Sep 30,2023 00:33

కార్పొరేటర్ల అర్జీలను పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి-గుంటూరు : కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారంపై వార్డుల వారీగా నివేదికివ్వాలని విభాగాధిపతులను నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. వార్డుల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై కార్పొరేటర్లతో కమిషనర్‌ తన ఛాంబర్‌లో శుక్రవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై ఉంటారని, వారు గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే ప్రజా సమస్యల పరిష్కారం, నగర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ప్రతి సోమవారం స్పందన, ప్రతి రోజు వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు ప్రజా స్పందన నిర్వహిస్తున్నామన్నారు. వార్డుల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు కూడా కమిషనర్‌తో చర్చించడానికి ప్రత్యేక సమయం కావాలని కోరిన దృష్ట్యా ప్రతి శుక్రవారం కార్పొరేటర్లు తమ వార్డుకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు అవకాశం ఉందన్నారు. మిగిలిన రోజుల్లోనూ కార్పొరేటర్లకు అందుబాటులో ఉంటామని, వాట్సప్‌లో తెలిపినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ల నుండి అందే అర్జీలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలను క్రమ పద్ధతిలో రికార్డ్‌ చేసి, తదుపరి చర్యలు కూడా వారికి తెలిపేలా అధికారులను ఆదేశించామని వివరించారు.
ఆరోగ్య సురక్ష క్యాంపులపై సమీక్ష
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భరోసా లభిస్తుందని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి అన్నారు. శనివారం నుండి నగరంలో జరగనున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌ల ఏర్పాటుపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, జిఎంసి అధికారులతో ప్రత్యేక సమావేశం కమిషనర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కమిషనర్‌ మాట్లాడుతూ ఈ నెల 30 నుండి నవంబర్‌ 15 వరకు ప్రత్యేకంగా నిపుణులైన వైద్యులతో ఆరోగ్య సురక్ష మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగంగా నగరంలోని 29 వైయస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద క్యాంప్‌లు జరుగుతాయని, అందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారిని సమన్వయం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో రోజుకు 1500 మందికి వైద్య పరీక్షలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి పరీక్షల నివేదిక, అవసరమైన మందులతో కిట్‌ని అందిచాలని అన్నారు. 45 రోజుల పాటు జగనన్న సురక్ష క్యాంప్‌లను వినియోగిం చుకోవాలని ప్రజలను కోరారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జయరామకృష్ణ, ఎస్‌ఇ. భాస్కర్‌, సిటీప్లానర్‌ ప్రదీప్‌ కుమార్‌, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, సిహెచ్‌.శ్రీనివాస్‌, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాను ప్రకాష్‌, మేనేజర్‌ శివన్నారాయణ, సూపరిండెంట్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.