
'నా కడసారి కోరిక తీర్చరూ!' గోముగా అడిగింది గోమతి.
'నీ భాష తగలెయ్య! కడసారి కోరికేంటే? నువ్వేమైనా మంచం పట్టి, బాల్చీ తన్నేయడానికి సిద్ధంగా ఉన్నావా?' అన్నాడు గోపాలం.
'ఈ ఏడాదికి ఈ రోజు ఆఖరు కదాండీ! అందుకే అలా అన్నాను.. ఏం తప్పా?' అంది దబాయింపుగా.
'ఈ సంవత్సరపు ఆఖరి కోరిక అనాలి. అయినా మూడొందల అరవై ఐదు రోజులూ ఏదో కోరిక కోరుతూనే ఉన్నావు కదటే.. ఇదే ఆఖరంటూ!' అన్నాడు పేపర్లో తలదూర్చి.
గోమతికి మొగుడి వాలకం చూసి చిర్రెత్తుకొచ్చింది. అక్కడే ఉన్న అత్తగారిచ్చిన గుండుగిన్నెని చేతిలోకి తీసుకుంది.. ఒక క్షణం ఆలోచించి, ఠపీమని నేలకేసి కొట్టింది.
ఆ శబ్దానికి గుండెలదిరిపోయిన గోపాలం బెదిరిపోయి, 'ఏమొచ్చిందే నీకు ఇవ్వాళ?' అన్నాడు భయం భయంగా.
'నేను సీరియస్‌గా ఒక విషయం గురించి మాట్లాడదామనుకుంటే, ఏమీ పట్టనట్టు మీరు పేపరు చదువుకుంటోనో, మొబైల్ చూస్తోనో ఉంటే ఎలా ఉంటుంది? ఒళ్లు ్లమండదా?' అంది గుడ్లురుముతూ.
ఆమె వాలకం చూసి జడుసుకున్న గోపాలం రాబోయే ప్రమాదాన్ని శంకించి...
'చెప్పు గోము డియర్!' అన్నాడు చుబుకం పట్టుకుని, బతిమలాడుతూ.
కాస్త చల్లబడ్డ గోమతి 'ఈ పండక్కి మనం కారు కొనుక్కుందామా?' అంది గోమతి గోముగా.!
'కారా?' అన్నాడు నోరు వెళ్లబెట్టి.
'కారా? అని కారం తిన్నట్టు ముఖం పెట్టారే? నేనేదో అనకూడని పదం అన్నట్లు' అని గోమతి కారాలు, మిరియాల డబ్బాలు తీసి, నూరడానికి సిద్ధపడింది.
'మరీ అంత సహజంగా కారాలు, మిరియాలు నూరక్కర్లేదనుకుంటాను గోమూ!' అన్నాడు గోపాలం ప్రక్కన కూర్చుంటూ.
'అయినా మా నాన్నిచ్చిన కారు వాకిట్లో ఉందిగా! అది చాలదూ?' అన్నాడు.
'ఆ డొక్కు కారా! మీరు ఏనాడైనా దాని ముఖం మీద చెంబుడు నీళ్లు పోసి తుడిచారా? గిద్దెడు చమురు చుక్కలైనా పోశారా? అదెక్కించి నన్ను పైలోకం పంపించాలన్న కోరిక మీకు బాగా ఉన్నట్టుందే?' అంది.. మొగుడుకేసి అనుమానంగా చూస్తూ.
'అబ్బే అది-వింటేజ్-కారు. గొప్ప డిమాండ్ ఆ రోజుల్లో తెలుసా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదాని?!' సర్ది చెప్పబోయాడు.
'ఇప్పుడు కొత్త రూలొచ్చింది బాబు! ఏళ్ల తరబడి డొక్కుకారులు వేసుకుని రోడ్డెక్కకూడదని ప్రభుత్వం 'చెత్త' రూలు పాస్ చేశారట'.. తెలివిగా మాట్లాడింది.
