ప్రజాశక్తి-జగ్గయ్యపేట: కేంద్ర బడ్జెట్ వల్ల పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కార్పొరేట్లకు మాత్రమే అనుకూలమైన బడ్జెట్ అని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం కేంద్ర బడ్జెట్‌పై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఐద్వా నాయకులు సోమోజు నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బడ్జెట్‌లో విభజన చట్టంలోని అంశాలు లేవని, ఏపీకి ప్రత్యేక హోదా వంటి ఊసే లేదన్నారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, ఐఐటి, ఐఐఏం, త్రిబుల్ ఐటీ వంటి వాటికి నిధులు కేటాయించలేదన్నారు. ఉపాధి హామీ, ఆహార సబ్సిడీ, ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఎరువులు, గృహ నిర్మాణాలకు ఈ బడ్జెట్‌లో నిధులు కోత విధించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న జరిగే బడ్జెట్ ప్రతుల దహన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కాకబోయిన లింగారావు, కోట కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, జుజ్జువరపు వెంకటరావు, షేక్ మీరాసాహెబ్, బాలు, కరీమా, బూసమ్మ, నాగరాణి, విజయలక్ష్మి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.










