Mar 14,2021 14:00

'నువ్వు నాకే పుట్టావా!' నాన్న అనే మాటలు తరచూ సమీర్‌ చెవుల్లో పాదరసంలా జారుతుంటాయి. హోటల్‌ నుండి మణికర్ణిక ఘాట్‌కు నడుస్తున్నాడు. దారిలో కనబడ్డ హోటల్‌లో కూర్చొని టిఫిన్‌ చేస్తుండగా పక్క టేబుల్‌పై ఖాళీ టీ కప్పుల్ని చూశాడు. వాటి నిండా ఈగలు ముసురుతున్నాయి. రాత్రి వారణాసి రైల్వేస్టేషన్‌లో దిగినప్పుడు ఫలానా హోటల్‌కు తీసుకెళతామని తనను చుట్టుముట్టిన హోటళ్ళ తరపు దళారులు గుర్తొచ్చారు. టీ తాగి ఖాళీ కప్పును టేబుల్‌పై వదిలి, బయటకి నడిచాడు.
గంగానది కనుచూపు మేరలో ఉంది. తెలుగు మాటలు చెవినబడేసరికి పాన్‌షాపు వైపుకు తిరిగాడు. సమీర్‌ తనను వాళ్ళకు పరిచయం చేసుకున్నాడు. షాపులో ఉన్నతను తన పేరు తాతాజీగానూ, బయట కూర్చొన్న సాధువు జ్ఞానేశ్వర్‌గానూ చెప్పారు. సమీర్‌ జ్ఞానేశ్వర్‌ వైపు తిరిగి, చిన్న నవ్వు నవ్వాడు. నమస్కారాన్ని ఆశించిన సాధువు భంగపడ్డాడు.
'పిండ ప్రదానం చేయడానికి మీకు తెలిసిన బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే కొంచెం మాట్లాడి పెడతారా?' సమీర్‌ బతిమాలుతున్నట్టు తాతాజీని అడిగాడు. షాప్‌ బిజీగా ఉండడంతో కాసేపు కూర్చోమన్నాడతను.
సమీర్‌ సాధువును చూస్తూ 'ఎంతకాలం నుండి ఇక్కడుంటున్నారు?'
పదిహేనేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను. ముక్తి దొరికే వరకూ ఇక్కడే ఉంటానని నిశ్చయంగా చెబుతూ 'తాతాజీ దగ్గర గంజాయి తెచ్చిపెట్టు' అన్నాడు సాధువు.
తాతాజీని గంజాయి ప్యాకెట్‌ అడిగి తీసుకుని, దీనికి డబ్బులు తనే ఇస్తానని చెప్పాడు సమీర్‌.
తాతాజీ అలాగేనని తలాడించి, బేరాలు చూసుకోవడంలో పడిపోయాడు. అతనికి భార్య, కొడుకు సహాయపడుతున్నారు.
గంజాయిని తన సంచిలో వేసుకుంటూ 'ఎవరికి పిండిపదానం చేయాలి?' సాధారణంగా అడిగాడు సాధువు.
'నాన్నకు'
'ఎలా చనిపోయారు?'
'నా వల్లే!'
'నీ తండ్రిని బతికుండగానే నరకంలోకి నెట్టావా? ఇంక చనిపోయాక ఆయన్ను పున్నామ నరకం నుండి నువ్వెలా తప్పిస్తావు? నువ్వు పాపకూపాల్లోకి నెట్టివేయబడ్డ వాడివి!' అని బెదిరించే తీరు గొంతు వినిపించాడు సాధువు.
'నన్ను భయపెడుతున్నారా! మీ మాటల అంతరార్థమేమిటి?' సూటిగా అడిగాడు సమీర్‌.
సాధువు అల్పజీవిని చూస్తున్నట్టు మొహం పెడుతూ పక్కకు తల తిప్పుకున్నాడు.
సమీర్‌కు తెలుసు. వీళ్ళందరూ తాము మాత్రమే సర్వశ్రేష్ఠులైన మానవులనుకుని, మిగిలిన వాళ్ళను అజ్ఞానులుగా చూస్తారు. మత్తు ప్రవాహం వీళ్ళలో నిరంతరం ఉంటుంది. అది గంజాయి వల్ల వచ్చింది మాత్రమే కాదు!