'చెత్త రూలా?'
'అదేనండి! డొక్కు కార్లని చెత్తలా తీసి పారయ్యాలనే కొత్త రూలు'
'ఓV్‌ా! స్క్రాప్ పాలసీనా? నువ్వెక్కడ చదివావే? ఎంత తెలివైన దానివే.. ఎంత మేధావివే గోమూ!' సాధ్యమైనంత ఆశ్చర్యం అభినయించాడు.
'అటువంటి గొప్పవార్తలు తమరెప్పుడు చదువుతారు? ఎప్పుడూ సినిమా హీరోయన్స్ గాసిప్స్ చదవడం తప్ప. నేను రోజూ కొత్తకార్ల మోడల్స్ కోసం పేపరు చూస్తానుగా!' అంది గర్వంగా .
'నీ బుర్ర అమోఘం గోము!' అని ధైర్యం చేసి, బుగ్గలు నిమిరాడు.
ఉబ్బితబ్బిబ్బైన గోమతి ముఖం బెంజికారు హెడ్‌లైట్‌లా వెలిగిపోయింది.
'నన్ను ఏమార్చి, మాటమార్చి నా కోరికను హతమార్చి అనందిద్దామని అనుకుంటున్నారేమో.. అదేం కుదరదు! కొత్త కారు కొనాల్సిందే! మా వేదవతక్క కొత్త కార్లో-ఝాం ఝాం- మని తిరుగుతూ ఫోన్‌లో రోజుకో స్టేటస్ పెడుతోంది తెలుసా? నాకు అవమానమైపోతోంది.' అంది ఉక్రోషంగా.
'మీ బావ లక్ష్మీపతి బాగా స్టాటస్ ఉన్నవాడు. మంచి కారే కొనుక్కోవచ్చుగా.. మీ అక్క అలా 'జూమ్ జూమ్' అని అరిస్తే గానీ జనం తప్పుకోరా? మీ అక్క అరిస్తే నువ్వెందుకు అవమానపడటం?' అన్నాడు అమాయకంగా మొహం పెట్టి.
గోమతి తల బాదుకుంది. 'మీకు అలా అర్థమయ్యిందా మహానుభావా?' అంది.
'మనకేముంది ఈ ఇల్లు తప్ప! కొంతకాలం ఓపికపట్టు. జీతాలు పెరగ్గానే అరియర్స్ వస్తాయి. అప్పుడు మన పాత కారు కూడా అమ్మేసి, మంచి సెకండు హ్యాండ్ కారు కొందాం' అన్నాడు బుజ్జగింపుగా.
'ఛీ! ఛీ! నాకు సెకండ్ హ్యాండ్ అన్న పదం అంటేనే పరమ అసహ్యం. చిన్నప్పడు అమ్మానాన్న! ''ఒసేరు గోమతి! అక్క వాడేసిన గౌను, పుస్తకాలు, పెన్నులు వాడుకో!'' అంటేనే చాలా కోపం వచ్చేది. అలాగే సెకండ్ హ్యాండ్ మొగుణ్ణి ఎక్కడ కట్టబెడతారో అని ముందే మా వాళ్లకు వార్నింగ్ ఇచ్చేను తెలుసా?' అంటూ కళ్లెగరేసింది.
'నీకు చాలా ఉందే.. గోమతి!' అనుకున్నాడు స్వగతంగా.
'ఓకే! ఓకే! కొత్తకారే కొందాం.. జీతాలు పెరగనీ!' పాత పాటే పాడాడు.
