Oct 31,2021 12:53

చల్లగాలి వీస్తూ.. చలికాలం మొదలయ్యే వేళ.. ఆకుపచ్చని వాతావరణంలో ఓ నులివెచ్చనిదనం దీపావళి. 'చీకటిని తిడుతూ కూర్చునే కన్నా.. ఓ చిరుదీపం అయినా వెలిగించాలి!' అని మన పెద్దలు చెప్పిన మంచిమాట. అలా దీపం ఒక్కటే బోలెడంత వెలుగు. అలాంటి దీపాలను వరుసగా వెలిగించి, తీరుగా అలంకరిస్తే.. మరింత వెలుగు. అలా ప్రతి ఇంట వెలిగిన దీపాలతో ఊరంతా వెలుగు. అలా దేశమంతా వెలిగిపోవాలి.. అందరూ ఆనందంగా ఉండాలి.. అదే కదా అసలైన పండుగ. అజ్ఞానాన్ని పారదోలే విజ్ఞానానికి ప్రతీక వెలుగు. స్త్రీశక్తి సామర్థ్యాలకు.. నారీ విజయానికీ ప్రతిరూపం దీపావళి. దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయం. భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతీయులంతా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ దీపావళి. ఈ దీపావళి నేడు దేశంలో కమ్ముకున్న కారుచీకట్లలో ఓ వెలుగు రేఖ కావాలి. నేడు దేశంలో రైతాంగం దాదాపు ఏడాదిగా మహోద్యమం చేస్తోంది.. మరోవైపు ప్రయివేటీకరణపై 'ఉక్కు' ఉద్యమం నడుస్తోంది.. నిరుద్యోగంపై యువత కదం తొక్కుతోంది.. ఈ అత్యాచార భారతం ఇంకెన్నాళ్లని స్త్రీలోకం నినదిస్తోంది.. ఇవన్నీ ఈ కారుచీకట్లని పారదోలే వెలుగు రేఖలే.. కొత్త వెలుగుకు హామీనిచ్చే పరిణామాలే !

 

కారు చీకట్లో వెలుగు రేఖ..



'దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్‌
రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్‌
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్‌
నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్‌!'
అంటూ...

     దీపావళి సందడిని నాలుగు పంక్తుల్లో చెప్పేశాడో కవి. భారతీయ సంస్కృతిలో పండుగలు ఒక భాగం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ.. మనమంతా ఒక్కటే అని చాటిచెప్పే భారతీయ సంస్కృతికి ప్రతీకలు మన పండుగలు. అలాంటి ముఖ్యమైన పండుగల్లో ఒకటి దీపావళి. దీపావళి అనగానే మనసులో మెదిలేది దీపాల వెలుగులు, టపాసుల చప్పుళ్లు, బొమ్మల కొలువులు, పిల్లల సందళ్లు.. ప్రతి ఇంటా వెలుగులు విరజిమ్ముతూ... దేశ ప్రజల్లో మత చిచ్చు పెట్టేవారికి గుణపాఠం చెబుతూ.. అన్ని మతాలు, అన్ని కులాలూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఏకైక పండుగ దీపావళి. అనాది కాలంగా పరమత సహనం.. శాంతియుత జీవనం కలిగి ఉండటం ఈ దేశ విశిష్ట సంస్కృతి. ప్రతి ఒక్కరూ ఆ సంస్కృతిని కాపాడుకోవాలి.. 'ఒక దివ్వె ప్రక్క వేరొక దివ్వె నిల్పినా ద్వేషభావము లేదు దివ్వియలకు' అని కవి రసరాజు చెప్పినట్లు- సమైక్య జీవన సౌందర్యాన్ని చాటిచెప్పే దీపాల వరుస పండుగ దీపావళి.
 

                                                        చీకటి వెలుగులు..

కారు చీకట్లో వెలుగు రేఖ..

'చీకటి వెలుగుల రంగేళీ/ జీవితమే ఒక దీపావళి/ మన జీవితమే ఒక దీపావళి/ అందాల ప్రమిదల/ ఆనంద జ్యోతుల/ ఆశలు వెలిగించు దీపాలవెల్లి' అంటాడు సినీకవి ఆత్రేయ. ప్రతి పండుగ మనలో ఆనందాన్ని నింపితే, ఈ దీపావళి మాత్రం ఆనందంతో పాటు ఆశల వెలుగునీ ఒంపుతుంది. 'జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది/ గువ్వల్లే బ్రతకాలని తారాజువ్వ చెబుతుంది/ నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చి పెడుతుందని/ తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది' అంటూ అమావాస్య నాడు వచ్చే వెన్నెలని, దీపావళి నాటి టపాకాయలను జీవితంతో పోల్చి చెబుతారు సహజకవి మల్లెమాల. బతుకంతా అమావాస్యగా సాగే సామాన్యుల జీవితాల్లో రేపయినా కూసింత వెలుతురు ఉదయిస్తుందనే ఆశను కల్పించేది దీపావళి. సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయ సూచకంగా టపాసులు మోగించే రోజు.
 