'నీ తండ్రంటే నీకేమంత ఇష్టమున్నట్టు కనిపించడం లేదు. మరెందుకు, ఇంతదూరం వచ్చావు?' కరకుగా అడిగాడు సాధువు.
'అస్థికలు గంగలో కలిపితేనే ఆస్తి ఇవ్వాలని వీలునామాలో రాశారు!' అన్నాడు.
'డబ్బు కోసమా ఈ అస్థికల నాటకం?' సాధువు గొంతులో అసహ్యం ధ్వనించింది.
మనిషికి మనిషి ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళ మధ్య అంత రెట్టింపు దూరముందని అర్థం. అది సమీర్‌కు తెలుసు. తననెవరైనా అర్థం చేసుకోకపోయినా, ఎబ్బెట్టుగా చూసినా, ఏదో ఒక వంకతో విమర్శించినా పట్టించుకోడు.
సాధువుతో ఏమీ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ప్రవహిస్తుంది.
తాతాజీ షాపుకొచ్చే వాళ్ళతో మాట్లాడే విధానాన్ని పరిశీలిస్తున్నాడు సమీర్‌. చాలా కలుపుగోలుగా, భోళాతనంతో మాట్లాడుతున్నాడు. మాటిమాటికీ సిగ్గుపడుతున్నాడు. గంట గడిచింది.
తాతాజీ అభ్యర్ధిస్తున్నట్టుగా 'జ్ఞానేశ్వర్‌ జీ! ఈ కుర్రాడిని మన బ్రాహ్మణుల దగ్గరికి తీసుకెళ్ళండి' అన్నాడు.
సాధువు సమాధానం చెప్పలేదు.
షాపు భార్యని చూసుకొమ్మని చెప్పి, తాతాజీ సమీర్‌ను వెంటబెట్టుకెళ్ళాడు.
కాసేపాగాక ఘాట్‌ దగ్గరికి తాతాజీ వెనుక సమీర్‌ నడిచెళ్తుంటే గుండు కొట్టించుకున్న భక్తులు ఎదురొస్తున్నారు.
ఊళ్ళలో కొన్ని కులాలకు గుళ్ళకొచ్చే అర్హత ఉండదు. మరిక్కడీ ఎవరే కులమో ఎవరికి తెలుసు. దేశమంతా ఇక్కడుంటేనూ! మనుషుల ద్వంద్వ విధానాలకు సమీర్‌కు నవ్వొచ్చింది.
పండా (బ్రాహ్మణుడు) చెప్పినదాంట్లో సగానికి సగం తగ్గించి, బేరమాడి ఒప్పించి తాతాజీ షాపు చూసుకోవాలని వెళ్ళిపోయాడు.
మెళ్ళో జంధ్యం పోగుతో సమీర్‌ మణికర్ణిక ఘాట్‌ను పరిశీలిస్తున్నాడు.
పావురాలు గుళ్ళ మీద వాలి, అక్కడ్నుంచి ఎగిరొచ్చి ఘాట్‌లో గాలికెగురుతున్న చితాభస్మాలపైన రెక్కలు టపటపలాడిస్తూ కూర్చొంటున్నాయి. గుడి గోపురాన్ని మట్టిగా చేసుకుని, రావి మొక్కలు ఆకాశం వైపుకు చూస్తున్నాయి.
నదిని జారుడు బల్లని చేసుకుని, జారే పడవలపై విదేశీ యాత్రీకులు, ఆ పడవలపైనా కపోతాలే. కొన్ని పడవలు అవతలి తీరాన్నుండి కట్టెల్ని మోసుకొస్తున్నాయి.
పండా మంత్రాలు చదువుతుండగానే పిండాలు చేయడం పూర్తిచేశాడు. అవి పట్టుకుని, అతని వెనుక మెట్లు దిగుతున్నాడు. తనను చూస్తూ చిద్విలాసం చేస్తున్న అఘోరాను సమీర్‌ చిరునవ్వుతో పలకరించాడు.
నది చల్లదనం మోకాళ్ళ కీళ్ళలోకి చేరాక పిండాల్ని, అస్థికలను నిమజ్జనం చేశాడు.