'ఐదేళ్లబట్టి చూస్తున్నా ఆ జీతాలు కూడా మీ నెత్తి మీద వెంట్రుకల్లాగా ఎదుగుబొదుగూ లేక అలాగే ఉన్నాయి. ఎన్ని నూనెలు మర్దనా చేసినా, ఎంత ఆముదం పామినా అవి పెరగవని నాకు తెలుసు. మన పెళ్లిచూపుల్లో -మా గోపి గాడిది ఉంగరాల జుట్టమ్మ! ఆ దుబ్బలో దువ్వెన చిక్కుకుపోయి ఎక్కడుందా? అని వెతుక్కునేవాళ్లం. ఆ మధ్య వెంకటేశుడి మొక్కు తీర్చుకోవడం వల్ల ఆ జుట్టు పొలంలో నాట్లు వేసినట్టు మొలకలు మొలకలుగా ఉందిగాని. పెళ్లి టైముకి పెరగడం ఎంతసేపు! అని మీ బామ్మ వాళ్లు అంటే నమ్మేశాను'.. భార్య దృష్టి తన బుర్ర మీదకు వెళ్లడం గమనించిన గోపాలం గబుక్కున టాపిక్ మార్చి..
'అబ్బ! కొత్త కారే కొంటాలేవే!' అని గోమతిని బుజ్జగించి, లాలించి ఆ రోజుకి వంట చేయడం నుంచి తప్పించుకున్నాడు. లేకపోతే వారానికి నాలుగైదు రోజులు గోమతి అలిగి వంట మానేసి, అతనితోనే చేయిస్తుంది.
'మీ పాత డొక్కు కారు ఇంట్లో పడున్నా.. మీ వాళ్ల గారం వల్ల డ్రైవింగ్ నేర్చుకోలేదు మరి!'... గోపాలం పెద్ద ఘోరం చేసినట్టు మాట్లాడింది.
'రేపట్నుంచి డ్రైవింగ్ స్కూల్లో జాయినవ్వండి. తెల్లారుఝామున లేపుతాను. మీకు పూర్తిగా నడపడం వచ్చేశాకా మీ దగ్గర నేర్చుకుంటా. ఖర్చు కలిసొస్తుంది...' అంది.
'ఎంత తెలివైనదానవే గోము! ఈ మధ్య నీ బుర్ర ఆర్థికమంత్రి బుర్రలా భలే షార్ప్‌గా పనిచేస్తోందే!' కితాబిచ్చాడు. అతని పొగడ్తకి సంబరపడిపోయింది గోమతి.
***
'లే ! లే!.. లే లే నా రాజా!' అంటూ విచిత్రమైన హస్కీ గొంతుతో మోగిన అలారం మోతకి విసుగ్గా లేచి, దాని పీక నొక్కబోయాడు గోపాలం. అతని చేతిమీద గట్టిగా గిల్లింది గోమతి. కెవ్వున కేకేసి లేచిన గోపాలం..
'అబ్బ! ఇంత పొద్దున్నే డ్రైవింగ్ క్లాసా! రేపట్నుంచి వెడతాను గోమూ!' అన్నాడు.
'అదేం కుదరదు! ఈరోజు మంచిరోజు... లేవండి' అంటూ దుప్పటి లాగేసింది. ఉసూరుమంటూ లేచి ఇంటి బయటకొచ్చాడు. మాంఛి పెర్‌ఫ్యూమ్ కొట్టుకుని, బ్లేసర్ వేసుకుని స్టైలుగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఒకతను.
'సార్! డ్రైవర్ ఏడండి?' అని అడిగా. అతను సీరియస్‌గా మొహం పెట్టి .. 'నేనే!' అన్నాడు.
'నువ్వు డ్రైవర్ వా?' నోరావలించాడు గోపాలం.
'ఏం? డౌటా! డ్రైవర్ అంటే చీపుగా కాకీ బట్టలే ఏసుకుంటారేటి? నా డ్రైవింగ్ స్కూల్లో ఇరవై కార్లు తిరుగుతూ ఉంటాయి. ఏదో మీ మేడమ్ గారు నన్ను రమ్మనమని బ్రతిమాలారు కాబట్టి వచ్చాను'... ఫోజుగా డ్రైవింగ్ పక్క సీట్లో కూర్చుని, డోర్ వేశాడు.