                                             మహోద్యమాలు.. వెలుగు రేఖలు..

కారు చీకట్లో వెలుగు రేఖ..

నేడు మార్కెట్‌ సంస్కృతిని పెంచిపోషిస్తూ.. ప్రకృతికి, పర్యావరణానికి, జీవావరణానికి, మనిషికి హాని కలిగిస్తోందీ వ్యవస్థ. ఓవైపు కరోనాతో దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. కుటుంబాలు ఛిద్రమైపోయాయి. నిరుద్యోగం, ఆకలి సూచీలలో దేశం వెనుకబడిపోతోంది. 'గొప్పింటిలోనున్న గుడిసెలోనున్నను, దీప్తి భేదమురాదు దివ్వియలకు' అని కవి మాటలు అక్షరసత్యాలు. మిరుమిట్లుగొలిపే అంబానీ, అదానీ సౌధకాంతులైనా.. పొయ్యిలో పిల్లిలేవని ఇళ్లల్లో మిణుకుమిణుకుమనే గుడ్డి దీపమైన వెలుగులే పంచేది. 'నరకుడనువాడు ఎక్కడో నక్కి లేడు.. మనసులో చిమ్మచీకటి మసలు చోట వానికున్నది- ఉనికి!' అని ఓ కవి చెప్పినట్లుగా ఈ అభినవ నరకాసురులు.. గోముఖ వ్యాఘ్రాలుగా మన మధ్యనే తిరుగుతూ... నిర్లజ్జగా వారి అజెండాను అమలుచేస్తున్నారు. నరకాసురుడు, బకాసురుడు, భస్మాసురుడు వంటి రాక్షసుల గురించి, వారి పీడన గురించి కథల్లో విన్నాం. ఇప్పుడు మానవరూపంలో వున్న నరకాసురులను, బకాసురులను చూస్తున్నాం. రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, సముద్ర తీరాలు.. ఇలా అన్నింటినీ మింగేస్తున్నారు. వీరిని మించిన బకాసురులు బడాకార్పొరేట్లు. కాదేదీ వీరి కనర్హం. దేశంలోని మనుషుల నుంచి ప్రకృతి వనరుల వరకూ అన్నింటినీ ఆరగించేస్తున్నారు. మరోవైపు దాదాపు ఏడాదిగా రైతు మహోద్యమం.. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు నిరసనగా ఉక్కు ఉద్యమం.. ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల కదనం.. నిరంతరం అత్యాచారాల భారతం నుండి స్త్రీ విముక్తిని కోరుతున్న మహిళల రణనినాదం.. వీరి గళాలు వినిపిస్తున్నా... పట్టించుకోని పాలకులు... కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ప్రజా జీవితాలను కారుచీకట్లలోకి నెట్టేస్తున్నారు.. ఈ మహోద్యమాలన్నీ కారుచీకట్లను పారదోలి.. వెలుగులు నింపే వెలుగు రేఖలే.

కారు చీకట్లో వెలుగు రేఖ..


 

                                                   ఐక్యతే అసలైన పండుగ..

