
ప్రజాశక్తి - వన్‌టౌన్ : కార్టూన్స్ సమాజాన్ని అత్యంత దగ్గరగా ప్రతిబింబిస్తాయని ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల కోసా, ఉమెన్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు కార్టూన్స్ వేయటంపై శిక్షణా శిబిరాన్ని ఆ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపిశెట్టి మల్లయ్య విద్యార్ధులకు ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా స్వల్ప మాటలతో, చిట్టిచిట్టి బొమ్మలతో అద్భుతమైన సందేశాన్నిందించటమే కాకుండా ఆలోచింపజేస్తాయన్నారు. మానవ జీవితంలోని చాలా అంశాలను కార్టూనిస్టులు చాలా అద్భుతంగా వేసి సమాజాన్ని జాగృతం చేస్తున్నారని వివరించారు. విద్యార్ధులకు కార్టూన్స్‌లో శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలోని నైపుణ్యాలను పదును పెట్టడం అభినందనీయమన్నారు. పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యక్షులు చలవాది మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్ధులు తాము ఎంచుకున్న అంశాలలో నిరంతర సాధన చేయటం ద్వారా మరింత రాణింపును పొందాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, కమిటీ సభ్యులు యేండూరి కిషోర్, కార్టూనిస్టులు నాగిశెట్టి, రాము, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ నారాయణరావు అధ్యాపకులు డాక్టర్ జీ కష్ణవేణి, వీ శిరీష తదితరులు పాల్గొన్నారు.