ప్రజాశక్తి - వన్‌టౌన్
కార్తీక మాసం సందర్బముగా జిల్లా నలుమూలల నుంచి కార్తీక స్నానం ఆచరించడానికి విచ్చేయు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అధికారులను కోరారు. శనివారం పలు శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెలంపల్లి కష్ణా నది వద్ద గల పున్నమి ఘాట్ నందు పర్యటించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు సూచనలు ఇచ్చారు. నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇతర అధికారులతో కలిసి నగరంలోని స్నాన ఘాట్ లు అయిన దుర్గాఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్‌లను పరిశీలించి అన్ని శాఖల అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిసిపి విశాల్ గున్ని, పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సిపి కొల్లి శ్రీనివాస్, ట్రాఫిక్ ఏడిసిపి టి.సర్కార్, పశ్చిమ ఏ.సి.పి. డా.కె. హనుమంతరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