పండుగలు, ఉత్సవాలు - అన్నీ మతపరమైనవి కావు. కొన్ని పండుగలు పూర్తిగా మానవుని ఉత్పత్తికి సంబంధించినవైతే, మరికొన్ని ప్రకృతిపై మానవుడు సాధించిన విజయాలను పురస్కరించుకుని జరుపుకునేవి. ఇంకొన్ని పండుగలు మాత్రం మత నమ్మకాలు, కథలపై ఆధారపడి ఉంటాయి. అయినా అవీ మన సంస్కృతి, సంప్రదాయాలకు సూచికలుగా నిలవాలే తప్ప.. మతోన్మాదుల చేతికి ఆయుధాలుగా మారకూడదు. మట్టి ప్రమిదల్లో తైలాన్ని నింపి, వెలిగించినంత మాత్రాన దీపావళి రాదు. దేశంలోని వనరులను హరించి వేస్తూ... దేశ సమైక్యత, సమగ్రతల పట్ల చిచ్చుపెడుతున్న అపర నరకాసురుల సంహారం జరగాలి. సమానత్వం.. సౌభ్రాతృత్వం వెల్లివిరిసే రోజు రావాలి. పేదవాడి ముంగిట్లో చీకటి తెరలు తొలగి, వెలుగుల మతాబులు విరజిమ్మాలి. అందరం బాగుండాలి.. అందులో మనమంతా ఉండాలి.. అది జరగాలంటే అందరం ఒక్కటవ్వాలి.. చెడుపై విజయం సాధించాలి. అలాంటి ఐక్యమత్యం మనందరి మధ్య కలగాలి. మన మంచి కోరేవారే మనవారు... మనకు చెడు తలపెట్టేవారు మనకు శత్రువులే. ఐక్యంతో శత్రువును ఓడించడమే దీపావళి.
 

                                                      కాలుష్యం.. కరోనా

కారు చీకట్లో వెలుగు రేఖ..

వాయు కాలుష్యం ఉసురు తీస్తోంది. ప్రస్తుత కరోనా కాలంలో మరింత అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మనదేశంలో 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన పడుతున్నట్లు అమెరికా పరిశోధనా బృందం చెప్తోంది. మధ్య, తూర్పు, ఉత్తర భారతంలో నివసిస్తున్న 48 కోట్ల మందికి ఈ ముప్పు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆ బృందం తెలిపింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గతేడాది ప్రభుత్వం టపాసులు కాల్చడంపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాల్లో టపాసులు కాల్చడంపై జరిమానాలూ విధించింది. అలాగే అనేక రాష్ట్రాలూ చర్యలు తీసుకున్నాయి. అయితే ప్రభుత్వాల కన్నా ముందుగా ప్రజలే స్వచ్ఛందంగా. .కాలుష్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రభావానికి గురై, రోగాల పాలుకాకుండా చూసుకోవాలి. ముందస్తు చర్యగానే ప్రకృతితో మమేకమవుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అందుకే అందరం కాలుష్య రహిత దీపావళికి మన వంతు నిలుద్దాం. సాధ్యమైనంత వరకూ కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణానికి అనుకూల దీపావళిని జరుపుకుందాం. కాలుష్యాన్ని పెంచే టపాసులు కాల్చకుండా ఉందాం.

పండుగ అనేది ఆనందానికి ప్రతీక. అందరం ఆనందంగా ఉండే రోజులు రావాలి. అందుకోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. మన ఆనందాన్ని దూరం చేసే వ్యక్తులైనా.. శక్తులైనా.. వ్యవస్థలైనా ఎదుర్కోవాల్సిందే.. చలి చీమల చేతచిక్కి పాము అయినా చావక తప్పదన్న వేమన సూక్తిని అందిపుచ్చుకుందాం. అతివ.. అబల.. అంటూ స్త్రీలను తక్కువ చేసే సంస్కృతికి సత్యభామ ధీరతను చాటుతూ అబల కాదు సబల అని చాటుదాం. చెడుపై యుద్ధం చేయడమే అసలైన దీపావళి. చెడు ఎప్పటికైనా నాశనం కావలిసిందే.. మంచి ఎప్పుడూ చిగురులు వేయాల్సిందే.. చీకటి ఎప్పుడైనా చెదిరిపోవాల్సిందే.. వెలుగు రేఖలు దూసుకురావాల్సిందే.. అప్పుడే చీకటిలో వెలుగులు దీపావళి.. కారుచీకట్లను పారదోలే మహోద్యమ కాంతి రేఖలు తప్పక వస్తాయి.. వెలుగులు పంచుతాయి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

                                                         జాగ్రత్తలు తీసుకోండి..

కారు చీకట్లో వెలుగు రేఖ..