'నీ.. మీ.. పేరేంటండి?' అడిగాడు గోపాలం.
'రాము!' గొంతు మొరటుగా గరగరలాడింది. గోపాలం డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే స్టీరింగ్ చేతికిచ్చాడు డ్రైవర్ రాముడు. చక్రం ఒకటి అటూ ఇటూ తిప్పడం తప్ప గేర్లు, బ్రేకులు అతనే వాడుతూ డ్రైవింగ్ కాసేపు నేర్పించాడు.
ఈలోగా...'మావిళ్ల తోపుకాడ పండిస్తే, మా మల్లె తోటకాడ మల్లిస్తే..!' అని గట్టిగా డ్రైవరు రాముడి రింగ్‌టోన్ వినిపించగానే... ఫోను ఎత్తి, 'ఏంట్రా సిమ్మాచలం? ఈ టైములో ఫోను చేసేవేటి ఏంటి.. 6464 కారు బురదలో దింపేశాడా కస్టమర్! నువ్వేంజేత్తన్నావ్ తత్తుకొడక! డాల్పిన్‌కి పళ్ళు తోవుతున్నావా? ఆడి దగ్గర పదేలు వసూల్ జేయి' అంటూ కోపంలో బ్రేకులొదిలేశాడు. వైజాగ్ అప్ ఎక్కించిన కారు బర్రున వెనక్కి వచ్చి, పక్కనున్న గోడకి గుద్దబోయింది.
డ్రైవర్ రాముడు కంగారుగా మొహం పెట్టి, 'ఆ గోడకి తగిలీసినాదనుకో శానా ఖర్సు అయ్యిండేది. బండికేదైనా ఐతే మీ దగ్గరే వసూలు చేస్తా!' వార్నింగిచ్చాడు, గోపాలం తప్పు లేకపోయినా.
గోపాలం వెర్రిమొహం వేసుకుని, తలకాయ అటు ఇటూ ఊపేడు.
***
ఇంటికొచ్చిన గోపాలానికి గోమతి ఎదురుపడి.. 'ఏవండీ ఎలా ఉంది మొదటిరోజు డ్రైవింగ్.? మన రామకృష్ణ బీచ్ రోడ్డెక్కారా? ఎంత స్పీడులో వెళ్లారు? ఎయిటీలోనా ! నైంటీలోనా' ప్రశ్నల వర్షం కురిపించింది.
'అబ్బే.. అప్పుడే! ఇంకా మొదటిరోజే కదే.!.. రేపట్నించి... చూడు! ఎంత అవలీలగా నడిపేస్తానో'... తేలిగ్గా అనేశాడు.
మొగుడి కాన్ఫిడెన్స్ చూసి ఉబ్బితబ్బిబ్బైపోయి.. అల్లం, జీలకర్ర దట్టించిన నేతి పెసరట్టు, జీడిపప్పు ఉప్మా తెచ్చి గోపాలం ముందుపెట్టింది. పెసరట్టు ఘుమ ఘుమలు ఆఘ్రాణిస్తూ 'ఆహా! యుద్ధానికి వెళ్లొచ్చి, ఇంటికి వస్తే ఇంట్లోవాళ్లు ఎంత ప్రేమిస్తారో అలా గోమతి, నా మీద ప్రేమంతా పెసరట్టులో దట్టించినట్టుంది. గొప్ప రుచిగా ఉంది' అనుకున్నాడు. నాలుగు పెసరట్లు లాగించి, కాఫీ తాగి.. బ్రేవ్..అని త్రేన్చాడు.
