Jul 24,2023 21:25

వర్థంతి సభల్లో వక్తలు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌

             అస్తవ్యస్తంగా ఉన్న గోదావరి జలాలను సక్రమమైన మార్గంలో పెట్టి ఆనకట్టలను నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలకు అన్నదాతగా నిలిచిన సర్‌ ఆర్థర్‌ కాటన్‌ రుణం మనం తీర్చుకోలేమని ఇరిగేషన్‌ ఎఇ వినరుకుమార్‌ అన్నారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వర్థంతి కార్యక్రమాన్ని శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో రెస్ట్‌ హౌస్‌ రోడ్డులోని ఇరిగేషన్‌ కార్యాలయంలో కాటన్‌ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ కాటన్‌ సేవలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. భీమవరం రైతు కార్యాచరణ సమితి నాయకులు పాతపాటి మురళీరంగరాజు సౌజన్యంతో ఎనిమిది పాఠశాలకు, ఆరు కళాశాలలకు, ఇరిగేషన్‌ కార్యాలయానికి కాటన్‌ చిత్రపటాలను అందించామని తెలిపారు. కాటన్‌ స్ఫూర్తితో ప్రతిభ కలిగిన విద్యార్థులకు రూ.10 వేలు సహకారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ జోన్‌ ఛైర్మన్‌ నందమూరి రాజేష్‌, కెజిఆర్‌ఎల్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ కె.సత్యనారాయణ, సీతారామరాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పెనుమంట్ర :కాటన్‌ దొర వర్ధంతి సందర్భంగా మార్టేరు ఇరిగేషన్‌ సెక్షన్‌ వద్ద ఉన్న కాటన్‌ దొర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్టేరు సెక్షన్‌ ఎఇఇ గుబ్బల జయశంకర్‌ మాట్లాడుతూ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసిన సర్‌ అర్ధర్‌ కాటన్‌ చిరస్మరణీయులన్నారు. 1819లో మద్రాసు ఇంజినీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడన్నారు. ఈ కార్యక్రమంలో డ్రెయినేజీ ఎఇఇ కె.ఈశ్వరి, లాక్‌ సూపరింటెండెంట్‌ వి.జోసెఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.
ఆచంట : కాటన్‌ దొర వర్థంతి సందర్భంగా కొడమంచిలి రైతు కమ్యూనిటీ కార్యాలయం ఆవరణలో ఉన్న కాటన్‌ దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశాజ్యోతి, అపర భగీరధుడు కాటన్‌ దొర అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ అధ్యక్షులు మన్నె సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ, ఎంఎసి మాజీ డైరెక్టర్‌ కొల్లేపర సాయిబాబా, రైతు సంఘ సభ్యులు మన్నె నాగేశ్వరరావు, కాజా రాజా, పోలిశెట్టి వనమారాజు, జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, చిక్కాల ప్రసాద్‌ పాల్గొన్నారు.