కాశినాయన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలిప్రజాశక్తి - కడప అర్బన్
అకెంగుండ్ల రెవెన్యూ పొలంలో 235 ఎకరాల ప్రభుత్వ భూములను తప్పుడు రికార్డులు సష్టించుకుని అనుభవిస్తున్న హైదరాబాద్ చెందిన భూకబ్జాదారుడు శ్రీనివాసులు రెడ్డికి సహకరిస్తున్న కాశినాయన మండల ఎస్‌ఐ హరిప్రసాద్‌ను సస్పెండ్ చేయాలని భూ పోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ బి. నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి. అన్వేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశినాయన మండలం అకెంగుండ్ల రెవెన్యూ గ్రామం సర్వేనంబర్ 146,147 ప్రభుత్వ భూమిని యంబడి పోలయ్య దళితుడు సాగు చేస్తున్నడని, ఆ భూమిలో తప్పుడు రికార్డు పత్రాలను సష్టించి హైదరాబాదుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే స్థానికేతరుడిఇ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తుందన్నారు. పది సంవత్సరాలుగా ఈ భూమిలో బోరు బావి తవ్వించుకుని, విద్యుత్ మోటర్ తగిలించుకుని వ్యవసాయం చేస్తున్న పోలయ్య అనే దళితుని దౌర్జన్యం చేసి భూమిని అక్రమించుకోవడానికి యత్నిస్తున్నాడని వాపోయారు. ఈ విషయంపై గతంలో అనేక పర్యాయాలు రెవెన్యూ అధికారులకు తెలియజేసిన శ్రీనివాసులు రెడ్డి పైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. 235 ఎకరాలు పైన శ్రీనివాసులురెడ్డి ఆధీనంలో ఉందని, భూకబ్జా కేసు నమోదు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ కు సహకరించిన రెవెన్యూ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సంబంధం లేని కాశినాయన మండలం ఎస్‌ఐ హరిప్రసాద్ రెవెన్యూ విషయంలో జోక్యం కల్పించుకుని భూకబ్జాదారునికి వత్తాసు పలుకడం శోచనీయమన్నారు. పెద్ద ఎత్తున భూకబ్జాదారుడైన శ్రీనివాసులు రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని అవినీతికి పాల్పడినట్లు తమ దష్టికి వచ్చిందన్నారు. అవినీతి పాల్పడి భూకబ్జాదారులకు అండగా నిలుస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసుల మీద సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేద దళితులని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సురేష్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు యంబడి పోలయ్య పాల్గొన్నారు.










