తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రజాశక్తి-మారేడుమిల్లి
ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ టూరిస్టు బస్సు ఆగివున్న కారుపైకి దూసుకెళ్లి బోల్తా పడిన సంఘటన మండలంలోని జలతరంగిణి జలపాతం మలుపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షలు కథనం ప్రకారం... కాకినాడ జిల్లా పెద్దాపురం గ్రామం నుంచి 25 మంది పర్యాటకులు టూరిస్టు బస్సులో మారేడుమిల్లికి విహార యాత్రకు వచ్చారు. ఇందులో భాగంగా జలపాతాన్ని తిలకించడానికి వస్తుండగా జలతరంగిణి జలపాతం వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి, అదుపుతప్పి అక్కడే రోడ్డు పక్కన ఆగివున్న కారుపైకి బస్సు దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో ఈ ప్రమాదాన్ని గమనించిన అటువైపుగా వెళ్తున్న వాహనదారులు హూటహూటిన బస్సులో ఉన్న పర్యాటకులను బయటకు తీశారు. బస్సులో ఉన్న ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై స్థానిక ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










