కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాజేస్తూ, రాష్ట్రాలను తన జేబు సంస్థలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమూ రాష్ట్రాల హక్కులను కాజేయడానికి సాహసించలేదు. కానీ ఈ ప్రభుత్వం రెండోసారి అధికారం లోకి వచ్చిన తరువాత భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలను రూపొందిస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు, బహుళజాతి గుత్త సంస్థలకు, పెట్టుబడిదారీ భూస్వాములకు, లాభాలు చేకూర్చి పెట్టడమేకాక, ఆస్తుల సంపదకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం చట్టాలను చేస్తున్నది.
నిత్యావసర వస్తువుల చట్ట సవరణ
బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఆలుగడ్డ, ఉల్లి, విత్తనాలు తదితర ఉత్పత్తులను...నిత్యావసర వస్తువుల చట్టం నుండి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 5, 2020న ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ చట్ట సవరణతో ప్రభుత్వానికి ధరల నిర్ణయంపైగానీ, ఆక్రమంగా నిల్వ చేసుకోవడంపై గానీ ఎలాంటి నియంత్రణ ఉండదు. సరుకులు కొనుగోలు చేసి మార్కెట్ల లోకి రానివ్వకుండా దాచిపెట్టుకొని అధిక రేట్లకు అమ్మి...రైతుల్ని, వినియోగదారులను దోచుకోవటానికి ఈ సవరణ లైసెన్స్ ఇచ్చింది. ఈ చట్టంలో ఉన్న సరుకులను తొలగించటానికి, చట్టపరంగా ఏ కోర్టులో దావా వేయడానికి వీలు లేదు. వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు ఉపయోగపడే ఇంత కీలక చట్టాన్ని కార్పొరేట్ వ్యాపారులకు లాభాలు కట్టబెట్టడానికి కేంద్రం సవరణ చేసింది. ఈ చట్టం లోక్‌సభ లోనూ, రాజ్యసభ లోను ఆమోదింపచేసుకున్నారు.
మార్కెట్ సమితులు,
ఎపియంసి చట్ట సవరణ చట్టం
రైతుల ఆదాయానికి భరోసా ఇచ్చేదిగా రైతులను మభ్య పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. 2020 జూన్ 5న ఆర్డినెన్స్ తెచ్చి...20 సెప్టెంబర్, 2020న లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ చట్టం ద్వారా కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండదు. క్రమంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయాన్ని కూడా ఎత్తివేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు ఇస్తున్న బోనస్‌లు, రాయితీలు, ఇతర రక్షణ చర్యలు రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ కంపెనీలు ఎగుమతి, దిగుమతులను కూడా నిర్వహిస్తాయి. ఎగుమతులు చేయడానికి ఇక్కడి వ్యవసాయోత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయాలి. ఆ రైతులకు గిట్టుబాటుకాక ఉత్పత్తి నుండి దూరం అవుతారు. ఆ తరువాత దిగుమతులపై దేశం ఆధారపడాల్సి వస్తుంది. చివరకు ఈ దేశం దిగుమతుల దేశంగా మారిపోతుంది. రైతులు కార్పొరేట్ సంస్థల చేతుల్లో బలిపశువులు అవుతారు.