దీపావళి వెలుగులు ఏడాదంతా మన జీవితాల్లో కొనసాగాలని అందరం కోరుకుంటాం. పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే కొత్త బట్టలు, వస్తువులు కొంటాం. ఇల్లంతా సరికొత్తగా డెకరేట్‌ చేస్తాం. ఇక సాయంత్రం వేళ బాణసంచా వెలుగులుంటాయి. టపాసులు మనం చెప్పినట్లు వినవు కాబట్టి... తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పండుగను చక్కగా జరుపుకోగలం. ఒక్కోసారి మనకు తెలియకుండా... ఆకతాయిలు మన వెనుక బాంబులు పెడుతుంటారు. అలాంటి సందర్భంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. అందువల్ల దీపావళి నాడు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఓసారి తెలుసుకుందాం.
ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది లేకుండా... ఓ బకెట్‌ నీరు దగ్గరలో ఉంచుకోవాలి.
వీలైతే... ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ కూడా దగ్గర పెట్టుకోవాలి.
పెద్ద బాంబుల్ని సందుల్లో ఇళ్ల ముందు కాల్చొద్దు. చుట్టూ జనం లేని విశాల ప్రదేశంలోనే వాటిని కాల్చడం మేలు.
శ్వాస సమస్యలు ఉన్న వారు ఇంటి చుట్టుపక్కల ఉంటే.. వీలైనంత తక్కువగా టపాసులు కాల్చడం మేలు. ఎందుకంటే.. కొద్దగా పొగ వచ్చినా... శ్వాస సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి.
మూగజీవాలు, ఇతర జంతువులు ఉన్న చోట టపాసులు జాగ్రత్తగా కాల్చాలి. లేదంటే అవి బెదిరిపోయే ప్రమాదం ఉంది.
కాల్చేసిన టపాసులను ఒక బక్కెట్‌లో ఇసుక వేసి, అందులో వేయడం మేలు. లేదంటే కాళ్లు కాలే ప్రమాదం ఉంది. పైగా మూగ జీవాలు వాటి కారణంగా గాయాలపాలయ్యే అవకాశం ఉంది.

                                                            ఇవి పాటించండి ..

కారు చీకట్లో వెలుగు రేఖ..

శానిటైజర్‌ను చేతులకు రాసుకుని, టపాసులు కాల్చకూడదు.
టపాసులు కాల్చిన తర్వాత సబ్బుతోనే చేతులు కడుక్కోవాలి.
టపాసులు పేల్చే పిల్లల దగ్గర తల్లిదండ్రులు తప్పకుండా ఉండాలి.
టపాసులు కాల్చేవాళ్లు తప్పకుండా కాటన్‌ దుస్తులనే ధరించాలి.
దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టేటప్పుడు కర్టన్‌లకు దూరంగా పెట్టాలి. దుస్తులు కూడా దీపాలకు అంటుకోకుండా జాగ్రత్తపడాలి.
కాకరపువ్వొత్తులు కాల్చాక వాటిని నీటి బక్కెట్టులోగానీ, ఇసుక వేసిన డబ్బాలోగానీ వేయాలి.
మరీ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాంబుల జోలికి పోకపోతేనే మంచిది.

                                      గాయాలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కాలిన గాయం అయిన చోట పసుపు, నూనె కలిపి పేస్ట్‌లా చేసి, రాయాలి. టూత్‌పేస్ట్‌, తేనె వంటివి రాస్తే మంచిది. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. ఇవి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గాయమైనా, వెంటనే పసుపు ఉపయోగించాలి.
మరీ పెద్ద గాయం అయితే డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం మంచిది.

                                                      అలంకరణలు.. ఆనందాలు..

కారు చీకట్లో వెలుగు రేఖ..

పెద్దలు, పిల్లలు ఇష్టంగా చేసుకొనే పండుగల్లో ప్రధానమైనది దీపావళి. ఇంటిని శుభ్రం చేసుకోవడం.. అందంగా అలంకరించడం కోసం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు.
దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ప్రమిదలు. అయితే కాలక్రమంలో వీటిల్లో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు మట్టి ప్రమిదల స్థానంలో రకరకాల ఆకృతుల్లో ప్లాస్టిక్‌ ప్రమిదలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అవి కాకుండా పర్యావరణ హితులు మట్టివే అనేక కళాత్మక రూపాల్లో తయారుచేస్తున్నారు.
అలంకరణల్లో తోరణాలకూ ప్రత్యేక స్థానం ఉంది. రంగురంగుల పూలను, మట్టితోనే తయారుచేసిన వేలాడే దీపాలు, ఏనుగు బొమ్మలను, గంటలను జతచేసి వరుసలు అమ్ముతారు. వాటిని గుమ్మాలకు ఇరువైపులా అలంకరించుకుంటే అందమే..
రంగు, రంగుల విద్యుత్‌ బల్బుల తీగలను ఇంటికి అమరుస్తారు. ప్రస్తుత విద్యుత్‌ అధిక ధరల నేపథ్యంలో మట్టిదీపాలే ముద్దు. విద్యుత్‌ దీపాలు అట్టహాసంగా అనిపించినా.. వెలుగులు పంచే మట్టిదీపాలే శోభను పెంచుతాయి.

