Mar 28,2023 20:39

చలో ఢిల్లీ పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

కార్పొరేట్లకు మోడీ ఊడిగం
- అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థల అప్పగింత
- చలో ఢిల్లీని జయప్రదం చేయండి : సిఐటియు నేతలు
ప్రజాశక్తి - నంద్యాల

       కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల, ఉద్యోగుల ప్రజల సమస్యలను పరిష్కారం చేయకుండా కేవలం పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పజెప్పి భద్రత లేకుండా చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌, కె మహమ్మద్‌ గౌస్‌లు విమర్శించారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏప్రిల్‌ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేసి 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఎరువులు ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు రోజువారి కూలి వేతనం 600 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని దినాలు కల్పించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 5న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లా నుంచి కార్మికులు, రైతులు, ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కోశాధికారి పి.వెంకట లింగం, నాయకులు జైలాన్‌, మధు, కార్మికులు పాల్గొన్నారు. శిరివెళ్ల : దేశవ్యాప్తంగా రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరల చట్టం, విద్యుత్‌ సంస్కరణల బిల్లును 2022ను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తలారి రామచంద్రుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 5న ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని గుండంపాడు, బోయలకుంట్ల గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతుల ఢిల్లీ ఉద్యమంలో లిఖితపూర్వకంగా ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏప్రిల్‌ 5న అఖిలభారత కిసాన్‌ సభ, అనుబంధ ఎపి రైతు సంఘం, సిఐటియు, వ్యకాసం ఆధ్వర్యంలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు, కూలీలు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతు నాయకులు శ్రీనివాసులు, వ్యకాసం నాయకులు మద్దిలేటి, కోటకొండ భాష, సిఐటియు నాయకులు చిట్టెపురెడ్డి రమణ, నాగార్జున, ఆవులన్న, భాష, సంజీవ రాయుడు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.