'చక్రధారి'కి చాలా కోపం ఎక్కువ అని రెండోరోజు డ్రైవింగ్‌లో తెలుసుకున్నాడు గోపాలం. అతగాడి నోటి నుండి వచ్చే పచ్చి భాష వినలేక చెవులు మూసుకున్నాడు. రోడ్డు మీద అడ్డంగా పంది రాగానే గట్టిగా అరుస్తూ బూతులు తిట్టాడు డ్రైవర్ రాముడు. అదేం పట్టించుకోకుండా దాని మానాన అది పోయింది. అసలే కారెక్కడ గుద్దించేస్తానేమోనని కంగారు, భయంతో ఉన్న గోపాలం ఆ అరుపులకి స్టీరింగ్ వదిలేశాడు. డ్రైవర్ రాముడు పట్టుకునేలోగా కారెళ్లి డివైడర్‌ని గుద్దేసింది.
డ్రైవర్ రాముడు కోపంగా 'ఎంతోమంది ఎదవలకి డ్రైవింగ్ నేర్పేనుగాని. నీ...మీ.., లాంటి వాడికి నేర్పడం నాకు సాతకాడం లేదు' అంటూ గట్టిగా అరిచాడు.
'రక్షించాడు...ఎదవ ! అనీయలేదు'.. మనసులో అనుకున్నాడు గోపాలం.
కారు కిందకి దిగి, దెబ్బతిన్న కారుని చూశాడు డ్రైవరు రాముడు.
'రిపేర్లకి అయ్యే ఖర్సు ఓ పదివేలుంటది. ఇంటికెల్లగానే ఇచ్చీయ్యాలి!' అని చిన్న కాగితం ముక్క మీద పది వేలు అంకేసి చేతులో పెట్టాడు.
డ్రైవర్ రాముడి నోరిప్పితే గోపాలానికి కాళ్లల్లోంచి వణుకొచ్చేస్తోంది. దాంతో సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. అలా పదిహేను రోజులు డ్రైవింగ్ నేర్పితే గోపాలానికి స్టీరింగ్ తిప్పడం వచ్చింది తప్ప, గేర్లు మార్చడం రాలేదు.
ఒక పక్క గోమతి 'డ్రైవింగ్ వచ్చిందా! వచ్చిందా!' అంటూ బుర్ర తినేసేది. గుద్దేసిన కారు రిపేర్లతో పాటు ఇరవై వేలు ఖర్చు అయ్యిందిగానీ, కారు నడపడం కన్న, డ్రైవర్ రాముడు వాడిన 'కారుకూతలు' మాత్రం కంఠతా వచ్చేశాయి. ఒకరోజు ఇంట్లో గోమతి దగ్గర కూడా పొరబాటున నోరుజారి 'నీ' అనబోయి దొరికిపోయాడు.
'ఏంటండి! ఆ చౌకుబారు తిట్లు! బాబిగాడు వింటే వాడు కూడా నేర్చుకుంటాడు' అని కసిరింది.
'ఆ డ్రైవర్ గాడు డ్రైవింగ్ నేర్పలేదు. ఇవే నేర్పాడు' అన్నాడు భీతిగా పెళ్లాం కోపం చూసి.
'ఉద్ధరించారు గానీ, ఇంకో డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి' అని అల్టిమేటం జారీచేసింది.
'ఛాల్లే! వాడింకో చెత్త భాష నేర్పుతాడు. ఎక్కడైనా కారు గుద్దెస్తే, వాడేసే పెనాల్టీలతో కారు టాక్స్ కట్టుకోవచ్చు.'
'మరి! డ్రైవింగో?'...సందేహం వ్యక్తం చేసింది గోమతి.
'మన పాత కారు తీసి, నేర్పుతానని ఆఫీసులో కిరణ్ గాడు చెప్పాడు. వాడికి మెకానిజం కూడా వచ్చు. మన కారు చెక్‌చేసి షెడ్డులోంచి తీస్తానన్నాడు. అదైతే ఎక్కడ దెబ్బతిన్నా ఫర్వాలేదు కదా!.