                                               విభిన్నంగా.. వివిధ రాష్ట్రాలలో..

కారు చీకట్లో వెలుగు రేఖ..

కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు కలిగిన దేశం మనది. ఎవరు ఏ పండుగ జరుపుకున్నా.. దాదాపుగా అందరూ ఆయా పండుగలను వారి వారి అభిరుచులకు అనుగుణంగా జరుపుకుంటారు. కుల మతాలకు అతీతంగా.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. దీన్ని దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో మూడు నుండి ఐదు రోజుల వరకూ జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా, ప్రతి వారూ తమతమ స్నేహితులను, బంధువులను కలుసుకొని, స్వీట్లు పంచుకొని సంతోషిస్తారు.

కర్నాటక: కర్నాటకలోని కన్నడిగులకు ఈ పండుగలోని మొదటిరోజు, మూడవ రోజు ప్రత్యేకత కలిగినవి. ఆశ్వీయుజ కృష్ణ చతుర్దశి అంటే దీపావళి మొదటిరోజును వీరు 'నరక చతుర్దశి' అనే పేరుతో ఆచరిస్తారు. మహిళలు ఇంటిముందు చక్కగా రంగోలి అలంకరిస్తారు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు.

మహారాష్ట్ర: మహారాష్ట్రలో ప్రజలు ఈ పండుగను ఐదు రోజులు జరుపుతారు. వీరు ఒక ఆవుకు దాని దూడకు హారతి ఇవ్వటంతో పండుగ మొదలుపెడతారు. తమకు నచ్చిన అనేక రకాల తీపి, ఇతర వంటకాలు చేసుకుంటారు. ఇరుగు పొరుగులకు పంచి పెడతారు. రాత్రి అయ్యిందంటే చాలు, అమావాస్య చీకటిలో బాణాసంచా కాల్చుతూ వెన్నెల వెలుగులు పూయిస్తారు.

ఒడిశా: ఒడిశాలో ఈ పండుగను పెద్దల పండుగగా ఆచరిస్తారు. తమ పూర్వీకులు ఈ అమావాస్య రోజున ఆకాశంలో వచ్చి విహరిస్తున్నారని భావిస్తారు. వారికి మోక్షం కలిగేందుకు వెలుగులు చూపాలని బాణసంచా కాలుస్తారు. వీరికి పండుగలో ఇదే ప్రధానంగా ఉంటుంది.

పశ్చిమ బంగా, అస్సోం : ఈ ప్రాంతాల్లో పండుగ రోజున కాళీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రాత్రి వేళ బాణ సంచా కాలుస్తారు. బీహార్‌లోని మిధిలా ప్రాంతం, అస్సోంలోను కాళీదేవి పూజతో పాటు గణేశ విగ్రహాలకూ పూజలు చేస్తారు. తమ కుటుంబాలను క్షేమంగా ఉంచమని, సకల సంపదలూ కావాలని కోరుకుంటారు. బంధుమిత్రులతో కలసి ఇష్టమైన వంటకాలు తింటూ ఆనందిస్తారు.

గుజరాత్‌: దేశంలో దీపావళి వేడుకలలో బాణసంచా కాల్చడమనేది గుజరాత్‌లోనే మొదలైంది. తర్వాతి కాలంలో ఇతర రాష్ట్రాలకూ పాకింది. గుజరాత్‌లో నరక చతుర్దశి రోజును 'ధన్‌ తెరాస్‌' అంటారు. ఉత్తర భారతదేశంలో దీనిని 'చిన్న దీపావళి' అని కూడా అంటారు. ఈ రోజున వీరు లక్ష్మీ పూజ చేసి, తమ కొత్త గుజరాతి సంవత్సరాన్ని ఆరంభిస్తారు. ధన్‌ తెరాస్‌ రోజున బంగారం కొనుగోలు చేస్తారు. అన్ని కొత్త పనులకూ ఈ దీపావళి అమావాస్యను మంచిదని భావిస్తారు. మూడవ రోజును 'భారు బీజ' అంటారు. సోదరీమణులు తమ సోదురుల క్షేమాన్ని కోరుతూ వారికి పూజలు చేస్తారు. గుజరాత్‌లో ఈ పండుగ ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు.

కె.ఎక్స్‌.రాజు
94900 99231