ఒప్పంద సాగు (కాంట్రాక్ట్ ఫార్మింగ్) చట్టం
దీనిని 'ధరల గ్యారెంటీ ఒప్పంద సాగు, సేవల చట్టం-2020'గా పిలుస్తున్నారు. దీని ప్రకారం రైతులు కార్పొరేట్ సంస్థలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని సాగు చేయాలి. టోకు వ్యాపారస్తులతో, ఎగుమతిదారులతో, పెద్ద రిటైల్ సంస్థలతో మన రైతులు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి. కంపెనీ అంగీకరించిన ధరకు నిర్ణయించిన నియమాలకు అనుగుణంగా ఉత్పత్తులు చేయాలి. సహజంగా నియమాలకు అనుగుణంగా ఉత్పత్తులలో తేడాలు ఉంటాయి. వాటిని అవకాశంగా తీసుకొని నిర్ణయించిన ధరలు తగ్గించి కొనుగోలు చేస్తారు. కంపెనీ రేటు బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఒప్పందం రేటుకు రైతు అమ్మలేడు. తప్పనిసరిగా కొనాల్సిన స్థితి నుండి కంపెనీ తప్పించుకుంటుంది. అలాగే కాంట్రాక్ట్ వ్యవసాయంలో భూములను ఏకీకరణ చేసి భారీ యంత్రాలతో సాగు చేసి చివరకు రైతుల భూములను కాజేస్తారు. ఇప్పటికే దేశంలో 43 కోట్ల ఎకరాల సాగు భూమిలో 25 శాతం భూమి కాంట్రాక్ట్ వ్యవసాయం కిందనే సాగు అవుతున్నది. ఒకసారి కంపెనీ నియంత్రణ లోకి పోయిన తరువాత వారు ప్రమాదకరమైన జన్యు మార్పిడి విత్తనాలతోబాటు, సస్య రక్షణ మందులను కూడా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవేశ పెడతారు. ఆ విధంగా రైతులు భూముల నుండి నెట్టివేయబడతారు.
విద్యుత్ సవరణ చట్టం
కేంద్ర ప్రభుత్వం '2003 విద్యుత్ చట్టాని'కి సవరణ ముసాయిదాను 2020 ఏప్రిల్ 17న విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రాల విద్యుత్ హక్కులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. కేంద్రం కేటాయించిన విద్యుత్‌ను రాష్ట్రాలు వినియోగించుకోవాలి. అత్యధిక రేటు ఉన్న సంప్రదాయ విద్యుత్‌ను, కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించుకోవాలని చట్టంలో సూచించారు. చివరకు రాష్ట్రాల్లో రెగ్యులేటరీ కమిషన్‌ల పైన కేంద్ర రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి రేట్లు నిర్ణయిస్తారు. 2003 చట్టంలో 39 సవరణలు చేశారు. అందులో సెక్షన్ 109 కి 10 (ఏ) కొత్తగా చేర్చారు. ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. రీజినల్ డిస్పాచింగ్ బాధ్యతలు సెంట్రల్ డిస్పాచింగ్ పవర్‌కు బాధ్యతలు దఖలు పరుస్తారు. రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. ట్రాన్స్‌మిషన్, వీలింగ్ చార్జీలు తగ్గించి ఎక్కడి నుండి ఎక్కడికైనా విద్యుత్ సరఫరా చేసి ఉత్పత్తిదారులకు లాభాలు కట్టబెడతారు. ప్రస్తుతం దేశంలో సంప్రదాయ విద్యుత్ (హైడల్) 46 వేల మెగావాట్లు, సోలార్, పవన విద్యుత్ 70,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. దీని రేట్లు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ విద్యుత్‌ను వినియోగంలోకి తేవటానికి ఈ చట్టం సహకరిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు విపరితమైన లాభాలు చేకూర్చడానికి, వినియోగదారులపై రూ.వేల కోట్ల భారాలు వేస్తారు.
విత్తన చట్టం
కార్పొరేట్ల వత్తిడికి తలొగ్గిన మోడీ ప్రభుత్వం విత్తన చట్టం తేవటానికి నిరాకరిస్తున్నది. వాస్తవానికి రాష్ట్రాల లోనే విత్తన చట్టం చేయాలి. కానీ బడా, గుత్త, కార్పొరేట్ విత్తనోత్పత్తి సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి విత్తన చట్టం రాకుండా చూస్తున్నాయి. 1966 దిగుమతి విత్తన చట్టం నేటికీి కొనసాగుతూనే ఉన్నది. నేడు భారత దేశం విత్తనాలను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఈ స్థితిలో కూడా విత్తన చట్టం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి రైతులు కార్పొరేట్ విత్తన వ్యాపార సంస్థలకు బలిపశువులు అవుతున్నారు. రూ. వేల కోట్లు నష్టపోతున్నారు. కానీ విత్తన వ్యాపారులు మాత్రం పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు.
