Apr 26,2023 17:10

ఎంఆర్‌సి కార్యాలయం ముందు నిల్వ ఉన్న వర్షపు నీరు

కార్యాలయాల ముందు నిలిచిన వర్షపు నీరు
లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డ అధికారులు, సిబ్బంది
ప్రజాశక్తి - పగిడ్యాల

      పగిడ్యాలలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ అకాల వర్షానికి ప్రభుత్వ కార్యాలయాల ముందు వర్షపు నీరు నిల్వ ఉండిపోయింది. నిలిచిపోయింది. దీంతో అధికారులు కార్యాలయంలోకి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగిడ్యాల మండలంలో 60.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఎంఆర్‌సి, భవిత కార్యాలయం, వెలుగు, ఉపాధి, వ్యవసాయ కార్యాలయాలు, గ్రంధాలయం ఆవరణంలో వర్షపు నీరు భారీగా నిలిచింది. అదికారులు, సిబ్బంది, సమస్యలపై వినతులు అందజేసేందుకు వచ్చిన ప్రజలు కార్యాలయంలోనికి వెళ్లేందుకు నానా అవస్తలు పడ్డారు. నీరు ఇంకి పోయేంతవరకు అధికారులు, సిబ్బంది చెట్ల కింద, ఇతర కార్యాలయలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంఆర్‌సి, భవిత కార్యాలయల ముందు కల్వర్టు, డ్రెయినేజీ కాల్వ లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడల్లా కార్యాలయ ఆవరణంలో నీరు చేరి నిల్వ ఉంటోంది. దీంతో సంబంధిత అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిత భవనంలోకి ప్రతి బుధవారం మానసిక వికలాంగులకు, వికలాంగలకు ఫిజియోథెరిపీ నిర్వహిస్తారు. భవిత భవనం ముందు మోకాళ్ల లోతు వర్షపు నీరు నిల్వ ఉండడంతో మానసిక వికలాంగులు, వికలాంగుల తల్లిదండ్రులు భవనంలోనికి రావడానిక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవనాల ముందు కల్వర్టు, డ్రెయినేజీలు ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.