May 12,2022 06:22

నియోజక వర్గాల పునర్విభజన పేరిట కాశ్మీర్‌ లోయపై మరో కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. జమ్మూ కాశ్మీర్‌ డీ లిమిటేషన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు కాశ్మీరీయుల అస్థిత్వానికే ముప్పుగా మారనున్నాయి. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న అనేక నిర్ణయాలు ఇప్పటికే కాశ్మీర్‌ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచి ఉన్నాయి. ఆ గాయాన్ని మాన్పడానికి బదులు మరింత బాధ పెట్టేలా చర్యలకు దిగడం దారుణం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తరహా వైఖరి కారణంగానే పునర్విభజన కమిషన్‌ నివేదికకు వ్యతిరేకంగా పోరాడాలని అక్కడి రాజకీయ పార్టీలు ఐక్యంగా నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణను కూడా ప్రకటించడం ఆహ్వానించదిగిన పరిణామం. నియోజక వర్గాల పునర్విభజనకు జనాభా సంఖ్యే కొలబద్ద. దేశంలో ఎక్కడ, ఎప్పుడు పునర్విభజన జరిగినా ప్రాతిపదిక ఇదే! మొట్టమొదటిసారి కాశ్మీర్‌లో ఈ సూత్రానికి భిన్నంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ ప్రయోజనాలకే కమిషన్‌ పెద్ద పీట వేసిందని, పరిధి దాటి వ్యవహరించిందని, సరిహద్దులు చెరిపేయడం ద్వారా జనాభాను తారుమారు చేసే కుట్రకు పాల్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జమ్మూ లో సీట్లు పెరిగితే బిజెపికి రాజకీయ లబ్ధి చేకూరుతుందన్నది బహిరంగ రహస్యమే! ఇప్పుడు కమిషన్‌ చేసిన సిఫార్సులు ఈ దిశలో ఉన్నాయి. బిజెపి రాజకీయ ప్రయోజనాల సాధన కోసం సరిహద్దుల్లోనూ ఇష్టం వచ్చినట్టు మార్పులను కమిషన్‌ ప్రతిపాదించింది. ఇవి అమలులోకి వస్తే అక్కడి ప్రజలు మరింతగా పరాయీకరణ భావనకు గురవుతారు. ఇది దేశానికి చేటుగా పరిణమిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పునర్విభజన కోసం 2011 జనాభా లెక్కలను కమిషన్‌ ప్రాతిపదికగా తీసుకుంది. ఆ లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.9 లక్షలు, జమ్మూలో 53.8 లక్షల మంది ఉన్నారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే కాశ్మీర్‌కు 51 సీట్లు, జమ్మూకు 39 సీట్లను కేటాయించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ, కమిషన్‌ కాశ్మీర్‌కు 47 సీట్లు, జమ్మూకు 43 సీట్లను ప్రతిపాదించింది. అంటే, 56 శాతం జనాభా ఉన్న కాశ్మీర్‌కు 52 శాతం సీట్లు రాగా, 44 శాతం జనాభా ఉన్న జమ్మూ ప్రాంతానికి 48 శాతం సీట్లు దక్కాయి. సంఖ్యా పరంగా చూస్తే జమ్మూ కన్నా కాశ్మీర్‌కు కేవలం నాలుగు సీట్లు అదనంగా వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 83 సీట్లు ఉండగా కాశ్మీర్‌కు 46, జమ్మూకు 37 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. జనాభా పొందిక అదేమాదిరి కొనసాగుతుండగా సీట్లలో మాత్రం ఈ స్థాయిలో భారీ మార్పులు ఎలా చోటుచేసుకుంటాయన్న ప్రశ్నకు జవాబియ్యవలసిన కమిషన్‌ దానికి బదులుగా క్షేత్ర స్థాయిలో పర్యటించాం, ప్రజల అభిప్రాయాలను సేకరించాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో కొన్ని నియోజక వర్గాలను 40 వేల లోపు జనాభాకు పరిమితం చేయగా, మరికొన్నింటిలో లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఉండటం పునర్విభజనలో జరిగిన కిరికిరికి నిదర్శనం.
ఆర్టికల్‌ 370ని కనీస సంప్రదింపులు, ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా నరేంద్రమోడీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను రెండు ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోయ లోని రాజకీయ నేతలను అరెస్ట్‌లు చేసి, ఇంటర్‌నెట్‌ను నెలల తరబడి నిలిపివేసి, ప్రజల గొంతుకలను బయటి ప్రపంచానికి వినపడకుండా చేసి వారి రాజ్యాంగ హక్కులన్నీ మోడీ సర్కారు గుంజుకుంది. ఇప్పుడు అదే ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌ అంతా ఒక్కటేనని, దానిని రెండుగా విభజించి చూసే అలవాటును మానుకోవాలని సుద్దులు చెబుతుండటం దుర్మార్గమైన రాజకీయ కుతంత్రంలో భాగమే! భవిష్యత్తులో రాష్ట్ర హోదా పునరుద్ధరించే సంగతి ఎలా ఉన్నప్పటికీ పునర్విభజన కమిషన్‌ సిఫార్సులు ఆచరణలో మతోన్మాద శక్తుల విజృంభణకే దోహదం చేస్తాయి. ఇది జమ్మూ కాశ్మీర్‌కే కాదు. మొత్తం దేశానికే ప్రమాదం. అందుకే కమిషన్‌ సిఫార్సులను తిరస్కరించాలంటూ పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పిఎజిడి-గుప్కార్‌ అలయెన్స్‌) పిలుపునిచ్చింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం.