్పటికైనా పార్టీలు బిజెపి నుండి బయటకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, పి భాస్కరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిఐటియు రాష్ట్ర నాయకులు రమాదేవి, స్థానిక నాయకులు పసుపులేటి పెంచలయ్య, తాళ్లూరి మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.