నదిలో మునకలేసి, వెనుదిరిగాక కాల్చడానికి తీసుకొచ్చిన శవాల పక్కన ఏడ్చిఏడ్చి బొంగురుపోయిన అయినోళ్ళ గొంతుల్ని గుండెకు వినిపించాడు.
'ఈ మనషులు చనిపోయిన వాళ్ళ పట్ల చూపిన దయను బతికున్నప్పుడు చూపించరు' అందా హృదయం.
'అందులో నేనూ ఒకడిని!' అనుకుంటూ సమీర్‌ మెట్లెక్కాడు.
వచ్చిన దారిని గుర్తు చేసుకుంటూ పాన్‌ షాపు దగ్గరకు చేరుకున్నాడు.
తానిక శెలవు తీసుకుంటానని అక్కడున్న వారందరికీ చెప్పాడు.
తాతాజీ చిన్నగా తలూపి, పాన్‌ చుట్టడంలో నిమగమయిపోయాడు. సాధువు చెప్పిన ఏవో మాటలు అతడి ప్రవర్తనకు కారణమై ఉంటుందని సమీర్‌ జ్ఞానేశ్వర్‌ వైపు తిరిగాడు. అతడు వచ్చిపోయే యాత్రికుల్ని చూస్తున్నట్టు నటిస్తూ, గడ్డం నిమురుకుంటున్నాడు.
సమీర్‌ నాలుగడుగులు దారివైపు వేసి వెనుదిరిగి చూశాడు. తనపై తాతాజీ వెలివేయబడ్డ చూపుల్ని గమనించాడు. జ్ఞానేశ్వర్‌ స్వర్గాన్ని తిరస్కరించినవాడిలా తనను చూడడాన్ని అర్థం చేసుకుని, ఇక వెనుదిరగకుండా నడిచి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి హోటల్‌ టెర్రస్‌ పైకి ఎక్కాడు. చలిగాలి ఊపిరితిత్తుల్ని కొరుకుతున్నా కిందకు దిగి వెళ్ళాలనిపించలేదు. లైట్ల కాంతిలో నది మునకలేస్తుంది. వెలుతురు సోకని నది భాగమంతా నల్లటి ఆకాశంలో కలిసిపోయినట్టు ఉంది.
చీకటి...చీకటి...తనలో ప్రవహిస్తున్న చీకటి. వెలుగును కాల్చగల చీకటి.
చీకటిని తగలేసే వెలుగు కోసం వెంపర్లాట చిన్నప్పటి నుండి ఉంది. తనదైన జీవితం కోసం చేసిన ప్రయత్నం ఇప్పటివరకూ గడిచిన కాలమంతా నిండిపోయింది.
నిద్రపోని కాశీ నగరం ''నీ కథ చెప్పవా?'' అని సమీర్‌ గుండెకి చెవి ఆన్చింది.
********
అమ్మ మృదుస్వభావి. భర్త మాటకు ఎదురు చెప్పకూడదనే సగటు భార్య. అణచివేతను వ్యతిరేకించలేని సాదాసీదా మహిళ. నాన్న అమ్మతో ప్రేమగా కబుర్లు చెప్పడం నేనెప్పుడూ చూడలేదు. ఆయనో రాజకీయ నాయకుడు. ఎదుటి మనిషిని పొగిడి వాళ్ళతో అబద్ధాలాడి డబ్బు చేసుకోవాలనేతనం ఆయనది. నా తండ్రి జీవితంలో నైచ్యాన్ని, లేకితనాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. ఆయన దగ్గరకు కష్టాలు చెప్పుకోవడానికొచ్చిన బీదాబిక్కీ చెప్పే మాటలను సావధానంగా విన్నట్టు నటించేవాడు. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళను విమర్శించేవాడు. కొందరు పెద్దలు ఆయన దగ్గరకు తాజాగా ఉన్న పూలగుత్తులతో వచ్చేవాళ్ళు. వాళ్ళంతా కృత్రిమంగా నవ్వేవారు. అవసరార్థం వచ్చేవారు. ఆర్థిక ఆపేక్ష వాళ్ళ సంభాషణల చివర ఉండేది. తనకేమాత్రం పనికిరాని వాడనుకుంటే ఆ వ్యక్తితో మెల్లగా తెగతెంపులు చేసుకునేవాడు. జీవుల్లో ఉన్న వికృతతత్వమంతా ఒక మనిషిగా మారితే నా తండ్రిలా ఉంటాడేమో!