'మంచి ఐడియా! చాన్నాళ్లకు మీ బుర్ర పనిచేస్తోంది' అంది గోమతి అతని మోకాళ్ల కేసి చూస్తూ కొంటెగా..
ఆమె చమత్కారం తెలియని గోపాలం, నెత్తిమీద ఉన్న నాలుగు వెంట్రుకలూ దువ్వెనతో పైకి దువ్వి, ఫోజుకొట్టాడు. పెళ్లాం పొగడ్తకి.
***
'ఈ కారు కాశ్మీరు యాపిల్ కలర్‌తో ఎంత బావుందో కదండి బుజ్జిముండ'.. కారు దగ్గర నిలబడి తెగ ఫోజులు కొడుతోంది గోమతి.
'అమ్మో! అంటూ గుండెలు బాదుకుని.. దాన్ని సెడాన్ అంటారు. అదెంతనుకున్నావు? చాలా ఖరీదు!', ఆమెను దారి మళ్లించి, వేరే చిన్న కారు దగ్గరకు తీసుకెళ్లాడు.
'పోనీ కనీసం అదేదో వెజిటబుల్ పేరులా ఉంటుంది అది.. అది.. ఆ.. గుర్తొచ్చింది.. 'అర్టికాయ'!' జడ ఎగరేసింది.
'అరిటికాయ కాదు, సొరకాయ కాదు. ఎరిటిగా! అది పెద్ద ఫామిలీ ఎక్కే కారు. మనకెందుకు? మన పార్కింగ్‌లో పట్టదు కూడానూ. దాన్ని పెట్టుకోవడానికి మీ నాన్న నాకో పావెకరం రాసివ్వాలి' సర్ది చెప్పాడు.
'ఐతే! వద్దులెండి' అనేసింది.. ఎక్కడ తన పుట్టింటివాళ్లను గోపాలం భూమి అడుగుతాడోనని.
'మేడమ్! కాఫీ! టీ! కూల్‌డ్రింక్! ఏం తాగుతారండి?' అన్నాడు షోరూం మేనేజర్.
'అన్నీ' అన్నాడు గోపాలం.
గోమతికి షోరూం వాళ్లు చేసే గౌరవానికి కారు ఓనరైనంత ఫీలింగ్ వచ్చేసింది.
'నో థాంక్స్!' అంది.. తాగితే లేకివాళ్లనుకుంటారేమోనని.
షోరూం వాళ్లిచ్చిన కాఫీ గోపాలం ఆబగా తాగుతుంటే కొరకొర చూసింది.
గోపాలం అవేవీ పట్టించుకోకుండా గబ గబా తాగేసి, మూతి తుడుచుకుని కప్పు టేబుల్ మీద పెట్టాడు.
రకరకాల కార్లని చూసిన గోమతి వెర్రిక్కెపోయి ప్రతి కారూ ఎక్కి, ఆనందపడిపోయింది. బాబిగాడు షోరూం వాళ్లిచ్చిన ఫైవ్‌స్టార్ చాక్లేటు చీకుతూ వాడు కూడా ప్రతి కారూ ఎక్కుతూ, దిగుతూ బిజీగా ఉన్నాడు.
'మా దగ్గర మాంఛి వింటేజ్ కారుందోరు! ఎక్సెఛేంజ్ ఆఫర్ ఉందా?' షో రూమ్ మేనేజర్‌ని అడిగాడు గోపాలం..
'ఏ మోడల్ సర్!?' అడిగాడతను..
'సెవెంటీస్ అనుకుంటాను, చాలా పేరున్న కారోరు!'
'మీరే ఉంచుకోండి సర్! ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా!' ఇండైరెక్టుగా చెప్పాడు మేనేజర్.
'ఓకే ఓకే, ఆ కారు మా ఫ్యామిలీ ప్రైడ్! ఇంటిముందు ఉండడమే గొప్ప.' అని స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్లి, సోఫాలో కూర్చున్నాడు.