ఈ-నాం మార్కెట్
ఈ-నాం మార్కెట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2017లో తెచ్చింది. రాష్ట్రాల లోని మార్కెట్ చట్టాలను సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం విఫలమైందని స్వయంగా ప్రధాని మోడీ గత నెలలో ప్రకటించారు. అయినప్పటికీ ఈ చట్టం ప్రకారం ఏక గవాక్ష పద్ధతి, వ్యవసాయోత్పత్తి, మార్కెట్ కమిటీ సమాచారం, సేవలు తదితర అంశాలపై సవరణలు తెచ్చారు. మండీల ద్వారా ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ చేయటానికి ఇందులో సూచించారు. రాష్ట్రాల లోని అనేక మార్కెట్లు విడిగా నిర్వహణ చేయకుండా అన్ని మార్కెట్లను కలిపి ఈ-నాం పద్ధతి లోకి తెచ్చారు. దేశం లోని మార్కెట్లను ఆన్‌లైన్ ద్వారా ఏకీకరణ చేయడం, కార్పొరేట్ కొనుగోలుదారులకు అనుకూలంగా ధరలు నిర్ణయించడం జరిగింది. ఈ-నాం మార్కెట్‌లో ధరలు తగ్గడంతో రైతులు దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు జరపటానికి నిరాకరించారు.
నూతన విద్యా చట్టం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా చట్టం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండడానికి తగు రూపకల్పన చేసింది. రాష్ట్రాలలో మాతృభాషలో కాకుండా హిందీ, సంస్కృత భాషలను ప్రవేశ పెట్టడం, గత వాస్తవ చరిత్రలను మార్పు చేసి బిజెపిలో పని చేసిన నాయకుల చరిత్రలను పాఠ్యంశాలుగా చేర్చబోతున్నారు. చివరకు జోతిష్యాన్ని ఆస్ట్రాలజీ పేరుతో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి ప్రజలను భావవాదం వైపు నెట్టే విద్య విధానాన్ని అమలు చేయబూనుకున్నారు. ఇప్పటికే రాష్ట్రాలలో వారి భాషలలో ప్రాథమిక విద్యనే కాక ఉన్నత విద్య వరకు బోధనలు జరుగుతున్నాయి. వీటిని మార్చడానికి నూతన విద్యా విధానం పేరుతో కేంద్రం ప్రవేశ పెట్టిన విధానం వలన దేశంలో నేడు ఉన్న విద్య ప్రమాణాలు తగ్గిపోతాయి. పరిశోధనలు, నూతన టెక్నాలజీ ఆవిష్కరణలు లేకుండా పోతాయి.
'ఒకే దేశం, ఒకే భాష, ఒకే మార్కెట్, ఒకే పన్ను' పేర్లతో ఇంత వరకు అనేక చట్టాలను తెచ్చి రాష్ట్రాల హక్కులను కాజేశారు. ఒకే పన్ను పేరుతో జిఎస్‌టి అమలు లోకి తెచ్చి నేడు రాష్ట్రాలకు రూ. 3 లక్షల కోట్ల నష్టాలను కలిగించారు. ఇందులో పెట్రోల్‌పై సెస్ వేసి రూ.67,000 కోట్లు కేంద్రం ఇస్తానని, మిగిలిన రూ. 2.33 లక్షల కోట్లను రాష్ట్రాలే బయట అప్పులు తెచ్చుకోవాలని... ఇది దైవ నిర్ణయమని మోడీ ప్రభుత్వం చెప్తున్నది. ఇంత వరకు తెచ్చిన చట్టాల వల్ల ఇప్పటికే రాష్ట్రాలు కేంద్రం చుట్టూ చేతులు కట్టుకొని రాష్ట్రాలు తిరిగే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష తరహా పాలన ప్రమాదాన్ని రాష్ట్రాలు గుర్తించి కేంద్రం తెస్తున్న చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించాలి. వీటిని రాష్ట్రాలలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రస్తుత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోటానికి, ఫెడరల్ విధానాన్ని రక్షించుకోటానికి లౌకికవాదులు, మేధావులు, దేశాభివృద్ధి కోరేవారు ఐక్యంగా కృషి చేయాలి.
(వ్యాసకర్త సెల్ : 9490098666)