ఒకరోజు అర్ధరాత్రి తప్పతాగి, తన ఇద్దరు మిత్రులతో ఇంటికొచ్చాడు. అర్జంటుగా టీ కావాలన్నాడు. ఉదయం నుండి అమ్మకు తీవ్రమైన తలపోటు. అప్పుడే కాస్త మగతగా నిద్రలోకెళుతుంది. నేను వంటగదిలోకి వెళ్ళాను. గ్యాస్‌ కూడా అయిపోయింది. వెంటనే బీరువా దగ్గరకెళ్ళి కరెన్సీ నోట్ల కట్టల్ని తీసుకొచ్చి సిమెంటు పొయ్యి మీద టీ పెట్టాను. ఒక్కో నోటును బూడిదగా మార్చాను. కాలిన ప్రతినోటూ టీ రుచిని బాగా పెంచినట్టుంది. టీ బాగుందన్నారు. పనిమనిషి ద్వారా విషయం తెలిసిన నాన్న నన్ను చావబాదేశాడు. డబ్బు విలువ తెలిసేదాకా నాకు అన్నం పెట్టొద్దన్నాడు. భయపడొద్దని అమ్మ నా చేతిని ప్రేమగా నొక్కింది.
నాన్నెప్పుడూ విలాస పురుషుడిగా ఉండాలని తాపత్రయపడేవాడు. ఆయన నోట్లో సిగరెట్టో, మందో నిత్యం ఉంటుండేవి. సగం కాల్చిన సిగరెట్లు ఇంటి నిండా ఉండేవి. వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకుని, సమాజం ముందు మగతనాన్ని ప్రదర్శించేవాడు. పిల్లల్నెలా పెంచాలి? అనే పుస్తకాలొస్తున్నాయిగానీ తండ్రిగా ఉండడం ఎలా? అనే పుస్తకాలూ రావాలి.
ఆయన నాకు ఎదురుపడినప్పుడు నా కళ్ళు ప్రసన్నంగా ఉండేవి. అందుకే నన్ను చూసినప్పుడు ఆయన మానసిక చిత్రహింస అనుభవించేవాడు. ఆయనలాగా ఆలోచించాలని అమ్మతో నాకు నచ్చజెప్పించి, తన దారిలోకి తెచ్చుకోవాలనుకునేవాడు.
తండ్రులందరూ కొడుకుల్ని తప్పైనా తనలాగే ఆలోచించాలంటారు. కొడుకులు క్లాస్‌రూమ్‌లో నేర్పిన నీతి గురించి అడిగితే, ప్రపంచంలో ఎవరిలోనూ నిజాయితీ లేనప్పుడు మనమూ పాటించనక్కర్లేదని క్లాస్‌ తీసుకుంటారు.
కాలేజీ ప్రిన్సిపాల్‌ నాన్నకొకసారి ఫోన్‌ చేశారు.
'ఫీజుకట్టని వాళ్ళందరినీ క్లాస్‌రూమ్‌లో నుండి బయటకు వెళ్ళిపొమ్మంటే మీ అబ్బాయి బయటకెళ్ళిపోయాడు. నువ్వు ఫీజు కట్టావుగా!బయటకు ఎందుకు వెళ్ళిపోయావని అడిగాను. ''నా బెస్ట్‌ఫ్రెండ్‌ ఫీజు కట్టలేదు. వాడికి తోడుగా ఉందామని బయటకొచ్చేశాను'' అన్నానని' నాన్నకు చెప్పాడు.
ఆ రాత్రి నాన్న సోఫాలో కాళ్ళు బారజాపుకుని మందు గ్లాసుల్ని ఖాళీ చేసి అలానే పడిపోయాడు. ఆయన్ను మంచం మీద పడుకోబెట్టడానికి అమ్మకు సాయంగా నేనూ వెళ్ళాను. చెరొక చెయ్యి పట్టుకుని తీసుకొస్తున్నాం. ఆయన నన్ను ఎర్రటి కళ్ళతో మత్తుగా చూసి, నా చేయి పట్టుకుని ఈడ్చి కోపంగా గిరాటేశాడు.
