Dec 29,2021 07:16

రెండేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక స్వయంప్రతిపత్తిని, రాష్ట్ర ప్రతిపత్తిని, రాజ్యాంగం కల్పించిన ఇతర రక్షణలను రద్దు చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, తాజాగా కశ్మీరీయులకు మరో ద్రోహం తలపెట్టింది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బిజెపి ఆడుతున్న ఈ కొత్త నాటకం కాశ్మీర్‌ లోయలో ప్రజలను రాజకీయంగా అణచివేయడమే లక్ష్యంగా సాగుతున్నది. పునర్విభజనలో భాగంగా జమ్మూకు 6 స్థానాలు, కాశ్మీర్‌కు ఒక స్థానాన్ని మాత్రమే పెంచుతూ డిలిమిటేషన్‌ కమిషన్‌ చేసిన సిఫారసులు బిజెపి విచ్ఛిన్నకర ఎజెండాకు అనుగుణంగా ఉన్నాయి. ఈ సిఫారసులకు తమకెంతమాత్రమూ ఆమోదయోగ్యం కావని కాశ్మీర్‌ లోని వివిధ పార్టీలతో కూడిన అలయెన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ (పి.ఎ.జి.డి) తేల్చి చెప్పింది. వీటికి వ్యతిరేకంగా జనవరి 1న నిరసనలు తెలిపేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. 2019 ఆగస్టులో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జమ్మూ కాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఇంత హడావుడిగా డిలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరమేమొచ్చింది? ఈ కమిషన్‌ ఏర్పాటు చేయమని ఎవరడిగారు? కమిషన్‌ చేసిన సిఫారసులు లోయలో ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారిని సైతం దిగ్భ్రాంతికి గురి చేశాయి. కమిషన్‌ ఏ సిఫారసు చేసినా అది హేతుబద్ధంగా, పలువురు మెచ్చేలా ఉండాలి.

రంజన్‌ దేశాయ్  నేతృత్వంలోని డిలిమిటేషన్‌ కమిషన్‌ చేసిన సిఫారసుల్లో హేతుబద్ధత పూర్తిగా లోపించింది. నియోజకవర్గ పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నామని చెప్పారు. ఆ ప్రాతిపదిక ప్రకారం 1,24, 437 మంది జనాభాకు ఒక నియోజకవర్గం చొప్పున కేటాయిస్తే 53. 5 లక్షల జనాభా కలిగిన జమ్మూకు తొంభై స్థానాలున్న అసెంబ్లీలో 39 సీట్లు, 68.8 లక్షల జనాభా ఉన్న కాశ్మీర్‌కు 51 సీట్లు ఇవ్వాలి. కానీ, కమిషన్‌ సిఫారసులు దీనికి రివర్స్‌లో ఉన్నాయి. జమ్మూకి గత అసెంబ్లీలో 37 స్థానాలుంటే వాటిని 43కి పెంచాలని సిఫారసు చేసింది. గతంలో 46 స్థానాలున్న కాశ్మీర్‌కు మాత్రం ఒక్కటే అదనంగా పెంచింది. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే జనాభాతో పాటు భౌగోళిక, కమ్యూనికేషన్స్‌ వంటివి పరిగణనలోకి తీసుకున్నట్లు కమిషన్‌ ఇచ్చిన వివరణ ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఉంది. డిలిమిటేషన్‌ కమిషన్‌ కారణాలు ఏం చెప్పినప్పటికీ బిజెపి మత సమీకరణలకు అనుగుణంగా జమ్మూకు పరిమితికి మించి స్థానాలు కేటాయించిందనేది కాదనలేని నిజం.

2021 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నియోజక వర్గాల పునర్విభజన చేపట్టకుండా నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్‌కు వచ్చేసరికి దీనికి భిన్నమైన వైఖరి తీసుకుంది. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టరాదంటూ జమ్మూ కాశ్మీర్‌ ప్రజాప్రాతినిధ్య చట్టం-1957 కింద విధించిన నిషేధాన్ని హైకోర్టు, సుప్రీం కోర్టు సమర్థించాయి. అయినా, లెక్కచేయకుండా కేంద్రం కాశ్మీర్‌లో పునర్విభజన ప్రక్రియ చేపట్టడం ద్వారా ప్రజా హితం కన్నా సంకుచిత రాజకీయ ప్రయోజనాలే తనకు మిన్న అని బిజెపి చెప్పదలచుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించకుండా, రద్దు చేసిన రాజ్యాంగ హక్కులను వారికి తిరిగి ఇవ్వకుండా, జైల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయకుండా అక్కడి ప్రజల విశ్వాసాన్ని కేంద్రం చూరగొనలేదు. అధికారం ఉంది కదా అని కాశ్మీర్‌ ప్రజలను నిరాయుధుల్ని చేసి, వారిని రాజకీయంగా అణచివేయాలని చూస్తే బిజెపికి భంగపాటు తప్పదు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కాశ్మీర్‌ లోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై నిలవడం ముదావహం. డిలిమిటేషన్‌ కమిషన్‌ బిజెపి చేతిలో పావుగా వ్యవహరించడం మాని తన స్వతంత్రతను నిలబెట్టుకోవాలి. డిసెంబరు 31 తరువాత ఇచ్చే తుది నివేదికలోనైనా కాశ్మీర్‌ లోయకు న్యాయం జరిగేలా చూడాలి. లేకుంటే చరిత్ర క్షమించదు. కాశ్మీర్‌ ప్రజలు అంతకన్నా క్షమించరు.