Nov 16,2023 21:12

క్రికెట్‌ బెట్టింగ్‌

      అనంతపురం కలెక్టర్‌ : ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రికెట్‌ ఫీవర్‌ కన్పిస్తోంది. క్రికెట్‌లో అత్యుత్తమంగా చెప్పుకునే వరల్డ్‌ కప్‌ పోటీలు ముగింపు దశకు వచ్చేశాయి. అందులోనూ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం నాడు ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ క్రికెట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా, ఇందులో బెట్టింగ్‌ మహమ్మారి ప్రవేశించి యువతను పెడదోవ పట్టించేస్తోంది. అక్కడ వాళ్లు ఆట ఆడుతుంటే ఇక్కడ కారురాజాకారు అంటూ ఆ ఆటపై పందేలు కాస్తున్నారు. వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షలాది రూపాయలు బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత క్రికెట్‌ బెట్టింగ్‌ మాయలో పడి అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్‌లైన్‌లోనూ జూదాలు అందుబాటులో ఉండడంతో చాలా మంది దీనికి బానిసలై సరస్వాన్ని కోల్పోతున్నారు. పోలీసులు దీనిపై నిఘా ఉంచినా పూర్తి స్థాయిలో ఈ జూదాన్ని నియంత్రించలేని పరిస్థితి ఉంది.
      ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. ముఖ్యంగా క్రికెట్‌ ప్రేమికులు ఎక్కువ. క్రికెట్‌ మ్యాచ్‌ వస్తే టీవీలకు అతుక్కుపోయి ఆ ఆటను చూస్తూ ఆస్వాదిస్తారు. కుటుంబం అంతా కలిసి చూసే ఆట క్రికెట్‌. మారిన పరిస్థితుల దృష్ట్యా క్రికెట్‌ ఆటగా మర్చిపోయి జూదంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీల అవతారం ఎత్తి దీనిని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. ఒక్కసారి దీనికి అలవాటు పడిన వారు అందులో కూరుకుపోయి అప్పులపాలు అవుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ చదివే విద్యార్థులు, వ్యాపారులు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు తెలుస్తోంది.
బంతిబంతికీ బెట్టింగ్‌..
బెట్టింగ్‌లో అనేక రకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. గతంలో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపై మాత్రమే బెట్టింగ్‌ జరిగేది. ఐపిఎల్‌ వచ్చాక బెట్టింగ్‌లోనూ కొత్త పద్ధతులు వచ్చాయి. బంతిబంతికీ బెట్టింగ్‌ కాసే అవకాశాలను కల్పించారు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు.? ఎన్ని పరుగులు సాధిస్తారు..? స్కోర్‌ సరి సంఖ్య వద్ద నిలుస్తుందా..? బేసి సంఖ్య వద్ద నిలుస్తుందా..? ఎక్కువ పరుగులు ఎవరు చేస్తారు..? వికెట్లు ఎవరు ఎక్కువ తీస్తారు.? ఇలా ఒక్కటేమిటి బంతిబంతికీ బెట్టింగ్‌ కాస్తున్నారు. పదులు, వందలు కాదు... వేలు, లక్షల్లో పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనూ బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెల్‌ఫోన్ల ద్వారానే ఈ బెట్టింగ్‌లు ఆడేస్తున్నారు. ఇలా బెట్టింగ్‌కు బానిసైన వారు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు.
పోలీసుల కళ్లు గప్పి...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ బెట్టింగ్‌పై పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే ప్రతిసారీ పోలీసులు బెట్టింగ్‌లు ఆడేవారికి హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ సారి వరల్డ్‌ కప్‌ ప్రారంభం సమయంలో కూడా ఎస్పీ స్థాయి అధికారులు బెట్టింగ్‌పై గట్టి హెచ్చరికలు చేశారు. బెట్టింగ్‌ ఆడితే అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా వీరి హెచ్చరికలను బేఖాతర్‌ చేసి బెట్టింగ్‌లు ఆడతున్నారు. సాంకేతికతను ఉపయోగించి, పోలీసులకు అనుమానం రాకుండా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో చాలాసార్లు బెట్టింగ్‌ జూదరులను పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు. గతేడాది అయితే అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ బుకీని అనంతలో అరెస్టు చేశారు. ఇలా ఓ వైపు పోలీసుల అరెస్టులు జరుగుతున్నా బెట్టింగ్‌ మాత్రం అదుపులోకి రావడం లేదు. వైరస్‌లా విస్తరిస్తున్న ఈ క్రికెట్‌ బెట్టింగ్‌పై పోలీసులు పూర్తి స్థాయి నిఘా ఉంచి నియంత్రించకపోతే భవిష్యత్తులో దీని బారిన పడి అనేక మంది వారి జీవితాలను నాశనం చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
వడ్డీ వ్యాపారుల జోరు
క్రికెట్‌ బెట్టింగ్‌లో మరో కోణం వడ్డీ వ్యాపారం. క్రికెట్‌ జూదం ఆడేవారు ఇతరుల వద్ద అప్పులు చేస్తుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని వడ్డీ వ్యాపారులు వేలాది రూపాయలను అధిక వడ్డీలకు ఇస్తున్నారు. రోజు వడ్డీ పేరుతో డబ్బులు ఇస్తున్నారు. ఆరోజు మ్యాచ్‌లో గెలిస్తే డబ్బులను ఇచ్చేస్తున్నారు. ఒక వేళ మ్యాచ్‌ ఓడిపోతే తీసుకున్న డబ్బులకు పత్రాలు రాయించుకుంటున్నారు. ఇలా చాలా మంది వడ్డీ వ్యాపారుల ఉచ్చులో ఇరుక్కుపోతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు జూదం, మరో వైపు అధిక వడ్డీలతో జూదరులు సర్వసం కోల్పోతున్నారు. జూదం నిర్వహించే వారు కూడా బుకీ అవతారం ఎత్తి డబ్బులను తీసుకుంటున్నారు. బెట్టింగ్‌ ఆడేవారి నుంచి మ్యాచ్‌ కలిస్తే ఈ బుకీలు 30 నుంచి 40 శాతం మొత్తాన్ని కమిషన్‌ రూపంలో తీసుకుంటున్నారు. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు ఒక ఎత్తు అయితే ఆదివారం నాడు జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు పెద్ద మొత్తంలో మెట్టింగ్‌ రూపంలో చేతులు మారే అవకాశం కన్పిస్తోంది. పట్టణ కేంద్రాల్లో మకాం వేసి ఫైనల్‌ మ్యాచ్‌లో పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ నిర్వహించి డబ్బులు కొల్లగొట్టాలని బుకీలు పతకం రచించినట్లు సమాచారం. ఇలాంటి వాటిపై పోలీసులు నిఘా ఉంచి బుకీలను అదుపులోకి తీసుకుని క్రికెట్‌ బెట్టింగ్‌ను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.