రోజూ టి.విలో ఆధ్యాత్మిక ప్రవచనాలను వినేవాడిని. ఆ మాటలు చిలుకపలుకులని అర్థమౌతుంది. అవి మంత్రాల్లా ఆకర్షిస్తున్నాయి. అలాంటి చక్కెర గుళికలే జగాన్ని నిర్దేశిస్తున్నాయి. ఏ గుడికీ వెళ్ళేవాడిని కాదు. నా స్వేచ్ఛను విశృంఖలత్వంలా భావించేవారు. వ్యక్తి స్వేచ్ఛే నా విప్లవం. ఈ ఘర్షణల్లోంచే బానిసలు, స్వతంత్రులు పుట్టేది.
అమ్మకు తల పార్శ్వపునొప్పి తగ్గించడానికి ఫాస్టర్‌ ఒకాయన వచ్చాడు. ప్రార్ధించి, నూనె ఇచ్చారు.
'నీ ఆత్మను నేను కాపాడతాను. ప్రభువును నమ్ముకో' అని నాతో అన్నాడు.
నేనతన్ని పిచ్చోడిలా చూశాను. అతనూ నన్ను అలాగే చూశాడు.
మెదడును దైవభావన తొలిచెయ్యడం మొదలుపెట్టాక, వాళ్ళ విశ్వాసం తప్ప మిగిలిన వాటిని ఎవరూ నమ్మరు. మిగిలిన వాళ్ళకేం తెలియదని, వాళ్ళే సత్యాన్ని కనుగొన్నామనుకుంటారు. నేనే మతానికి చెందినవాడిని కాకపోయేసరికి చుట్టు పక్కల సమాజం, చుట్టాలు నాన్నకు వరుసగా కంప్లైంట్లు చేయడం ఎక్కువైంది.
రాత్రిళ్ళు నాన్న తాగి, అమ్మ దగ్గర ఈ విషయం మీదే ఏడ్చేవాడట. సమాజం గుర్తించేలా, గౌరవించేలా నువ్వు ఉండాలని మీ నాన్నగారు కోరుకుంటున్నారు అనేది అమ్మ. ఏడ్చే మగవాళ్ళ కోరికల్ని తీర్చడానికి నేను దేవుడిని కానన్నాను.
*********
చాలారోజులుగా నాన్నపై నడుస్తున్న కోర్టు కేసు ఫైనల్‌ హియరింగుకు వచ్చింది. అందరితో పాటు నేనూ కోర్టుకెళ్ళాను. ర్యాంపుల్లో ఇసుకను అనధికారకంగా తోలుతున్నారు. అది నాన్నది కావడం మూలాన అధికారులెవరూ పట్టించుకోలేదు. కొత్తగా వచ్చిన అధికారి ఇసుక ట్రాక్టరును అడ్డుకున్నాడు. ఆయన దళితుడు. నాన్న అతనికి పైఅధికారులతో ఫోన్‌ చేయించి, ఇంటికి పిలిపించారు. పైఅధికారుల ముందే అతణ్ణి కులం పేరుతో తిట్టారు. అవమానంతో ఎదురు తిరిగిన ఆయన్ని నాన్నే స్వయంగా కొట్టారు. ఆ అధికారి కేసు పెట్టాడు. పైఅధికారులతో పాటు నన్నూ సాక్ష్యులుగా పేర్కొన్నాడు.
