
ప్రజాశక్తి-యంత్రాంగం
దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ కోసం ఆగస్టు 9 'క్విట్ ఇండియా' ఉద్యమ స్ఫూర్తితో 'క్విట్ కార్పొరేట్, సేవ్ ఇండియా' పేరుతో కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అనకాపల్లి:కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ కోసం ఆగస్టు 9 'క్విట్ ఇండియా' ఉద్యమ స్ఫూర్తితో 'క్విట్ కార్పొరేట్, సేవ్ ఇండియా' పేరుతో కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్ బస్టాప్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ కీలక రంగాలతో సహా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 900 రోజులుగా కార్మికులు పోరాడుతున్నా కేంద్ర వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించిందన్నారు. అఖిలభారత సమ్మెలతో పాటు అనేక పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలను పిలిచి చర్చించాలన్న ఇంగిత జ్ఞానం కూడా మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ధరలు ఆకాశానికి అంటి, వేతనాలు పాతాళానికి దిగిపోతున్నాయని, పేదరికం, ఆకలి, నిరుద్యోగం పెరుగుతోందని, సంపద మొత్తం అదాని, అంబాని వంటి కొంతమంది కార్పొరేట్ల చేతుల్లో పోగుపడి ఆర్ధిక సంక్షోభాలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం కొనసాగితే అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.శంకర్రావు, వివి.శ్రీనివాసరావు, గనిశెట్టి సత్యనారాయణ, భీశెట్టి అప్పారావు, బి.ఉమామహేశ్వరరావు (సిఐటియు), వైఎన్.భద్రం, తాకాశి వెంకటేశ్వరరావు (ఏఐటియూసి) శ్రీరామ్మూర్తి (తెలుగు రైతు), గంటా శ్రీరామ్ (చేతివృత్తుల సమన్వయ కమిటీ), రెడ్డిపల్లి అప్పలరాజు, కోరిబిల్లి శంకరరావు (ఏపీ రైతు సంఘం), బాలు గాడి (రైతు స్వరాజ్య వేదిక), కొణతాల హరినాథ్ బాబు (ఆప్), కర్రి అప్పారావు, గండి నాయన బాబు (రైతు సంఘం), రాజాన దొరబాబు (వ్యవసాయ కార్మిక సంఘం) ఐఆర్ గంగాధర్ (కాంగ్రెస్), సూదికొండ మాణిక్యాలరావు (బిఎస్‌పి), ఎం.నాగ శేషు (శ్రామిక మహిళ సమన్వయ కమిటీ), డిడి.వరలక్ష్మి (ఐద్వా), ఎ.బాలకృష్ణ (కౌలు రైతు సంఘం) పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్: క్విట్ ఇండియా స్ఫూర్తితో మోడీని ఓడిద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపులో బాగంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద బుధవారం నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే కేంద్రం ఆపాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలన్నారు. స్కీమ్ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేవారు. కనీస పెన్షన్ రూ.9,000 చెల్లించాలని, అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ, ఇన్యూరెన్స్‌తో కూడిన సమగ్ర చట్టం చేయాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు 200రోజులకు పెంచాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ఆప్త మిత్రులైన అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, బ్యాంకులను ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారని విమర్శించారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి యం.అప్పలరాజు మాట్లాడుతూ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో మోడీ ప్రభుత్వం దగా చేసిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలనీ డిమాండ్ చేశారు. రైతు కూలి సంఘం నాయకులు అజరు కుమార్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు ఊడిగం చేస్తూ పేదలపై భారాలు మోపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అడిగర్ల రాజు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఇ.చిరంజీవి, ఐద్వా నాయకులు కెవిఎస్ ప్రభ, ఎల్.గౌరీ, వ్యవసాయం సంఘం నాయకులు సత్తిబాబు, డేవిడ్, రైతు నాయకులు మేక సత్యనారాయణలు ప్రసంగించారు
నర్సీపట్నం టౌన్ : స్థానిక అబీద్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేవిపిఎస్ కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి మాట్లాడితూ, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కుల నిర్మూలన జరగలేదన్నారు. ఇప్పటికీ దళిత, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తగరపువలస : క్విట్ మోడీ, సేవ్ ఇండియా నినాదంతో కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని
సిఐటియు భీమిలి జోన్ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి మార్కెట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో కార్మికులకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ నరసింగరావు, ముఠా కార్మికులు ఈశ్వరరావు, రీసు చిన్నారావు పాల్గొన్నారు
గాజువాక : భెల్ మెయిన్ గేటు వద్ద సిఐటియు, ఎఐటియుసి సంయుక్త ఆధ్వర్యాన క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వకార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన చేపట్టారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించి, జిటిపి ప్రకాష్ మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు నాశనమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిహెచ్‌పివిని భెల్‌లోకి విలీనానికిు ఎన్నో పోరాటాలు చేసామని, అయినా భెల్‌లో ఇంకా ప్రైవేట్ షేర్లు ఉన్నాయన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి, వి బాబూరావు మాట్లాడుతూ, నాడు నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తే, నేడు మోడీ ప్రభుత్వం వాటిని ప్రయివేటు పరం చేస్తోదన్నారు.కార్యక్రమంలో, వి ఆనందరావు, ఎస్ జగన్నాధ రావు, సీతమ్మ నాయుడు, ఎస్ అప్పారావు, ఎస్ ఎల్ నరసింహులు, చిట్టిబాబు, మురళీ శ్వరరావు, కే నారపరెడ్డి పాల్గొన్నారు.