అనంతపురం తరహాలో మెట్టలో తరచూ విద్యుత్ ప్రమాదాలు -బాలికలను చిదిమేస్తున్న పరిచయస్తులు
విద్యుత్ తీగలు కూలీల ప్రాణాలను కబళిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడి కూలీలు మరణించిన ఘటన జిల్లాలో మెట్టప్రాంతంలో తరచూ చోటుచేసుకుంటున్న విద్యుత్ ప్రమాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అలాగే స్కూళ్లకు వెళ్తున్న బాలికలపై కన్నేసిన పరిచయస్తులే కామాంధులై కాటేస్తుండటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది.
జంగారెడ్డిగూడెం మండలంలో ఉదయమే పాలు కోసం పొలం వద్ద ఉన్న పశువుల శాల వద్దకు మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు మార్గమధ్యంలో తెగిపడి ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల వల్ల ప్రమాదానికి గురై సజీవ దహనమయ్యారు. ఇటీవల లింగపాలెం మండలంలో ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోస్తుండగా అటువైపుగా వెళ్లిన విద్యుత్ తీగల వల్ల కూలీ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా ఘటనలు చింతలపూడి, పెదవేగి, ద్వారకాతిరుమల, కామవరపుకోట తదితర మండలాల్లో తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో మృతులు సామాన్య కూలీలు కావడంతో ఎలాంటి పరిహారమూ దక్కడం లేదు. పామాయిల్ కార్మిక సంఘం జోక్యం చేసుకున్న చోట కొద్దోగొప్పో పరిహారం అందుతుంది. ఈ ప్రమాదాలతో ఆయా కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రమాదాల నివారణకు ఇటు ప్రభుత్వం, అటు విద్యుత్ శాఖ నుంచి నిర్దిష్ట కార్యాచరణ కానరావడం లేదు. ఇటీవల విద్యుత్ శాఖాధికారులు ఆయిల్‌పామ్ గెలలు కోసేటప్పుడు తమకు సమాచారం అందిస్తే అటువైపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ సమాచారం ఎవరిస్తారు.. ఎవరు బాధ్యత వహిస్తారనేది స్పష్టత లేదు. దీనికి సంబంధించి రైతు, ఆ ప్రాంత ట్రాన్స్‌కో ఎఇ బాధ్యత వహించాల్సి ఉంటుంది. లైన్‌మెన్లే సబ్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి లైన్లు బాగుచేస్తున్నప్పుడు విద్యుత్ సరఫరా అయ్యి పలువురు, ప్రయివేటు వ్యక్తులు మరణిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఆయా సందర్భాల్లో విద్యుత్‌శాఖలో భాగమైన జూనియర్ లైన్‌మెన్ల కుటుంబాలకు కొంత న్యాయం జరుగుతున్నా ప్రయివేటు సిబ్బంది కుటుంబాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ గెలలు కోసే కార్మికుల ప్రాణాలకు ఎవరూ బాధ్యత పడతారనేది స్పష్టత రావాల్సి ఉంది. ఆయిల్‌పామ్ గెలలు కోసేటప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ తీగలున్నా ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ కవచాలు రైతు సమకూర్చాల్సి ఉంది. అదే సమయంలో విద్యుత్ లైన్ల ప్రాంతంలో పామాయిల్ చెట్లు ఆ స్థాయిలో పెరిగి ఉంటే దాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది గుర్తించి ఆయా రైతులను హెచ్చరిస్తే ముందుగానే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఒకవేళ అనూహ్య రీతిలో ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణనష్టం చోటుచేసుకుంటే కార్మిక కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం ఒక విధానం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఓపక్క పామాయిల్ రైతుల సమస్యలను పట్టించుకోకుండా.. మరోపక్క పామాయిల్ గెలలు కోసే కార్మికుల ప్రాణాలను గాలికొదిలేసేలా ప్రభుత్వ విధానాలు ఉండటంపై అంతా పెదవి విరుస్తున్నారు. పామాయిల్ రైతుల, కార్మికుల కష్టాలు గట్టెక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు.
కాటేస్తున్న కామాంధులు
జిల్లాలో వరుసగా పొక్సో కేసులు నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. తణుకు, వీరవాసరం మండలాల్లో ఇటీవల రెండు పొక్సో కేసుల్లో బాలికలపై అఘాయిత్యానికి పాల్పడింది పరిచయస్తులే కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. నిర్భయ, దిశ చట్టాలు వంటివెన్ని ఉన్నా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డూఅదుపు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్న పాలకులు అఘాయిత్యాలకు కారణమవుతుండగా వీటిని ప్రేరేపిస్తున్న అంశాలపై దృష్టి పెట్టలేకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. యువతను ప్రభావితం చేసి పక్కదోవ పట్టించే అశ్లీల అంశాలను నియంత్రించే వ్యవస్థ నేటికీ లేకపోవడం బాధాకరం. దీనికితోడు కేసులు నమోదైనప్పుడు త్వరితగతిన విచారించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించకపోవడం కామాంధుల స్వైరవిహారానికి కారణమవుతోందని స్పష్టమవుతోంది. చట్టాల పేర్లు చెప్పి ప్రచారం మాని వాటిని కట్టుదిట్టంగా అమలు చేయడంతోపాటు అఘాయిత్యాలను ప్రేరేపించే మాధ్యమాలను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అప్పుడే మన కనురెప్పలైన బాలికలను, మహిళలను కామాంధుల నుంచి రక్షించుకోగలమని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో కాటేసే కామాంధులకు ప్రభుత్వం పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లేనని భావించక తప్పదు.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