ఆఫీసర్లు సంఘటనా స్థలంలో తాము లేనేలేమన్నారు. సాక్ష్యం చెప్పే వాళ్ళెవరూ లేకపోవడంతో ఆ కేసు నిలబడదు. అధికారం అంటే భయం, డబ్బంటే ఆశ. ఇదే నేటి ప్రపంచం. లోపలి లోకాన్ని బయటకు చూపించే తెగువ పిరికి జనాలకు ఉండదు. నేను తింటున్న రక్తపు కూడును విసిరికొట్టాలి అనిపించింది. ఆటవిక న్యాయమే చెల్లుబాటయ్యే చోట ధర్మం కోసం నిలబడాలి. బతుకు నాటకంలో క్షుద్ర కీటకంగా బతికే బదులు, నేను సంఘటన జరిగిన స్ధలంలో ప్రత్యక్ష సాక్షినన్న వాస్తవాన్ని ప్రపంచానికి వెల్లడించాలనుకున్నాను. కోర్టులో జడ్జిగారి ముందు అదే చెప్పాను. నాన్న కోర్టులోనే పళ్ళు బిగబట్టి బోనును గుద్దుతూ నన్ను చూశాడు. కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది.
తరువాతి రోజు పేపర్లలో, టి.విల్లో ఇదే వార్త. నా చుట్టూ ఉన్న సమాజం నన్నొక వింతజీవిని చేసింది. నాన్నను చూడడానికి అమ్మతో పాటు నేను జైలుకి వెళ్ళాను. నన్ను చూస్తే ''వీడు నాకు పుట్టలేదు'' అంటాడని బయటే కూర్చున్నాను. రెండు రోజుల తరువాత ఉదయం జైలు నుండి ఫోనొచ్చింది. రాత్రి గుండెపోటుతో నిద్రలోనే నాన్న మరణించారని జైలు వార్డెన్‌ చెప్పారు. అందరూ నా వైపు ఐదు వేళ్ళు ఎత్తి చూపించారు. ఇప్పుడు మా ఇంటికి ఎవరూ రావడం లేదు. ఇంట్లో, మాలో ధ్యాన నిశ్శబ్దం ఉంది. అమ్మకు ఈ మధ్య తలనొప్పి రావడం లేదు. ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఒకరోజు లాయర్‌ మా ఇంటికొచ్చారు. నాన్న జైలులో ఉండగానే లాయర్‌ను పిలిచి 'నా ఆస్తి నా కొడుక్కి దక్కాలంటే నా అస్థికలు కాశీలో కలపాలి' అని వీలునామాలో రాయించారట. ఆ విషయాన్నే లాయర్‌ మాకు చెప్పారు. ''అలాగే'' అన్నాన్నేను.
లాయర్‌ నవ్వి 'నాకంతా తెలుసు. మీరేమీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. రేపే మీ ఆస్తిని మీకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను' అన్నారు.
నేనొప్పుకోలేదు. 'నాన్న ఏ ఉద్దేశ్యంతో ఆ పని చేయమన్నారో అది సెకండరీ. ముందు ఆయన ఆస్తి నాకు కావాలంటే ఆ పని తప్పక చేయాలి. ఆయన లేరని నేను నా మనస్సాక్షిని కప్పి ఉంచుకోలేను. కాశీ నుండి తిరిగొచ్చాక ఆస్తుల్ని తీసుకుంటాను. మాకు అసలు ఆస్తులు చాలు. అవినీతి సొమ్మును ఏంచేయాలో నాకొక క్లారిటీ ఉందని' అన్నాను.
లాయర్‌ ఆసక్తిగా విన్నారు. 'సరే మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం' అని నా భుజంపై తట్టి వెళ్ళాడు.
నేను నీ దగ్గరకు ప్రయాణమయ్యాను.
******
సమీర్‌ ఆలోచనలతో అర్ధరాత్రిని దాటేశాడు. టెర్రస్‌ నుండి కిందకు దిగి, తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.
నగరం జరిగిన కథ వింది. అది సశేషం. కథ తనే నడుపుతుంది. సమీర్‌ లేచి చూస్తే మళ్ళీ మధ్యాహ్నం. ట్రైన్‌ టైమ్‌ మూడు గంటలకే. బయట రిసెప్షన్‌లో తాళాలిచ్చి, రూమ్‌ను వెకేట్‌ చేశానని చెప్పాడు.
రైల్వేస్టేషన్‌కు చేరుకుని, రైలుకోసం ఎదురుచూస్తుంటే కునుకుపాట్లు వస్తున్నాయి. రాత్రంతా కలత నిద్ర. అందుకే ఇప్పుడు మగతగా నిద్ర కమ్మేస్తుంది. రైలొచ్చాక బెర్త్‌పై పడుకున్నాడు. ప్రయాణీకుల అరుపుల మధ్య నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుండగా సుషుప్తిలో ఓ ఘటనకు చెందిన స్నాప్‌షాట్‌.
