Oct 01,2023 21:24

ఫొటో : మాట్లాడుతున్న ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.సురేష్‌

కావలికి చేరిన ప్రచార జీపుజాతా
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో పనిచేసే కార్మికులు, ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ప్రచార జీపు జాతా ఆదివారం కావలి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా తుమ్మలపెంట రోడ్డు ఆటోస్టాండ్‌ దగ్గర ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.సురేష్‌ మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. జిఒ 21 ఉపసంహరించుకొని, పెంచిన తైమాసిక ఆర్‌టిఒ చలానా ఛార్జీలను తగ్గించాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలన్నారు. ఆటో కార్మికులపై విధిస్తున్న పోలీస్‌ ఈ చలానాలు రద్దు చేయాలని ఆర్‌టిఎ చలానాలను జరిమానాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల హక్కులను ప్రయోజనాలను కాపాడాలని తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ 6వ తేదీన దేశవ్యాప్తంగా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌) తరఫున 6న విజయవాడలో జరిగే మహాధర్నాకు ఆటో కార్మికులు, ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో పనిచేసే కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్‌ వెహికల్‌ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి కార్మిక రంగంపై విపరీతమైన భారం మోపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నదని అనేక కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కార్మిక రంగాన్ని దెబ్బతీస్తుందని తీవ్రంగా విమర్శించారు. ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను కొనసాగించాలని, తద్వారా హక్కులను సాధించుకోవాలని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్‌ వి రాజు, జిల్లా కమిటీ సభ్యులు షాన్‌వాజ్‌, సుధాకర్‌, ఎన్‌ సురేష్‌, పురుషోత్తం, స్థానిక సిఐటియు నాయకులు ఎస్‌కె అమీర్‌భాషా, భోగిశెట్టి కిష్టయ్య, ఆటో కార్మికులు పాల్గొన్నారు.