షోరూమ్ కుర్రాళ్లు తమ మార్కెటింగ్ స్కిల్ బాగా వాడి గోమతి మెప్పు పొందారు. గోపాలాన్ని ఫైనాన్స్‌లో కారు కొనేలా ఒప్పించారు.
గోమతి ఎక్కిన కారు కీస్ ఆమె చేతికి, బెలూన్స్ కారుకి కొన్ని కట్టి, కాసిని బాబిగాడి చేతిలో పెట్టారు. కారు బిల్లు, ఫైనాన్స్ కాగితాలు మాత్రం గోపాలం చేతిలో పెట్టి, ఫొటో తీశారు.
బాలినో కారు స్టీరింగ్ గోపాలం పట్టుకుని, దేవుణ్ణి తలుచుకున్న వెంటనే 'ఢాం' మని పెద్ద శబ్దంతో బుడగ పేలింది. గోపాలం గుండె అదిరింది.
'శుభసూచకం! బాబిగాడు బుడగ పేల్చాడు. పోనీయండి !'... అంది గోమతి మంచి స్టైలుగా సీట్లో కూర్చుని.
గోపాలం స్మూతుగా డ్రైవింగ్ చేయడం చూసి ముచ్చటపడిపోయి...'అబ్బ! కారు ఎంత బాగా తోల్తున్నారండీ.' అంది హుషారుగా!
'అదేం భాషే! తోలడం! రెండెడ్ల బండెక్కినట్టు. కారెక్కగానే సరిపోదు. డీసెంటుగా, స్టైలుగా మాట్లాడాలి!'... అంటూ కారుని గుడి ముందు ఆపాడు.
***
తాపీగా కాపీ తాగుతూ టీవి పెట్టిన గోపాలానికి ఒక్కసారిగా గుండెల్లో వంద కార్లు పరుగెత్తిన ఫీలింగ్ కలిగింది. 'గోము! ఒక్కసారిలా రా! గట్టిగా గావుకేక పెట్టాడు.
'ఏమయ్యిందండి?...వంటింట్లోంచి పరుగెత్తుకుంటూ హల్లోకి వచ్చింది.
మాట పడిపోయిన గోపాలం టీవీ న్యూస్ చూడమని సైగ చేశాడు చేత్తో.
చమురు ధరలని ప్రభుత్వం అచ్చోసిన ఆంబోతుల్లాగ వదిలేస్తుందని, కంట్రోలు చేయదని, ఎవడిష్టమొచ్చినట్టు వాడు పెంచుకుపోవచ్చని దాని సారాంశం..
అలా వార్త వచ్చిన దగ్గర నుంచి చమురు రేట్లు చూరట్టుకుని వేలాడుతున్నాయి తప్ప, దిగి రావడం లేదు. గోపాలం చూస్తూ చూస్తూ పెళ్లాంబిడ్డల్ని వేసుకుని కారు ఎక్కలేకపోతున్నాడు. కొత్త కారుని రోజూ తళ తళ తుడవడం, దానికి గుడ్డ కప్పడం మాత్రం ఠంచనుగా చేస్తున్నాడు. కారు ఫైనాన్స్ వాయిదాలు భోరుమంటూ కడుతున్నాడు. బాబిగాడు ఇంటి ముందు ఉన్న కొత్తకారెక్కి 'డుర్! డుర్! పీ! పీ!' అంటూ ఆడుకుంటున్నాడు.
గోమతి పోరు పెడితే నెలకి ఒకసారి కారు బయటకి తీస్తూ.. ఎక్కువ తిరిగితే.. 'చమురొదిలిపోతుందే గోము!'... అంటూ సర్ది చెప్పలేక జుట్టు పీక్కుంటున్నాడు పాపం గోపాలం.
చాగంటి ప్రసాద్
90002 06163