'జ్ఞానేశ్వర్‌ తీసుకున్న గంజాయి ప్యాకెట్‌కు తను డబ్బులివ్వలేదు'. ఉన్నఫళంగా లేచి కూర్చున్నాడు. వడివడిగా బ్యాగు తీసుకుని, రైలు దిగాడు. రైలు బయల్దేరింది. దానికి వీడ్కోలిచ్చి స్టేషన్‌ బయటకు నడిచాడు.
సమీర్‌ పాన్‌ షాపు దగ్గరకు చేరుకునేటప్పటికి జ్ఞానేశ్వర్‌ అక్కడ లేడు. తాతాజీ, అతని భార్య, కొడుకు షాపుని చక్కబెడుతున్నారు.
సమీర్‌ని చూసి తాతాజీకి మాట రాలేదు. కాసేపటికి తేరుకుని 'అదేమిటి 3 గంటలకే కదా రైలు?' అన్నాడు.
'రైలెక్కాక జ్ఞానేశ్వర్‌ గారి కోసం నేను మీ దగ్గర తీసుకున్న గంజాయికి డబ్బు ఇవ్వలేదని గుర్తొచ్చింది. మీ ఫోన్‌ నంబర్లు నాకు తెలియదు. మీకు డబ్బు ఇవ్వనక్కర్లేదని నాతో నేను అబద్ధమాడుకోలేను. అందుకే తిరిగొచ్చా'నంటూ డబ్బులిచ్చాడు సమీర్‌.
'కాశీలో అబద్ధమాడకూడదంటారు. అది మీరు పాటించారు.' 'కాశీలోనే కాదు, ఎక్కడా అబద్ధమాడకూడదు. జ్ఞానేశ్వర్‌గారు ఎక్కడికెళ్ళారు?' రాతిబండపై చూస్తూ అడిగాడు సమీర్‌.
షాపు భార్యను చూస్తుండమని చెప్పి, తాతాజీ సమీర్‌ను వెంటబెట్టుకుని ఘాట్‌ కొచ్చాడు. నదికి దగ్గర్లో దహనం జరిగేచోట జ్ఞానేశ్వర్‌ను పడుకోబెట్టారు. ఆ శవం చుట్టూ జనం మూగలేదు. ఘాట్‌లో మిగతా సాధువులు ఒక్కొక్కరుగా చూసి, వెళ్ళిపోతున్నారు.
తాతాజీ వైపు అయోమయంగా చూశాడు సమీర్‌.
'జీవుడు వెళ్ళిపోయాడండీ!' అంటున్న తాతాజీని చూసి, శవాల్ని దహనం చేసే కాంట్రాక్టరు వచ్చాడు.
'ఎవరూ లేని అనాథ శవం కదా. మీరే ఉచితంగా కాల్చాలి సాబ్‌' తాతాజీ కాంట్రాక్టరును బతిమాలుతున్నాడు.
సాధువు దగ్గర కూర్చొన్న సమీర్‌ లేచి కాంట్రాక్టర్‌తో 'ఎంతయితే అంత నేనిస్తాను. దహన సంస్కారాలు కానివ్వండి!' అన్నాడు.
కాంట్రాక్టర్‌ చెయ్యి ఊపే సరికి ఇద్దరు కుర్రాళ్ళొచ్చారు. కాంట్రాక్టరు చెప్పింది విని, నదికి ఆన్చి పుల్లల్ని పేర్చారు.
సాధువు పక్కనే సమీర్‌, తాతాజీ కూర్చున్నారు. కాంట్రాక్టర్‌ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం కావడం మూలాన మణికర్ణికలో మండుతున్న చితులు స్పష్టంగా కనబడుతున్నాయి.
శవాన్ని తీసుకెళ్ళడంలో ఇద్దరు కుర్రాళ్ళూ వీళ్ళను సహాయం కోరారు. తాతాజీ సంకోచిస్తున్నాడు. సమీర్‌ లేచి శవాన్ని చితిమీదకు సాయం పట్టాడు. అరచేతికి శవ స్పర్శ చల్లగా తగిలింది. కాశీ చల్లగా ఉంటుంది. శవాల ఒంటి చల్లదనం కూడా దానికి కారణం కావచ్చు. ఆ చల్లదనాన్ని చంపేస్తూ వెచ్చటి మంటతో చితి రగిలింది.
తాతాజీ దగ్గరకు వాళ్ళబ్బాయి వచ్చి 'అమ్మ రమ్మంటోంది' అని భాషను తర్జుమా చేస్తున్నట్టు చెప్పి, సమాధానం వినకుండా వెళ్ళిపోయాడు. అప్పటికి అతడలా రావడం రెండోసారి.
సమీర్‌ చితికి దగ్గరగా కూర్చున్నాడు. గాలిలో మాంసం కాలుతున్న కమురు వాసన. సంధ్య వాలింది. అప్పుడప్పుడు కాంట్రాక్టరు వచ్చి సమీర్‌ను చూసి, వెళుతున్నాడు. అతడలా ఎందుకు వస్తున్నాడో సమీర్‌కు తెలుసు. సగం కాలిన శవాలను గంగలోకి నెట్టేసి, ఆ పుల్లల్ని ఇంకో శవదహనానికి అమ్ముకునే వ్యాపారి ఆశకు తనొక అడ్డుగోడయ్యాడు. తనను వ్యాపారి తిట్టుకుంటాడు. ఆ మాటకొస్తే తన జీవిత పర్యంతం అందరూ తిట్టుకునేవాళ్ళే.
తాతాజీ మెట్ల మీద కూర్చొని, సమీర్‌ వంక చూస్తూ 'కాలుతున్న వ్యక్తికీ ఇతడికీ ఏ సంబంధమూ లేదు. మనమెవరికైనా ఏదైనా చేయాలంటే వాళ్ళు మనకేదైనా అయ్యుండాలా? మనిషైతే చాలదా! ఇతడు మనిషి!' అనుకున్నాడు.
చితులన్నీ నిప్పుగూళ్ళలా వెలిగిపోతున్నాయి. బతికినన్ని రోజులు కలత నిద్రపోయిన జీవులన్నీ చనిపోయాక ఏ బాదరబందీ లేని ప్రశాంతమైన ముఖంతో ఆ గూళ్ళలో తలదాచుకుంటున్నాయి. నది నీళ్ళకు బూడిదంటుకుంది. సమీర్‌ నిద్ర రాకుండా ఆ నీళ్ళతోనే మొహం కడుక్కున్నాడు. నది చల్ల గాలులకు నిప్పు తోడై, చితాగ్నులు భగభగలాడుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే మెట్లపై వచ్చే జనం, వెళ్ళే జనం.
ప్రపంచంలో అన్ని యాత్రలు భక్తినో, ప్రకృతి ఆహ్లాదాన్నో ఇస్తే ఇక్కడ చావు నుండి మనిషి వైరాగ్యాన్ని మోసుకెళ్తాడు. ఆ వైరాగ్యం ఘాట్‌ దాటగానే మాయమైపోతుంది. అది అసలు మాయ.
సమీర్‌ చితి బూడిదగా మారేదాకా దాని దాపునే ఉండిపోయాడు. పండాను పిలిచి మిగిలిన క్రతువు కూడా పూర్తిచేశాడు. గంగలో పిండాన్ని, అస్ధికల్ని కలిపి, ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుని, బ్యాగ్‌ భుజాన తగిలించుకున్నాడు. వెనుదిరగకుండా మెట్లెక్కుతున్నాడు. గడ్డకట్టిన చీకటి నేలరాలుతుంది. పాకుతున్న చీకటిని సూదిముక్కులతో దీపపు పక్షులు తినేస్తున్నాయి.
తాతాజీ వెళ్ళిపోతున్న సమీర్‌నే చూస్తూ ఒకటే కోరుకుంటున్నాడు.
'వెళుతున్న అతడు తిరిగొచ్చి, నన్ను చాచి దవడ బద్ధలయ్యేలా కొడితే ఎంత బాగుణ్ణు!'.